దిశ దశ, ఖమ్మం:
ఓ సీనియర్ జర్నలిస్టు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తెలంగాణా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు మంగళవారం ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు. అక్రిడిటేషన్ కార్డు మంజూరు కోసం తాను చేసుకున్న దరఖాస్తు అంశంలో అప్పటి ఖమ్మం డీపీఆర్వో వై వెంకటేశ్వర్లు తన పరిధి దాటి వ్యవహరించారనే అభియోగంపై సీనియర్ జర్నలిస్టు ఎడమ సమ్మిరెడ్డి ఖమ్మం కోర్టులో 2013లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో అప్పటి ఖమ్మం డీపీఆర్వో, ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు మంగళవారం ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా వై వెంకటేశ్వర్లు ఓ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించారు. విచారణలో భాగంగా ఈ కేసులో వై వెంకటేశ్వర్లును చేసే క్రాస్ ఎగ్జామినేషన్ ను నమోదు చేసేందుకు కోర్టు అడ్వకేట్ కమిషనర్ ను నియమించింది. ఈ నివేదికను ఈనెల 22వ తేదీన సమర్పించేందుకు కోర్టు గడువు విధించింది. అయితే సీనియర్ జర్నలిస్టును అయిన తనకు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కార్డు ఇవ్వాలని కోరుతూ ఎడమ సమ్మిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సమ్మిరెడ్డికి సంబంధించి యాంటిసిడెంట్ రిపోర్ట్ ఇవ్వాలని ఖమ్మం జిల్లా పోలీసు శాఖకు డీపీఆర్వో లేఖ రాశారు. అక్రిడిషన్ కార్డు ఇచ్చే విషయంలో డీపీఆర్వో గతంలో ఏనాడు లేని విధంగా, తనకు లేని అధికారాన్ని వినియోగిస్తూ పోలీసులకు లేఖ రాయడం సరైన పద్దతి కాదని సమ్మిరెడ్డి అభిప్రాయపడ్డారు. దశాబ్దాల తరబడి జర్నలిజం వృత్తిలోనే కొనసాగుతున్న తాను పని చేసిన ఇతర జిల్లాల్లో కూడా అక్రిడేషన్ కార్డులు వచ్చాయని, ఖమ్మం డీపీఆర్వో మాత్రం యాంటిసిడెంట్ రిపోర్ట్ అడగడం వల్ల సమాజంలో తన పరువుకు భంగం వాటిల్లిందని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు డిప్యూటీ డైరక్టర్ వెంకటేశ్వర్లు ఖమ్మం కోర్టుకు హాజరై అఫిడవిట్ సమర్పించారు.
Disha Dasha
1884 posts
Next Post