గోదావరినదిలో ఇష్టారీతిన రోడ్లు
అడ్డుకున్న అధికారికి డెత్ వారెంట్…
దిశ దశ, దండకారణ్యం:
గోదావరి పరివాహక ప్రాంతంలో లైసెన్స్ డ్ సాండ్ మాఫియా రాజ్యమేలుతోందా..? అనుమతి ఓ చోట ఉంటే మరోచోట తవ్వకాలు జరుపుతున్నారా..? అంటే అవుననే అనిపిస్తున్నాయి. నిభందనలకు తిలోదకాలు ఇచ్చి మరీ రాత్రి ఇసుక తవ్వకాలు జరపడం ఏంటని అడ్డుకున్న అధికారికే డెత్ వారెంట్ ఇచ్చారంటే వీరి ఆగడాలు ఏస్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు.
భూపాలపల్లి జిల్లాలో ఇష్టారాజ్యం
మంచిర్యాల జిల్లాలో అలాట్ అయిన రీచులకు సంబంధించిన నిర్వాహాకులు ఇవతలి వైపునకు వచ్చి ఇసుక తవ్వకాలు చేసుకుంటూ వెల్తున్నా నియంత్రించే వారే లేకుండా పోయారు. ఆ దరి నుండి ఈ దరి వరకు దర్జాగా రోడ్డు వేసుకుని మరీ ఇసుకను అక్రమంగా తరలించుకపోతుంటే పర్యవేక్షించాల్సిన టీఎస్ఎండీసీ పట్టించుకోకపోవడం ఏంటన్నదే మిస్టరీగా మారిపోయింది. అంతేకాకుంగా మేడి గడ్డ బ్యాక్ వాటర్ ఏరియాలో ఉన్న ఈ ప్రాంతంలో గోదావరి నదిలో రోడ్ల నిర్మాణం జరుపుతుంటే ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నదీ అంతుచిక్కకుండా పోయింది. గోదావరి నదిలో రోడ్ల నిర్మాణం జరపేందుకు ఎన్విరాన్ మెంట్ విభాగం అనుమతి ఇచ్చిందా..? ఇందుకు కేంద్ర పర్యావరణ చట్టాలు ఏం చేప్తున్నాయి అన్న విషయాన్ని కూడా విస్మరించి మంచిర్యాల జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చి ఇసుక తరలించుకుని వెల్తుండడం వెనక ఎవరెవరి అండదండలు ఉన్నాయోనన్న చర్చ ఈ ప్రాంతంలో సాగుతోంది. టీఎస్ఎండీసీ కొల్లూరు రీచుకు హద్దులు నిర్ణయించి ఆ ప్రాంతంలోనే ఇసుక తవ్వకాలు చేయాలన్న ఆదేశాలు ఇవ్వలేదా లేకపోతే మీరేం చేసినా మేం పట్టించుకోమన్న సంకేతాలు ఇచ్చారా అన్నది కూడా తేలాల్సి ఉంది. కాంట్రాక్టు నిభందనల ప్రకారం హద్దులు దాటిని రీచ్ నిర్వహకులు, అక్కడ పనిచేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదో మిస్టరీగా మారిపోయింది. అసలు ఈ రీచులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి కట్టడి చేయాల్సిన టీఎస్ఎండీసీ అధికారయంత్రాంగం ఎందుకు మిన్నకుండి పోతోందోనన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
తహసీల్దార్ కే డెత్ వారెంట్…
రాత్రి వేళల్లో మహదేవపూర్ మండలం మద్దులపల్లి సమీపం నుండి అవతలి ఒడ్డుకు ఇసుక తరలిస్తున్న సమాచారం అందుకున్న మహదేవపూర్ తహసీల్దార్ శంకర్ బుధవారం ఉదయం ఫీల్డ్ ఇన్సెపెక్షన్ కు వెల్లారు. అయితే మద్దులపల్లి వద్ద రీచ్ కు అనుమతి లేకున్నా జేసీబీలతో పాటు ఇతరాత్ర మిషనరీ, ప్రైవేటు వ్యక్తులు ఉండడంపై తహసీల్దార్ ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్ ను తహసీల్దార్ కు ఇచ్చి మాట్లాడాలని చెప్పగా అవతలి వ్యక్తి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. అయితే తహసీల్దార్ శంకర్ కూడా తనను జేసీబీ బకెట్ తో చంపేస్తానంటూ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వార్నింగ్ ఇచ్చారని మీడియాకు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కు ఏకంగా డెత్ వారెంట్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారంటే ఇక్కడి ఇసుక మాఫియా ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ ప్రాంత వాసులు. ఏది ఏమైనా పొరుగు జిల్లా రీచ్ కాంట్రాక్టర్లు భూపాలపల్లి జిల్లాలోకి ఏంటర్ అయి అక్రమంగా ఇసుకను తరలించుకుని అఫిషియల్ వ్యాపారం చేస్తుండడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.