అతనిపై పలు కేసులు ఉన్నాయంటున్న పోలీసులు
దిశ దశ, హుజురాబాద్:
జమ్మికుంట సీఐ రవితో మాట్లాడిన ఆడియో లీక్ అయిన తరువాత పోలీసు అధికారులు కార్యరంగంలోకి దిగారు. ఈ ఆడియోలో ఉన్న అంశాల ఆధారంగా వివిధ కోణాల్లో ఆరా తీశారు పోలీసు అధికారులు.
10 వేల కోసం…
గత నవంబర్ 28న ఓ డైరీలో పనిచేస్తున్న వ్యక్తికి జీతం ఇచ్చే విషయంలో యజమాని మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు డైరీ యజమానితో మాట్లాడి అదే రోజు రాత్రి కులం పేరుతో దూషించిన కేసు నమోదు చేశారు. డిసెంబర్ 12నే పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు రావాలని సూచించారు. ఈ కేసులో నిందితుల పేర్లు తొలగించే విషయంలో సీఐ తనవద్ద రూ. 3 లక్షలు తీసుకున్నాడని సీఐ ఛాంబర్ లోని అవి బాత్రూం బకెట్లో పెట్టానని ఇందుకు సంబంధించిన వీడియో తనవద్ద ఉందని షేక్ సాబీర్ అనే వ్యక్తి సీఐ రవితో చెప్తాడు. ఇందుకు సంబంధించిన ఆడియోను లీక్ చేయడంతో పోలీసు అధికారులు చేసిన విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. డైరీలో పనిచేస్తున్న వ్యక్తికి ఇవ్వాల్సిన రూ. 10 వేల కోసం రూ. 3 లక్షలు లంచంగా ఇవ్వాల్సిన అవసరం ఏందుకు ఉంటుందని, అందులో రూ. 10 వేలు ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఇస్తే రాద్దాంతం చేయాల్సిన అవసరమే ఉండదు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ జారీ చేసిన తరువాత ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేయాల్సిన కేసులో సీఐ డబ్బులు ఎందుకు తీసుకున్నాడన్న విషయంపై కూడా పోలీసు అధికారులు వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. తాజాగా విడుదల అయిన ఆడియో కూడా నెల రోజుల క్రితం సీఐతో మాట్లాడిందని పోలీసు అధికారులు గుర్తించారు.
సాబీర్ పై పలు కేసులు…
మరో వైపున షేక్ సాబీర్ పై పలు కేసులు నమోదయ్యాయని జమ్మికుంట పోలీసుల పేరిట విడుదలైన ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో నివాసం ఉంటున్న సాబీర్ అలీ ఒక బ్లాక్ మెయిలర్ అని అందులో పేర్కొన్న పోలీసులు 2023లో మునిసిపల్ కమిషనర్ సమ్మయ్యను రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో 192/2023 క్రైం నంబర్ లో కేసు నమోదు అయిందని, సురక్ష హస్పిటల్ ఘటనలో రూ. లక్ష డిమాండ్ చేయగా క్రైం నంబర్ 402/2023, 2020లో మేకల ఐలయ్యను దూషించడంతో క్రైం నంబర్ 332/2020 కేసు నమోదయిందని వెల్లడించారు. సామాజిక కార్యక్రత్, హెచ్ఆర్సీ ముసుగులో అతను చేస్తున్న బెదిరింపులపై బాధితులు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.