దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టులో వెలుగులోకి వచ్చిన లోపాలకు అసలు కారణాలు ఏంటీ..? నిర్మాణ సమయంలో ఎక్కడైనా తప్పు జరిగిందా..? టెక్నికల్ గా ఎక్కడ ఫెయిల్ అయ్యారు అన్న విషయాలపై కులంకశంగా పరిశోధనలు చేసే పనిలో నిమగ్నం అయ్యారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి దిగువన బుంగలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్ వాటర్ ను తొలగించి సునిశితంగా అధ్యయనం చేయాలని ఇప్పటికే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించింది. అయితే ఈ బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పిదాలను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకోవడం ఆరంభించింది. ఇందులో భాగంగా గురువారం నుండి నిపుణులు పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయడం ఆరంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ప్రాంతంలో ఎలక్ట్రికల్ రెసిస్టివిటి టెస్ట్ (ERT) చేస్తున్నారు. ఈ పరిశోధనలతో బ్యారేజ్ కుంగుబాటుకు గల అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిశోధనల బాధ్యతలను ఓ ప్రయివేట్ సంస్థకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ఎలెక్ట్రికల్ రెసిస్టివిటీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ పరికరాల సాయంతో బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలు ఏంటీ అన్న విషయాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగారు. ప్రతి పిల్లర్ ను, బేస్ ప్రాంతాన్ని స్కానింగ్ చేసి ఎక్స్ రే ఫిల్మ్ రూపంలో రికార్డు చేసిన తరువాత లోపాలపై సంపూర్ణ అధ్యయనం చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మొదట కుంగుబాటుకు గురైన 7వ బ్లాకులోని 16 నుండి 21 వపిల్లర్లను అధ్యయనం చేసిన తరువాత మిగతా వాటన్నింటిని కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అన్నారం బ్యారేజీకి దిగువన బుంగలు పడడంతో ఎన్డీఏస్ఏ కూడా మూడు బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించాలని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ రెండు చోట్ల కూడా ఈర్టీ ద్వారా పరిశోధనలు జరిపే అవకాశం ఉంది. మూడు బ్యారేజీల వద్ద అధ్యయనం పూర్తయిన తరువాత సమగ్ర నివేదికలను సదరు కంపెనీ నిర్మాణ కంపెనీలకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత బ్యారేజీలను పునరుద్దరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.