తెరపైకి సంధ్య కన్వెన్షన్ కేసు… ఎండీ నుండి ఆధారాల సేకరణ

ఈ కేసులో ఎంతమంది పాత్ర ఉందో..?

దిశ దశ, హైదరాబాద్:

ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్న క్రమంలోనే మరో కేసును కూడా విచారించే పనిలో పోలీసు అధికారులు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. గతంలోనే ఫిర్యాదు వచ్చినప్పటికీ తమ ప్రధాన దృష్టి అంతా కూడా ఎస్ఐబీ లాగర్ రూం కేంద్రీకృతంగా సాగిన వ్యవహారం… వార్ రూమ్స్… వసూళ్ల పర్వం ఇలా ఒక్కో అంశాన్ని గుర్తించిన దర్యాప్తు అధికారులు ఆయా కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అయితే తాజాగా ఆదివారం సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు రావడం గమనార్హం. పంజాగుట్ట పోలీసులకు ఇంతకు ముందే తాను కూడా ట్యాపింగ్ ఉచ్చులో చిక్కుకున్నానని అడిషనల్ ఎస్పీ భుజంగరావు తనను ఇబ్బందులకు గురి చేశాడని ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించిన ఆధారాలను బంజారాహిల్స్ స్టేషన్ లో ఇచ్చేందుకు ఆయన ప్రత్యేకంగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు సంధ్య కన్వెన్షన్ కేసు అంశం గురించి పోలీసులు కూడా అంతగా దృష్టి పెట్టలేదు. ఎండీ శ్రీధర్ రావు ఆదివారం అనూహ్యంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావడంతో ఈ కేసు పరిశోధన స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భుజంగరావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశాడని ఆఫీసుకు పిలిపించి కూడా ఇబ్బంది పెట్టాడన్నారు. ఇందుకు సంబంధించిన ఎవిడెన్స్ లు ఇన్వెస్టిగేషన్ టీమ్ కు ఇచ్చానని, పూర్తి వివరాలు మీడియా ముందు వెల్లడిస్తానని కూడా కామెంట్ చేశారు. అప్పటి ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి ముప్పు తిప్పలు పెట్టిందని కూడా శ్రీధర్ రావు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాన్ని బట్టి గమనిస్తే మాత్రం కస్టడీలో ఉన్న భుజంగరావుపై ఈ కేసులో కూడా అరెస్ట్ చూపించనున్నట్టు సమాచారం. ఆ తరువాత ఈ కేసులో భుజంగరావును విచారించినట్టయితే ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో కూడా పోలీసు అధికారులు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి.

కొనసాగుతున్న కస్టడీ…

మరో వైపున పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావుల కస్టడీ కొనసాగుతోంది. డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఇద్దరు అధికారుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. మరికొంతమంది భాగస్వామ్యం ఉన్నట్టుగా కూడా వీరు నుండి రాబట్టినట్టుగా తెలుస్తోంది. కొత్తగా సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటి వరకు సిరిసిల్ల, ఐన్యూస్ ఆఫీసుతో పాటు మరిన్ని చోట్ల సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టుగా వెలుగులోకి వచ్చినట్టయింది. సర్వర్ రూమ్స్ లో పనిచేసిన వారితో పాటు ఎస్ఐబీ కార్యాలయంలో పనిచేసిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

You cannot copy content of this page