శృతి మించుతున్నారా… గతి తప్పుతున్నారా..?

క్రమ‘‘శిక్ష’’ణ కరువై పోతోందా..?

దిశ దశ, హైదరాబాద్:

నాలుగో సింహం దారి తప్పుతోందా..? సమాజాన్ని గాడిలో పెట్టాల్సిన వ్యవస్థే చట్ట వ్యతిరేక చర్యల వైపు అడుగులు వేస్తోందా..? అధికారులే బాధ్యతలు మరిచి అడ్డదారుల వైపు సాగుతున్న తీరు పోలీసు సమాజానికే తల వంపులు తెచ్చే విధంగా తయారైంది. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట తప్పటడుగులు వేసిన అధికారి గురించి వెలుగులోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు అత్యంత సాధారణం అన్న రీతిలో కొనసాగుతుండడం ఆందోళన కల్గిస్తోంది.

ఫోక్సో కేసులో సీఐ

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఖాజీపేట సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పనిచేసిన సీఐ రవి కుమార్ పై ఫోక్సో కేసు నమోదు కావడం సంచనలంగా మారింది. మైనర్ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఫోక్సో కేసు విచారణ అధికారిగా వ్యవహరించాల్సిన బాధ్యతల్లో ఉన్న సీఐ రవి కుమార్ అదే కేసుకు సంబంధించిన సెక్షన్లలో నమోదయిన కేసులో నిందితుడు కావడం గమనార్హం.

ఆరోపణల పర్వం…

అవినీతి ఆరోపణలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల విషయంలో పోలీసుల పాత్ర కూడా సర్వ సాధారణం అన్నట్టుగా మారిపోయింది. హైదరాబాద్ కమిషనరేట్ లో యాక్సిడెంట్ కేసుల్లో నిందితుల పేర్లను మార్చిన ఘటనలో పలువురు పోలీసు అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఇటీవల మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో తన ముందు తల దువ్వుకున్నాడన్న కారణంతో ఓ పోలీసు అధికారి ఏకంగా శిరోముండనం చేయించిన ఘటన సంచలనంగా మారింది. ఏసీబీ అధికారుల దాడుల్లో లంచం తీసుకుంటున్న పోలీసు అధికారులు దొరుకుతున్న సంఘటనలు కూడా ఆందోళన కల్గిస్తున్నాయి. ఇంతకాలం ఏసీబీకి డిప్యూటేషన్ పై వెల్లేది కూడా తమ విబాగానికి చెందిన వారే అన్న ధీమాకు ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు బ్రేకులు వేశారు. ఏ స్థాయి అధికారి అయినా, తమ విభాగానికి చెందిన వారే అయినా లంచం తీసుకుంటే వదిలిపెట్టేది లేదని చేతల్లో చూపడంతో అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారులకు శాపంగా పరిణమిచింది.

క్రమశిక్షణా చర్యలు…

ఆరోపణలు ఎదుర్కొంటున్న శాఖల్లో పోలీసు విభాగం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సస్పెన్షన్లు, శాఖాపరమైన చర్యలు సర్వ సాధారణం అన్నట్టుగా మారిపోయింది. కరీంనగర్ కమిషనరేట్ లో ఇంతకు ముందు పనిచేసిన నలుగురు పోలీసు అధికారులు కూడా ఆరోపణల్లో ఇరుక్కుని శాఖ పరమైన చర్యలకు గురయ్యారు. ఇందులో తాజాగా ఫోక్సో కేసు నమోదయిన సీఐ రవి కుమార్ కూడా ఒకరు కావడం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ ఏకంగా సొంత విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై వ్యవహరించిన తీరు అధికారుల ఆగ్రహాన్ని తెప్పించింది. చివరకు ఆయనను ఉద్యోగం నుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. భవానీ సేన్ విషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేసినా తప్పటడుగుల్లో పయనిస్తున్న కొంతమంది అధికారులు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదని స్పష్టం అవుతోంది. తాజాగా సీఐ రవి కుమార్ కూడా మైనర్ పై వ్యవహరించిన తీరు తేటతెల్లం చేసినట్టయింది. అయితే వరసగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి ఘటనలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా తయారయ్యాయి.

మొక్కుబడి చర్యలే కారణమా..?

గత కొంతకాలం నుండి రాష్ట్ర పోలీసు వ్యవస్థలో సరికొత్త సాంప్రాదాయానికి తెరలేచినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ఆరోపణలు వచ్చిన అధికారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం, ఓరల్ ఎంక్వైరీ (OE) నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మెమోలు, ఛార్జి మెమోలు, సస్పెన్షన్లు, కోర్టు విచారణలతో పాటు ‘OE’ కూడా అత్యంత కీలకంగా ఉంటుంది. ఇందుకు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి విచారణ జరిపి నిజా నిజాలు తెలుసుకుంటారు. ఈ విచారణలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి లేదా ఉద్యోగిది తప్పని తేలితే సర్వీసు మ్యాటర్ కు సంబంధించిన అంశాల్లో పనిష్మెంట్లు ఇచ్చే ఆనవాయితి అమల్లో ఉంటుంది. పోలీసు విబాగంలో పని చేసిన వారిపై వచ్చిన ఆరోపణలపై ఆ శాఖ అత్యంత సీరియస్ గా పరిగణించి ఈ విచారణ చేపట్టి వాస్తవాలను క్షుణ్నంగా పరిశీలించిన చర్యలు తీసుకునే సాంప్రాదాయం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది పోలీసు అధికారులు మెమోలు, ఛార్జి మెమోలు ఇచ్చిన తరువాత ఆరోపణలు ఎదుర్కొంటున్న సబార్డినేట్ ఇచ్చిన సమాధానానికి సాటిస్పైడ్ అని రాసే విధానానికి మొగ్గు చూపే సాంప్రాదాయం మొదలు అయింది. అయితే గతంలో తమ సబార్డినేట్లపై వచ్చిన ఆరోపణల స్థాయిని బట్టి సంబంధిత జిల్లాలు, కమిషనరేట్లలో పనిచేసే బాసులు సంత‌ృప్తి చెందినట్టుగా రాసి ఫైల్ ను క్లోజ్ చేసే అధికారం ఉన్నప్పటికీ వారిపై వచ్చిన ఆరోపణల తీరును గమనించి మెమోలు, ఛార్జి మెమోలతో సరిపెట్టుకుండా శాఖపరంగా సమగ్ర విచారణ జరిపించే ఆనవాయితే ఉండేది. కానీ ఇటీవల కాలంలో పోలీసు విభాగంపై సాగుతున్న ఇతరుల పెత్తనం వల్ల ‘OE’ల్లో తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు విభాగం తీరుపై సమాజంలో చులకన భావం పెరిగిపోయిందన్న వాదనలు కూడా లేకపోలేదు. బదిలీలు, పోలీసులు నమోదు చేసే క్రిమినల్ కేసుల విషయంలో మాత్రమే రాజకీయ నాయకుల ప్రభావం ఉండేది. కానీ శాఖా పరంగా తీసుకోవల్సిన చర్యల విషయంలోనూ పొలిటికల్ లీడర్ల జోక్యం వల్ల కఠిన చర్యలు తీసుకునే విధానం అనేది మొక్కుబడి చర్యలకే పరిమితం అయిందన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభావాలకు, పరిస్థితులకు తలొగ్గకుండా ఉండే పోలీసు ఉన్నతాధికారుల విషయంలో మినహాయిస్తే చాలా మంది అధికారులపై ఈ ప్రభావం పడుతోందన్న చర్చ అయితే పోలీసు వర్గాల్లో సాగుతోంది. శాఖా పరంగా చర్యలు తీసుకున్న తరువాత సదరు పోలీసు యంత్రాంగం విషయంలో కారుణ్యం చూపాలని కోరుతూ చట్ట సభ ప్రతినిధులు హోం శాఖకు లేఖలు రాసే విధానం మాత్రం అమల్లో ఉండేది. ‘‘Mercy Petition’’ పిటిషన్ పెట్టుకున్న సదరు పోలీసుల దరఖాస్తును పరిశీలించాలని కోరుతూ ఎమ్యెల్యేలు రాస్తుంటారు. అయితే ఈ ‘‘Mercy Petition’’ ను పరిశీలించిన హోంశాఖ సంబంధిత డీఐజీ లేదా ఎస్పీ కార్యాలయాలకు లేఖలు రాసి సదరు పోలీసు యంత్రాంగానికి సంబంధించిన ఫైలును పరిశీలించిన తరువాత వారిపై తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు వచ్చి రాగానే సంబంధిత అధికారులకు ఫోన్లు వెల్తున్నాయన్న విషయం ఓపెన్ సీక్రెట్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రమ శిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులు ఉదారంగా వ్యవహరించాల్సి వస్తోందన్న అబిప్రాయాలు రాష్ట్ర పోలీసు విబాగంలో వ్యక్తం అవుతున్నాయి. కన్సిడర్ చేయండి అన్న అభ్యర్థన నుండి కమాండింగ్ చేసే పరిస్థితులకు పోలీసు వ్యవస్ధ అనుగుణంగా మారిపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న చర్చ అయితే సాగుతోంది.

You cannot copy content of this page