దిశ దశ, ఒడిషా:
ఒడిషా రైలు దుర్ఘటనపై దర్యాప్తు వేగవంతంగా జరుపుతున్నారు అధికారులు. ఓ వైపున సహాయక చర్యలు పూర్తి చేసి మరో వైపున ట్రాక్ పునరుద్దరణపై దృష్టి సారించడంతో పాటు ఘటనకు మూల కారణం ఏంటా అని ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ఈ ఘటన వెనక కుట్ర కోణం ఏమైనా దాగుందా అన్న విషయంపై దృష్టి పెట్టడంతో పాటు సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయా లేక… మానవ తప్పిదం ఉందా అన్న వివరాలు సేకరిస్తున్నారు. రైల్వే భద్రతా విభాగానికి చెందిన కమిషనర్ ప్రమాదానికి కారణాలు ఏంటన్న విషయంపై లోతుగా దర్యప్తు ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టం పాయింట్ మిషన్ సెట్టింగ్స్ మార్చారని ప్రాథమికంగా విచారణలో తేలింది. కొద్దిసేపటి క్రితం ఘటనా స్థలంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన తప్పిదాన్ని గుర్తించడంతో పాటు ఇందుకు భాద్యులైన వారిని కూడా గుర్తించినట్టు సూత్రపాయంగా వెల్లడించారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదిక అందిన తరువాత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ట్రాక్ పునరుద్దరణ
అయితే తమ ప్రధాన దృష్టి మాత్రం ట్రాక్ పునరుద్దరించి రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగే విధంగా చేపట్టాల్సిన చర్యలపైనే ఉంచామని కేంద్ర మంత్రి వివరించారు. రైలు పట్టాలను తిరిగి ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం అయ్యామని బుధవారానికల్లా ట్రాక్ పనులు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.
సంఘ్ పరివార్ సేవలు…
బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో గాయాల పాలైన వారికి సేవలందించేందుకు ఒరిస్సా ప్రాంత ఆర్ఎస్సెస్, ఏబీవీపీ విభాగాలకు చెందిన సుమారు వెయ్యి మంది కార్యరంగంలోకి దూకారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సపరిచర్యలు చేస్తున్నారు. ప్రధానంగా క్షతగాత్రులకు ఆహారం, నీరు అందించడంతో పాటు వారి కుటుంబాలకు సమాచారం ఇప్పించే పనిలో సంఘ్ పరివార్ సేవలు అందిస్తోంది. అంతే కాకుండా రక్తం కూడా పెద్ద ఎత్తున డొనేట్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులకు చేదోడుగా నిలుస్తున్నారు. మృత దేహాలను గుర్తించడం, స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన సాయం కూడా అందిస్తున్నారు.
రక్తదాతలు భేష్…
బాలసోర్ ఘటనలో గాయపడిన వారికి అత్యవసర సేవలందించే వైద్య సిబ్బంది ఎంత ముఖ్యమో ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న వారికి రక్తం అందించే వారు కూడా అవసరం. ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువత రైలు ప్రమాదం జరిగిన శుక్రవారం రాత్రి నుండే స్థానిక ఆసుపత్రుల వద్ద క్యూ కట్టారు. బ్లడ్ డోనేట్ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ ఆసుపత్రులకు చేరారు. ఇప్పటికే 2 వేల మంది తాము రక్తం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఫోన్లు కూడా చేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ అక్కడి వైద్య విభాగం 700 యూనిట్ల రక్తాన్ని సేకరించి సిద్దంగా ఉంచింది. ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాల్లో ఇలా రక్త దానం చేసేందుకు భారీ ఎత్తున ముందుకు వచ్చిన ఘటన బాలసోర్ ప్రమాద బాధితుల విషయంలో మాత్రమే జరిగిందని చెప్పవచ్చు. సహాయక చర్యలు అందించడం, ఆహారం ఇవ్వడం సాధారణంగా జరుగుతుండేదే కానీ బ్లడ్ డొనేట్ చేసే విషయంలో ఇంతపెద్ద సంఖ్యలో యువత ముందుకు రావడం ఇదే ప్రథమం.