దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాద్ అభివృద్ది విషయంలో ఎంతో శ్రద్ద తీసుకున్న మీరు నియోజకవర్గ అభివృద్ది కోసం రూ. 2వేల కోట్లు కెటాయించడంతో పాటు ఆరుగురికి పదవులు కట్టబెట్టిన తీరు ఎంతో ఆదర్శప్రాయమని బీఆర్ఎస్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు. అయితే ఇక్కడి ఇంఛార్జి వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందరికీ ఇబ్బందులు కల్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అక్రమార్కులను అందలం ఎక్కిస్తూ… నియోజకవర్గంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. నియోజకవర్గంలోని ఎస్సీ, బీసీ నాయకులపై దురుసుగా వ్యవహరించడంతో పాటు ఇష్టారీతిన మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యవహార శైలితో సీనియర్ నాయకుల మనో భావలు దెబ్బతింటున్నాయన్నారు. స్థానికంగా తనకు అనుకూలమైన అధికారులను నియమించుకుని ఆయన తీరు మీ వరకు చేరకుండా జాగ్రత్త పడుతున్నారని సమ్మిరెడ్డి అన్నారు. ప్రత్యేకంగా హుజురాబాద్ ఇంఛార్జీగా ఉన్న కౌశిక్ రెడ్డి తీరుపై సమగ్ర విచారణ జరిపింది నివేదికలు తెప్పించుకోవాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో పార్టీ పతనం అవున్నందున వెంటనే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాలని తుమ్మేటి సమ్మిరెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటి రామారావుకు లేఖ కూడా రాశారు.
