ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంస్థలు
దిశ దశ, కరీంనగర్:
మయన్మార్ ఘటనతో అంతర్జాతీయంగా మావన అక్రమ రవాణా అంశం తెరపైకి వచ్చింది. ఉపాధి ముసుగులో భారతదేశ యువతను ఈ రొంపిలొకి దింపుతున్న తీరు బట్టబయలు అయింది. ఈ ఇంటర్నేషనల్ స్కాం గురించి జాతీయ, రాష్ట్రీయ దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవడంతో 540 మంది యువత స్వస్థలాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. వారి నుండి పూర్తి వివరాలు సేకరించిన దర్యాప్తు సంస్థల అధికారులు చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీల బాగోతాన్ని కట్టడి చేయాలన్న యోచనలో ఉన్నట్టుగా సమాచారం. జగిత్యాల, మానకొండూరు పోలీస్ స్టేషన్ లలో నమోదయిన కేసుల ఆధారంగా కింగ్ పిన్స్ ఎవరూ అన్న కోణంలో ఆరా తీసే పనిలో పడ్డాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు
ధర్మపురి వాసి…
ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్దారించిన అంశాలు సంచలనంగా మారాయి. జగిత్యాల జిల్లా ధర్మపురికి పట్టణ నివాసి, ప్రస్తుతం జగిత్యాల టౌన్ లో నివాసం ఉంటున్న వ్యక్తి భూమిక కూడా ఉన్నట్టుగా స్పష్టం అయింది. శ్యాంరావు రాజశేఖర్ అలియాస్ రోమన్ నిరుద్యోగులకు విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని ఎరవేసే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా జగిత్యాల జిల్లాకు చెందిన కొంతమంది యువకులకు విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని పంపించి సైబర్ క్రైం ఉచ్చులోకి దించారు. ఈ ఘటనలో బాధితులు ధర్మపురికి చెందిన శ్యాంరావు రాజశేఖర్ పేరును ప్రస్తావించారు. ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత మయన్మార్ లో చిక్కుకోవడం వారిని క్షేమంగా భారతదేశానికి రప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియాకు వచ్చిన బాధితులు కూడా శ్యాంరావు రాజశేఖర్ పై ఫిర్యాదు చేశారు. భారతదేశంలోని యువతకు విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పి వారిని చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీలకు విక్రయించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాడని నిర్దారించారు.
ఉపాధి కోసం వెల్లి…
మొదట గల్ఫ్ దేశంలో ఆఫీసు బాయ్ ఉద్యోగం కోసం వెల్లిన శ్యాంరావ్ రాజశేఖర్ అలియాస్ రోమన్ మానవ అక్రమ రవాణాకు ముందు ఏమేం చేశాడు అన్న వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇంటర్మీడియెట్ వరకు చదువకున్న రోమన్ 2021 నుండే విదేశాలకు వెల్లేందుకు ప్రయత్నించి 2023లో గల్ఫ్ కంట్రీస్ కు వెల్లినట్టుగా తెలుస్తోంది. విదేశాల్లో ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో రాజస్థాన్ లోని రామ్ దేపిర్ సమీపంలోని వంకర్వాస్ నివాసి అయిన హితేష్ అర్జున్ సోమయ్యతో పరిచయం అయినట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2024లో వీరిద్దరూ థాయిలాండ్, లావోస్, వియాత్నంలలో పనిచేస్తున్నప్పటి నుండే భారతదేశంలోని నిరుద్యోగులకు ఎరవేసే పనిలో నిమగ్నం అయినట్టుగా తేలింది. ఉత్తరాది నుండి దక్షిణాది వరకు అన్ని ప్రాంతాల యువతను సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార సాధనాలను ఉపయోగించుకుని ఎంప్లాయిమెంట్ కల్పిస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. రూ. 80 నుండి లక్ష వరకు నెల నెల ఆదాయం ఉంటుందని చెప్పి రూ. 70 వేల నుండి 4 లక్షల వరకు ఒక్కొక్కరి వద్ద వసూలు చేసినట్టుగా గుర్తించారు. కొంతమంది నిరుద్యోగులకు మొదట ఇతర దేశాలకు పంపించడం అక్కడి నుండి చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీల్ డెన్ ఏర్పాటు చేసుకున్న దేశాలకు పంపిచడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కంబోడియా, మయన్మార్ దేశాల్లో మాత్రమే చైనీస్ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ డెన్లను ఏర్పాటు చేసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ఇంకా ఏఏ దేశాల్లో వీరు తమ సామ్రాజ్యాన్ని విస్తరించి ఉంటారోనన్న విషయం తేలాల్సి ఉంది. అయితే భారత్ నుండి ఉపాధి కోసం వెల్లే వారి నుండి డబ్బులు వసూలు చేయడంతో పాటు చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీల ప్రతినిధులకు విక్రయిస్తున్నట్టుగా తేలింది. ఒక్కో యువకుడిని అప్పగించినందుకు 3 వేల డాలర్ల వరకు హితేష్ అర్జున సోమయ్య, శ్యాంరావు రాజశేఖర్ లకు చెల్లిస్తున్నాట్టుగా ప్రాథమిక సమాచారం.
ముఠాలతో సంబంధాలు…
అయితే శ్యాంరావు రాజశేఖర్ కు చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీలతో నేరుగా లింక్స్ ఉన్నాయా లేదా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. రాజస్థాన్ కు చెందిన హితేష్ అర్జున సోమయ్యకు మాత్రం సైబర్ క్రిమినల్ ముఠాలతో డైరెక్ట్ కాంటాక్టు ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. రాజశేఖర్ అలియాస్ రోమన్ హితేష్ కు కమిషన్ ఏజెంటుగా వ్యవహరిస్తున్నాడన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే మరింత లోతుగా దర్యాప్తు చేసిన తరువాత పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని దర్యాప్తు సంస్థల అధికారులు అభిప్రాయ పడుతున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా మానవ అక్రమ రవాణా అంశాన్ని తీవ్రంగా పరిగణించనట్టయితే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. నిరుద్యోగ యువత జీవితాలే నాశానం కాకుండా వారితో ప్రపంచ వ్యాప్తంగా కూడా సామాన్యుల అకౌంట్ల నుండి డబ్బులు డ్రా చేయించినట్టయితే కోట్లాది మంది డబ్బులు ఫ్రాడ్ కంపెనీల చేతుల్లోకి వెల్లిపోయేవన్నది మాత్రం నిజం.