దిశ దశ, అంతర్జాతీయం:
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పారిశ్రామిక అభివృద్దే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డిలు అంతర్జాతీయ కంపెనీలతో సమావేశం అయ్యారు. కోకా కోలా కంపెనీ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన విధంగా సహకారం అందిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా కోకా కోలా గ్రూప్స్ డైరక్టర్ జోనథన్ రీఫ్ తో అట్లాంటాలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితుల గురించి జోనథన్ రీఫ్ కు వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంస్థకు సంపూర్ణ సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కోకా కోలా డైరక్టర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు పెరిగాయని, ఆయా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని కూడా వివరించారు. కోకాకోలా కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టయితే కూడా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని ఆయనకు తెలిపారు. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నామని జోనథన్ మంత్రులు శ్రీధర్ బాబు, వెంకట్ రెడ్డిలకు వివరించారు. మంత్రులతో పాటు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ విష్ణువర్దన్ రెడ్డితో పాటు అధికారుల బృందం హాజరయింది.