ఇండియా నుండి మానవ అక్రమ రవాణా… చైనీయులకు విక్రయిస్తున్న నకిలీ ఏజెంట్లు…

బాధితుల పిర్యాదుతో వెలుగులోకి

దిశ దశ, జగిత్యాల:

ఉపాధి కోసం అల్లాడుతున్న యువకులను ఆకట్టుకుని డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట విమానం ఎక్కించి మానవ అక్రమ రవాణాకు పాల్పుడుతున్నారు కొంతమంది నకిలీ ఏజెంట్లు. తమ కమిషన్ల కోసం నిరుద్యోగుల కుటుంబాలతో చెలగాటమాడుతున్న మరో ముఠా తతంగం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఫ్రాడ్ కాల్స్ చేసి బాధితుల అకౌంట్ల డబ్బులు బదిలీ చేసుకునే పనికి పురమాయించేందుకు కొలంబియా కేంద్రంగా ఏర్పాటు చేసిన చైనీస్ కాల్ సెంటర్ల వ్యవహారం వెలుగులోకి రాగా ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫారాలపై అమ్మాయిలో ముసుగులో ఎన్ఆర్ఐలతో ఛాటింగ్ చేస్తూ వారి అకౌంట్లను దోచే పనికి పురమాయిస్తున్న మరో అంతర్జాతీయ మాఫియా ముఠా వ్యవహారం బయటపడింది. స్థానికంగా ఉన్న ఏజెంట్లు లావోస్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఛీటింగ్ చేస్తున్న విసయం జగిత్యాల జిల్లాకు చెందిన కొంతమంది బాధితులు స్థానిక ఎస్పీ అశోక్ కుమార్ ను కలిసి తమ గోడు చెప్పుకోవడంతో ఇంటర్నేషనల్ స్కాం తెలిసింది.

మానవ అక్రమ రవాణా…

లావోస్ లో డాటా ఎంట్రీ ఉపాధి కల్పిస్తామని చెప్పిన గాజర్ల వంశీ మాటలు నమ్మిన జగిత్యాల, రాయికల్ కు చెందిన పలువురు యువకులు అతనికి డబ్బులు చెల్లించారు. తీరా బ్యాంకాక్ చేరి లావోస్ కు చేరుకున్న తరువాత అసలు విషయం తెలిసిందని బాధితులు వాపోయారు. బారతీయులను ఎంప్లాయిమెంట్ పేరిట లావోస్ పంపిస్తూ అక్కడి మాఫియా నుండి ఒక్కొక్కరి నుండి రూ. 2.50 లక్షలు తీసుకుని అమ్మేస్లున్నారని గుర్తించారు. లావోస్ లోని మాఫియా జోన్ లోకి చేరుకున్న తరువాత కంపెనీల ప్రతినిధులకు అగ్రిమెంట్ చేయాల్సి ఉండడంతో వారి కార్యాలయంలో వెయిట్ చేస్తున్న క్రమంలో అక్కడ జరుగుతున్న తంతు తెలిసింది. మాఫియా ప్రతినిధులతో అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే మీరంతా తిరిగి ఇళ్లకు చేరే పరిస్థితి ఉండదు, మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు ఉండవని అక్కడున్న ఇతర భారతీయులు చెప్పారు. అంతేకాకుండా మహిళల ముసుగులో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా చాటింగ్ చేయాల్సి ఉంటుందని, అది కూడా అమెరికా వంటి దేశాల్లో స్థిరపడిన బారతీయులతో మాత్రమేనని చెప్పారు. ఛాటింగ్ ద్వారా టచ్ లోకి వచ్చిన NRI అకౌంట్ల నుండి డబ్బులు మాఫియాకు చెందిన హాకర్స్ తమ అకౌంట్లలోకి బదిలీ చేసుకుంటారు. మాఫియా ప్రతినిధులు చెప్పినట్టుగా నడుచుకోకపోతే చిత్ర హింసలకు గురి చేస్తారని వారికి ఆహారం కూడా ఇవ్వరని లావోస్ లో ఉన్న వారు చెప్పడంతో జగిత్యాల జిల్లాకు చెందిన యువకులు తాము మోసపోయామని గుర్తించారు. వెంటనే అక్కడి నుండి తప్పించుకుని ఇండియాకు వచ్చామని తమకు ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేసిన గాజర్ల వంశీని అడిగితే మొదట డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి రెండు మూడు రోజుల తరువాత ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పి బెదిరించాడని బాధితులు వివరించారు.

రోమన్ @ రాజ్ కుమార్

లావోస్ లోని మాఫియా జోన్ లో బోస్ అనే హెచ్ ఆర్ ఉన్నాడని అతనితో పాటు రోమన్ అనే వ్యక్తి కూడా కలిశాడన్నారు. అయితే ఆ రోమన్ అనే వ్యక్తి అసలు పేరు రాజ్ కుమార్ అని అతనిది కూడా జగిత్యాల జిల్లా ధర్మపురి అని బాధితులు వివరించారు. సోషల్ మీడియా ద్వారా స్కాం చేయించేందుకు ఏర్పాటు చేసిన మాఫియాతో అగ్రిమెంట్ పూర్తయిన వెంటనే చైనీయుల పేర్లు పెట్టుకోవల్సి ఉంటుందని, తమ వెంట తీసుకొచ్చిన మొబైల్ ఫోన్ నిర్వాహాకులకు అప్పగించాల్సిందేనని వెల్లడించారు. సోషల్ మీడియా స్కాం మాఫియా ఇచ్చే ఐ ఫోన్ ద్వారా మాత్రమే ఛాటింగ్ చేయాల్సి ఉంటుందని వివరించారు.

అన్ని వారే…

ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న లావోస్ సోషల్ మీడియా ఛాటింగ్ మాఫియానే వారికి కమిషన్ చెల్లిస్తోందని, ఇక్కడి నుండి తరలిస్తున్న నిరుద్యోగుల ఫ్లైట్ టికెట్లు కూడా చెల్లిస్తోందని బాధితులు చెప్పారు. అయితే ఇక్కడున్న నకిలీ ఏజెంట్లు నిరుద్యోగుల నుండి కూడా డబ్బు వసూలు చేస్తూ, ఇంటర్నేషనల్ మాఫియా నుండి కమిషన్లు తీసుకుంటున్నట్టుగా స్పష్టం అవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ఈ స్కాంలో ఎన్ఆర్ఐలను ఇండియన్స్ చే చీటింగ్ చేయించేందుకు చైనీయులు సరికొత్త వ్యూహం పన్నినట్టుగా అర్థమవుతోంది. ఏది ఏమైనా విదేశాల్లో ఉపాధి అవకాశాల పేరిట ఆపర్లు వస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

You cannot copy content of this page