దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులు మిస్సయ్యాయా..? రికార్డులను పరిశీలించిన విజిలెన్స్ ఉన్నతాధికారులు మళ్లీ రంగంలోకి దిగాల్సి వచ్చిందా..? కొన్ని హార్డ్ డిస్కులు మిస్ అయ్యాయన్న విషయాన్ని గుట్టుగా ఉంచడానికి కారణాలు ఏంటీ..?
ప్రపంచలోనే అత్యద్భుతమైన ప్రాజెక్టు రికార్డులు భద్ర పర్చే విషయంలోనూ అధికారులు రికార్డులు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత వివిధ శాఖల్లో ఫైళ్లు మాయం అవుతుండగా, ప్రగతి భవన్ నుండి కంప్యూటర్లతో పాటు రికార్డులు కూడా అదృశ్యం అయిపోయిన విషయంపై చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే విధానం కొనసాగిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ. లక్ష కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం తెలంగాణాకే తలమానికంగా నిలిచిందని ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులు స్టోర్ చేసి పెట్టిన హార్డ్ డిస్కులు కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. ఇటీవల దాదాపు మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని జల సౌధ నుండి మేడిగడ్డ బ్యారేజీ వరకు ఏర్పాటు చేసుకున్న కాళేశ్వరం కార్యాలయాల్లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు తనిఖీలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రికార్డులు కొన్ని లభ్యం కాకపోవడంతో ఈఎన్సీలకు సంబంధించిన క్యాంపు ఆఫీసులు, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా పలుమార్లు వెతికారు. ఈ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులు భావించారు. అయితే వీటిలో కొన్ని హార్డ్ డిస్కులు మిస్సయ్యాయన్న విషయం గమనించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టర్ జనరల్ రాజీవ్ రతన్ స్వయంగా ఎంట్రీ ఇచ్చారు. బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన ఆయన ఆయా బ్యారేజీలు, పంప్ హౌజ్ లకు సంబంధించిన అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి విషయాలు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆయా సైట్లను కూడా విజిట్ చేసిన డీజీ రాజీవ్ రతన్ రికార్డుల కోసం తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.
కీలకమైనవా..?
హార్డ్ డిస్కులు మిస్ కావడంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ స్వయంగా క్షేత్ర స్థాయిలో విజిట్ చేయాల్సి వచ్చిందంటే అవే కీలకమైనవిగా భావిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం ఉన్న హార్డ్ డిస్కులు ఎలా అదృశ్యం అయ్యాయన్నదే మిస్టరీగా మారిపోయిందన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. అయితే ఈ హార్డ్ డిస్కుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు స్టోర్ చేసి ఉన్నాయని తెలుస్తోంది. కానీ అధికార వర్గాలు మాత్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు.
ఇలా అయితే ఎలా..?
రికార్డులకే రారాజుగా నిలిచిన ప్రాజెక్టు కాళేశ్వరం. దీనిలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి దిగువన బుంగలు పడడంతో తలదించుకునే పరిస్థితి వచ్చింది కావచ్చు. కానీ ఈ సమస్యలు ఉత్పన్నం కానట్టయితే ఈ ప్రాజెక్టు మాత్రం ప్రపంచలోనే అత్యంత అరుదైన చరిత్రను క్రియేట్ చేసుకున్న వాటిల్లో ఒకటిగా నిలిచిపోయేది. అలాంటి ప్రాజెక్టుకు సంబంధించిన హార్డ్ డిస్కులు అదృశ్యం కావడం అంతుచిక్కకుండా పోయింది. కుంగుబాటుకు గురి కానట్టయితే అద్భుతమైన ఈ ప్రాజెక్టు గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉండేది. దీంతో ఇతర దేశాలకు సంబంధించిన నిపుణులు కూడా స్టడీ చేసేందుకు రాష్ట్రానికి వచ్చేవారు. వివిధ దేశాల నుండి వచ్చిన నిపుణులకు రికార్డులు కూడా చూపించి ప్రాజెక్టు గొప్పతనాన్ని వివరించాల్సిన పరిస్థితి అధికారులకు ఉండేది. ఆయా దేశాలకు చెందిన వారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిపిన తీరును స్పూర్తిగా తీసుకుని ఇక్కడి రికార్డులను పరిశీలించి తమ దేశాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగునంగా డిజైన్లు చేసుకుని నిర్మాణాలు జరుపుకునేందుకు రోల్ మోడల్ గా నిలిచేది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన హార్డ్ డిస్కులే మిస్సయితే వివిధ దేశాల నుండి వచ్చిన వారికి అధికారులు పూర్తి వివరాలను ఎలా అందించేవారన్నదే ప్రశ్నార్థకంగా మారింది.