అనుమతులకు తవ్వకాలకు సంబంధం ఉందా..? గోదావరి సాక్షిగా ఇసుక తవ్వకాల్లో అక్రమాలు…

దిశ దశ, భూపాలపల్లి:

అత్యంత కఠినంగా తయారు చేసే నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. రూల్స్ ఖచ్చితంగా అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సర్కారు ఆశయం ఆచరణ సాధ్యం కావడం లేదు. దీంతో బడా బాబులు, మధ్య దళారుల జేబులు నిండుతున్నాయే తప్ప కూలీ నాలీ చేసుకునే బ్రతికే సగటు జీవి కడుపు మాత్రం నిండడం లేదు. జిల్లాలోని గోదావరి నది నుండి ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం టీఎస్ఎండీసీ ద్వారా రీచుల నిర్వహణ కొనసాగిస్తోంది. అయితే కొన్ని ఇసుక రీచుల విషయంలో అధికారులు విధించిన నిబంధనలు మాత్రం అమలు కావడం లేదు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మిషనరీలతో ఇసుక సేకరణ జరిపించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ రీచుల నిర్వహకులు మాత్రం దర్జాగా మిషనరీ పెట్టి ఇసుకను స్టాక్ యార్డులకు తరలిస్తున్నారు.

దర్జాగా నిబంధనల పాతర…

జిల్లాలోని మహదేవపూర్, పలిమెల మండలాల్లోని పంకెన1, పంకెన2, పలిమెల2, అంబటిపల్లి 2, అంబటిపల్లి 2, అంబటిపల్లి 3, అంబటి పల్లి 4, పెద్దంపేటల సమీపంలో ఇసుక రీచులను ఏర్పాటు చేశారు. ఈ రీచుల నుండి ఇసుకను తీసేందుకు మిషనరీని వాడకుండా స్థానిక కూలీలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించారు. దీనివల్ల గోదావరి పరివాహక ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని, మిషనరీ వినియోగం వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని ప్ఱభుత్వం భావించింది. అయితే సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడి ఇసుక రీచుల్లో మిషనరీని ఉపయోగిస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాన్యువల్ విధానంతో అయితే రీచు నిర్వహాకులకు గిట్టుబాటు కాదని, దీంతో తమ ఆదాయానికి గండి పడుతుందని భావించి కూలీలకు ఉపాధి కల్పించే విధానానికి స్వస్తి పలికారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా నివాసం ఉండే కూలీలే గోదావరి నదిలోకి దిగి ఇసుకను వాహనాల్లోకి ఎత్తిన తరువాత స్టాక్ యార్డకు తరలించాల్సి ఉంటుంది. అక్కడి నుండి లారీల్లో ఇసుకును రీచు కాంట్రాక్టర్ ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ ఆయా రీచుల్లో మాత్రం గోదావరి నదిలోనే మిషనరీలను ఏర్పాటు చేసి ఇసుక తవ్వకాలు జరుపుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

పీఓ ఆఫీసు ఉన్నా…

ప్రధానంగా జిల్లాలోని మహదేవపూర్ మండలంలో పెద్ద ఎత్తున ఇసుక రీచులు ఏర్పాటు చేయడంతో టీఎస్ఎండీసీ ప్రత్యేకంగా పీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మొదట్లో మహదేవపూర్ మండల కేంద్రంలో ఉన్న ఈ ఆఫీసును కాళేశ్వరానికి తరలించారు. అయితే రీచుల్లో నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు సాగుతున్నాయా,..? స్టాకు యార్డులకు ఎలా తరలిస్తున్నారు..? లారీల్లో సామర్థ్యానికి మించి ఇసుక లోడ్ చేస్తున్నారా..? సాయంత్రం ఆరు గంటల తరువాత తవ్వకాలు కానీ, లోడింగ్ అన్ లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోందా అన్న విషయాలతో పాటు పలు అంశాలను పర్యవేక్సించేందుకే ఇక్కడ ప్రత్యేకంగా పీఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే కనీసం నిబంధనలు కూడా పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

కూలీల ఉపాధికి గండి: దళిత, గిరిజన సంఘాలు

మహదేవపూర్, పలిమెల మండలాల్లో ఏర్పాటు చేసిన రీచుల నుండి ఇసుకను సేకరిస్తున్న విధానంలో నిబంధనలు అమలు కావడం లేదని దళిత, గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కూలీలకు ఉపాధి కల్పించకుండా సొసైటీల పేరిట చేపట్టిన ఈ రీచుల నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ జరపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతి పత్రం అందజేశారు. ఇసుక రీచుల్లో సాగుతున్న అక్రమాలను కట్టడి చేసి స్థానిక దళిత, గిరిజన, బలహీన వర్గాల వారికి ఉపాధి కల్పించాలని వారు అభ్యర్థించారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అజ్మీరా పూల్ సింగ్ నాయక్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు గొరిగే కిరణ్ కుమార్, నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లంకొండ పోచయ్య, మాల మహానాడు జిల్లా కోఆర్డినేటర్ బొబ్బిలి రాజులు ఉన్నారు.

You cannot copy content of this page