దిశ దశ. రాజన్న సిరిసిల్ల:
ఉపాధి కల్పిస్తామంటూ విదేశాలకు తీసుకెళ్లి సైబర్ క్రైమ్స్ చేయిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. అంతర్జాతీయ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న ఈ నెట్ వర్క్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. ఉపాధి కోసం కంబోడియాకు వెల్లి కష్టాలు పడుతున్న తన కొడుకును కాపాడాలని ఓ తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం టూరిస్టు వీసాలను… జాబ్ వీసాలని చెప్పి మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ ముఠా మాత్రం ఎంప్లాయిమెంట్ కల్పిస్తామని చెప్పి కంబోడియాకు తీసుకెళ్లి సైబర్ నేరాలు చేయిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కంబోడియాలోని చైనీస్ కంపెనీల్లో సైబర్ మోసాలు చేయిస్తున్న ఈ ముఠా గురించి ఆరా తీశామని ఎస్పీ తెలిపారు. సిరిసిల్ల సమీపంలోని పెద్దూరుకు చెందిన అతికం లక్ష్మీ నాలుగు రోజుల క్రితం పోలీసు అధికారులను కలిసి ఓ ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ తన కొడుకు శివ ప్రసాద్ కు కంబోడియాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 1.40 లక్షలు తీసుకున్నాడని పేర్కొంది. అయితే కంబోడియాకు వెల్లిన తన కొడుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడని అతన్ని కాపాడాలని కోరింది. దీంతో పోలీసులు వాట్సప్ కాల్ ద్వారా అతికం శివ ప్రసాద్ తో మాట్లాడగా చైనీస్ కంపెనీలో తన పాస్ పోర్ట్ తీసుకుని సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నారని వివరించాడు. తనలా భారతదేశానికి చెందిన వారు 600 మంది వరకూ ఉన్నారని కూడా తెలిపాడు. వారందరి కోసం కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి భారతీయులకు చెందిన ఫోన్ నంబర్లు ఇచ్చి లాటరీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ వంటి టాస్కులు ఇస్తున్నారని కూడా శివ ప్రసాద్ వివరించారు. తాము అప్పగించిన టాస్కుల్లో ఎక్కువ చేసిన వారికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్తూ సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నారని కూడా తెలిపాడు. వెంటనే కార్యరంగంలోకి దిగిన సిరిసిల్ల పోలీసులు కంబోడియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులకు అక్కడ జరుగుతున్న నేరాల గురించి వివరించి శివప్రసాద్ కు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. ఎంబసీ అధికారులు కంబోడియా పోలీసుల సహకారంతో రెస్క్యూ నిర్వహించిన శివప్రసాద్ ను సేవ్ చేశారు. రెండు మూడు రోజుల్లో భాధితుడు స్వస్థలానికి చేరుకోనున్నాడు.
నెట్ వర్క్…
కంబోడియాలో ఉపాధి కల్పిస్తామంటూ ఈ ముఠా ఇండియాకు సంబంధించిన కొందరిని కమిషన్ ఏజెంట్లుగా నియమించుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సాయి ప్రసాద్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. రూ. 10 వేల కమిషన్ తీసుకుని ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన సుధాకత్ అనే వ్యక్తికి పంపించినట్టుగా వెల్లడించాడు. అయితే ప్రస్తుతం మాల్దివుల్లో ఉన్న సుధాకత్ రూ. 10 వేల కమిషన్ తీసుకుని మహారాష్ట్రలోని పూణేకు చెందిన అబీద్ అన్సారికి పంపించాడు. ఆయన బీహార్ నివాసి ప్రస్తుతం దుబాయిలో ఉంటున్న షాదబ్ అనే వ్యక్తికి పంపించగా ఆయన కంబోడియాకు పంపిస్తాడని పోలీసులు విచారణలో గుర్తించారు. నలుగురు నిందితుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్, పూణేకు చెందిన అబిద్ అన్సారీని అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. కంబోడియాలో చైనీస్ కంపెనీల వలలో చిక్కుకున్న మిగతా భారతీయులను కూడా త్వరలోనే ఇండియాకు రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని కూడా వివరించారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ రఘుపతి, టాస్క్ ఫోర్స్ సీఐ ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.
కండ్లు… వేళ్లు మనవే…
దుబాయ్ కేంద్రాంగా ఈ నెట్ వర్క్ నడుపుతున్న బీహారీ షాబాద్, పూణేకు చెందిన అబీద్ అన్సారీ, జగిత్యాలకు చెందిన సాయి ప్రసాద్ ముగ్గురు కూడా భారతీయులే కాగా కంబోడియాలో ఉపాధి కోసం పంపిస్తున్నది కూడా ఇక్కడి వారినే కావడం గమనార్హం. మరో వైపున అక్కడికి చేరుకున్న నిరుద్యోగుల పాస్ పోర్ట్ లు లాక్కుని భారతీయులచే భారతీయలనే మోసం చేయిస్తున్న తీరు గమనార్హం. అక్కడి చైనీస్ కంపెనీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో నిందితులు, భాధితులు అంతా కూడా భారీతీయులే కావడం గమనార్హం. రూ. 10 వేల కమిషన్ కోసం ఆశపడి వెనకా ముందు ఆలోచించకుండా మీడియేటర్లను నమ్మి ఇక్కడి వారిని మోసం చేసే ప్రక్రియకు నడుం బిగించడం విస్మయానికి గురి చేస్తోంది. ఉపాధి పేరిట కంబోడియాకు రప్పించుకుంటున్న చైనీస్ కంపెనీ ఇక్కడి వారిచే సైబర్ ఫ్రాడ్స్ చేయిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు గడిస్తోంది. అక్కడికి వెల్లి చేస్తున్న పని కూడా నేరాలకు సంబంధించిందేనన్న విషయం తెలియక ఇక్కడి యువత రూ. లక్షలు పోసీ మరీ కంబోడియాకు చేరుకుంటోంది. బాధితుడు శివప్రసాద్ సిరిసిల్ల పోలీసులకు వివరించిన ప్రకారం సుమారు 600 వరకు భారతీయులు చైనీస్ కంపెనీ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లలో పనిచేస్తున్నారు. వీరి పాస్ పోర్టులు లాక్కుని బెదిరింపులకు గురి చేస్తుండడంతో తిరిగి ఇంటికి చేరే పరిస్థితి లేక వారి చెరలో చిక్కుకున్న ఇండియన్స్ సైబర్ క్రైమ్స్ చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. శివప్రసాద్ తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదుతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేయడంతో ఇంటర్నేషనల్ స్కాం బయట పడింది.