ప్రభుత్వానికి రాబడి…
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖలో జరుగుతున్న అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇసుకతో పాటు ఖనిజాల అక్రమ తవ్వకాలు, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే అధికార యంత్రాంగం కేవలం ఇసుక ఆదాయం వరకే తమ దృష్టిని పరిమితం చేయకుండా ప్రదాన ఆదాయ వనరుగా ఉన్న గ్రానైట్ క్వారీల్లో జరిగిన అక్రమాలపై కూడా కొరడా ఝులిపించాల్సిన అవసరం ఉంది.
బ్లాక్ లిస్ట్ ఆధారంగా…
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 263 గ్రానైట్ క్వారీల్లో అక్రమ మైనింగ్ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. మైనింగ్ ఉన్నతాధికారిగా వ్యవహరించిన సురేంద్ర మోహన్ బ్లాక్ లిస్టులో ఉన్న క్వారీల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిలెన్స్ మానిటరింగ్ కూడా చేపట్టి అక్రమ మైనింగ్ చేపట్టకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్న జిల్లాల కలెక్టర్లు కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సురేంద్ర మోహన్ బదిలీ తరువాత బ్లాకు లిస్టులో ఉన్న గ్రానైట్ క్వారీల విషయంలో యధావిధిగా కట్టడి చర్యలు జరుగుతున్నాయా లేదా అన్న విషయంపై సమీక్షించాల్సిన అవసరం ఉంది.
అలా చేస్తే…
బ్లాక్ లిస్టులో ఉన్న క్వారీల్లో అక్రమ మైనింగ్ జరగకుండా ఉండేందుకు చొరవ తీసుకోవడంతోనే సరిపెట్టుకుండా అధికారులు లోతుగా అధ్యయనం చేయాల్సిన ఆవవ్యకత ఉంది. బ్లాక్ లిస్టులో ఉన్న క్వారీల వారిగా క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వాస్తవ లెక్కలను తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్వారీ ఎప్పుడు బ్లాకు లిస్టులో చేరింది, అక్కడ ఎంతకాలం క్రితం మైనింగ్ తవ్వకాల కోసం అనుమతి ఇచ్చారు..? నిబంధనలకు విరుద్దంగా బ్లాకు లిస్టులో పెట్టే వరకు ఎంత మేర మైనింగ్ జరిగింది..? ఆ తరువాత సేకరించిన గ్రానైట్ బ్లాకులు ఎన్ని..? వాటి పరిమాణం ఎంత..? వాటిని వే బిల్లుల ద్వారా తరలించారా లేక జీరోగా తరలించారా..? ఏవిధమైన రవాణా ద్వారా పోర్టులకు చేరింది..? అక్కడి నుండి ఏ దేశానికి చేరుకుంది..? ఆ దేశ వ్యాపారి నుండి వీరికి వచ్చిన డబ్బు ఎంత అన్న వివరాలను సేకరించాల్సి ఉంది. ముఖ్యంగా గ్రానైట్ తవ్వకాల కోసం అనుమతించినప్పుడు ఎంత పరిమాణంలో మెటిరియల్ ఉందని అంచనా వేశారు, ఒక్కో క్వారీకి ఎంత విస్తీర్ణంలో మైనింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చారు అన్న వివరాలను కూడా సేకరించాలి. దీనివల్ల అక్రమ మైనింగ్ ఎంత మేర జరిగిందోనన్న విషయంపై అధికారులు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. బ్లాకు లిస్టులో చేరిన గ్రానైట్ క్వారీలకు ఇచ్చిన వే బిల్లులు అదే ఏజెన్సీ పేరిట విడుదల అయ్యాయా లేక వేరే క్వారీ పేరిట విడుదల చేశారా అన్న వివరాలు కూడా తెలుసుకోవల్సిన అవసరం ఉంది. బ్లాక్ లిస్టులో ఉన్న నిర్వాహకుల పేరిటనే గ్రానైట్ బ్లాకులు తరలి వెల్లినట్టయితే ఎంత మేర మైనింగ్ జరిగిందోనన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వేరే క్వారీల పేరిట వే బిల్లులు జారీ అయినట్టయితే సదరు క్వారీలో ఎంత మేర మైనింగ్ జరిగింది..? తవ్వకాలు జరిగిన పరిమాణాలకన్న ఎక్కువగా గ్రానైట్ బ్లాకులకు ఎలా అనుమతులు తీసుకున్నారోనన్న విషయంపై ఆరా తీయాల్సిన ఆవశ్శకత ఉంది. రోడ్డు మార్గంలో కానీ, రైళ్ల ద్వారా కానీ మాత్రమే గ్రానైట్ ఆయా పోర్టులకు చేరుకునేందుకు గ్రానైట్ క్వారీల నిర్వహాకులు ఆసక్తి చూపించారు. రైళ్ల ద్వారా వెళ్లిన బ్లాకుల వివరాలు, రైల్వే శాఖకు రవాణా కోసం చెల్లించిన బిల్లుల వివరాలను సేకరించడంతో పాటు, పోర్టుల నుండి షిప్ ల మీదుగా తరలి వెల్లిన గ్రానైట్ బ్లాకులకు ఎంతమేర రవాణా ఖర్చులు చెల్లించారు అన్న వివరాలు కూడా సేకరించినట్టయితే అసలు నిజం వెలుగులోకి రానుంది. అంతేకాకుండా అసలు మైనింగ్ విభాగం అనుమతి లేకుండానే కొన్ని గుట్టలు అంతర్థానం అయినట్టుగా కూడా ప్రచారంలో ఉంది. గతంలో ఉన్న రికార్డులను పరిశీలించి మైనింగ్ కు అనుకూలంగా ఉన్న గుట్టల వివరాలు సేకరించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జరిమానాలు…
వీటన్నింటిని క్రోడీకరించుకుని లెక్కలు తీసినట్టయితే ప్రభుత్వానికి బ్లాకుల విలువతో పాటు జరిమానాల రూపంలో వేలాది కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంటున్న వారూ లేకపోలేదు. ఖనిజ వనరులకు సంబంధించిన సర్వే రిపోర్టులు కూడా ఉన్నందున ఖచ్చితంగా మైనింగ్ ద్వారా ప్రభుత్వం ఎంతమేర ఆదాయం కోల్పోయిందో లెక్కలు తేల్చే అవకాశం లేకపోలేదు. మైనింగ్ యాక్టు ఆధారంగా బాధ్యులైన వారిపై జరిమానాలు విధించినట్టయితే ప్రభుత్వానికి లాభం చేకూరడమే కాకుండా భవిష్యత్తులు అక్రమ మైనింగ్ జరిపేందుకు సాహసించే అవకాశం కూడా ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవే కాకుండా క్రషర్లతో పాటు ఇతరాత్ర అవసరాల కోసం అనుమతులు ఇచ్చిన విధానంపై కూడా లోతుగా అధ్యయనం చేస్తే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం రానుందని అంటున్నారు.