దిశ దశ, హైదరాబాద్:
ఐపీఎస్ అధికారి ఒకరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్న సదరు అధికారిని కస్టడీలోకి తీసుకున్నట్టుగా సమాచారం. నగరంలోని బేగంపేటలో మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఐపీఎస్ అధికారి, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమి డైరక్టర్ నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది. భన్వర్ లాల్ కు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న నవీన్ కుమార్ ఆ ఇంటికి సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించిన కేసులో నిందితుడిగా ఉన్నారు. ఫేక్ డాక్యూమెంట్లతో భన్వర్ లాల్ ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన కేసులో విచారించేందుకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
కేసు పుర్వాపరాలివే…
ఎఫ్ఐఆర్ నంబర్ 323/2023, ఐపీసీ సెక్షన్ 420, 406, 467, 468, 471 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు అయింది. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ సతీమణి మణిలాల్ నవంబర్ 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏ1 నిందితునిగా జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ కు చెందిన సాంబశివరావు, ఏ3గా ఉన్న రూపా డింపుల్ లను ఈ నెల 22న పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2 నిందితునిగా ఉన్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ పరారీలో ఉండగా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో సాంబశివరావు, రూపా డింపుల్ లు మాజీ ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఇంటి ఫేక్ డాక్యూమెంట్లు క్రియేట్ చేశారు. భన్వర్ లాల్ నుండి డబ్బు లాగాలన్న ఆలోచనతో నకిలీ పేపర్లను తయారు చేశారు. అయితే ఈ కేసులో పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరక్టర్ అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.