దిశ దశ, హైదరాబాద్:
దశాబ్దకాలానికిపైగా ఉన్న ఆ రెండు పార్టీల అనుబంధానికిక తెరపడినట్టేనా..? ఆ స్నేహానికిక తలాక్ చెప్పినట్టేనా..? టీపీసీసీ నేత ఫిరోజ్ ఖాన్ చెప్తున్న మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ..? ఈ నిర్ణయం వెనక మైనార్టీలో మనోగతం ఎలా ఉండబోతోంది..? దీనివల్ల ఏ పార్టీకి లాభం చూకూరనుంది..?
హైదరాబాద్ లో పోటీకి నో…
లోకసభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలపే ఆలోచనలో లేనట్టుగా స్ఫష్టం అవుతోంది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఫిరోజ్ ఖాన్ మీడియాకు వెల్లడించిన అంశం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసిపోతున్నాయన్న సంకేతాలను ఇచ్చేశారు ఫిరోజ్ ఖాన్. హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని, అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉండరని ఫిరోజ్ ఖాన్ కుండబద్దలు కొట్టారు. దీంతో ఈ లోకసభ ఎన్నికలతో మళ్లీ కాంగ్రెస్, ఎంఐఎంలు దోస్తీ చేయబోతున్నారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై కినుక వహించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నామని ప్రకటించారు. అక్బరుద్దీన్ ఓవైసీపై క్రిమినల్ కేసు పెట్టడం ఆయన్ని అరెస్ట్ చేయడంతో మొదలైన వివాదం ముదిరి పాకాన పడింది. దీంతో ఎంఐఎం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగించమంటూ అసదుద్దీన్ ప్రకటించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఉధ్యమ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు ఓవైసీ బ్రదర్స్. అంతకుముందు గులాభి పార్టీ కూడా ఓవైసీ పార్టీని చీల్చి చెండాడిన సంధర్భాలు కూడా లేకపోలేదు. ఓల్డ్ సిటీకే పరిమితమైన పార్టీ అని తెలంగాణలోని ముస్లిం సమాజం అంతా ఎంఐంఎం వెంట నడవడం లేదని కూడా విమర్శలు చేశారు గులాభి పార్టీ నాయకులు. అయితే ఆ తరువాత అధినేత కేసీఆర్ కూడా అసుదుద్దీన్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించడంతో ఈ రెండు పార్టీల మధ్య స్నేహం మొదలైంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు ఉంటుందని ఓవైసీ ప్రకటించారు.
ఎన్నికల తరువాత…
అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలు ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల మధ్య గ్యాప్ పెంచినట్టే కనిపించాయి. కానీ ఇరు పార్టీలు మాత్రం తాము తిరిగి స్నేహం చేస్తామన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు అక్బరుద్దీన్ తో భేటీ అయిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరు ఒకే దేశంలో ఉన్నప్పుడు కలిశారని అనుకున్నారంత. ఆ తరువాత ఇప్తార్ పార్టీలో కూడా ఎంఐఎం చీఫ్ కు ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా కూడా రోటీన్ లో భాగమేనని అనుకున్నప్పటికీ అనూహ్యంగా ఫిరోజ్ ఖాన్ వెల్లడించిన అంశం సరికొత్త చర్చకు దారి తీసింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే బరిలో నిలిపడం లేదని ప్రకటించిన ఫిరోజ్ ఖాన్, తాను ఓవైసీకి వ్యతిరేకమే అయినప్పటికీ అధిష్టానం నిర్ణయం శిరసా వహిస్తానన్నారు. అంటే ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు చెట్టాపట్టాలు వేసుకునేందుకు జాతీయ స్థాయి ముఖ్య నాయకత్వంతో చర్చించి ఫైనల్ నిర్ణయానికి వచ్చి ఉంటారని స్పష్టం అవుతోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం తలాక్ ఇచ్చేందుకు కూడా సిద్దమైనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నష్టమా… లాభమా..?
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎంతో పొత్తు విషయంలో ఏ పార్టీకి లాభం చేకూరుతుందన్న తర్జనభర్జనలు కూడా మెదలయ్యాయి. ఓవైసీ బ్రదర్స్ వ్యూహం గురించి ముస్లిం మైనార్టీ వర్గాల్లో సుదీర్ఘమైన చర్చ జరిగింది. పాతబస్తీతో పాటు తెలంగాణాలోని మైనార్టీ మేథావులు నడుమ ఎంఐఎం వైఖరిపై సాగుతున్న చర్చ క్షేత్ర స్థాయికి చేరిందన్నది వాస్తవం. ఈ కారణంగానే మెజార్టీ వర్గం తిరిగి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతోంది. జాతీయ స్థాయి రాజకీయాలను కూడా సునిశితంగా పరిశీలిస్తున్న మైనార్టీ వర్గాలు ఎంఐఎం వ్యవహరిస్తున్న తీరుపై కొంత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న సంగతి ఓపెన్ సీక్రెట్. ఓల్డ్ సిటీ మినహాయిస్తే జిల్లాల్లో ఓవైసీ బ్రదర్స్ స్పీచ్ ను అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఓటు విషయంలో ఆచూతూచి నిర్ణయం తీసుకోవాలన్న భావనతోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీనే బెటర్ అన్న భావనకు వస్తున్న క్రమంలో ఎంఐఎంతో దోస్తానా చేయడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి లాభం చేకురుతుందోనన్న విషయాన్ని విస్మరిస్తున్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున మెజార్టీ మైనార్టీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని గమనించే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయి తన పట్టును నిలుపుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా కూడా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల వాతావరణం మైనార్టీ వర్గాల్లో వస్తుండగా, ఇంతకాలం తమ ఇంటి పార్టీగా భావించిన ఎంఐఎం నేతల తీరుపై మైనార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. మరో వైపున మైనార్టీల పక్షపాతి అంటూ కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్న క్రమంలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న అంశాన్ని మరింత ఎక్కువగా ప్రచారం చేసి లాభం పొందేందుకు బీజేపీ కూడా ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మైనార్టీ వర్గాలు ఎవరి వైపు నిలుస్తారో..? ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేక కత్తి గడ్తారా అన్న విషయంపై కూడా చర్చలు సాగుతున్నాయి.