వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, షర్మిలతో బీజేపీ పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. దీంతో తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పొత్తు ఉంటుందనే ప్రచారం ఉంది. కానీ జనసేనతో పొత్తు ఏపీకి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఉండదని బండి సంజయ్ పలుమార్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు.
ఇటీవల కొండగట్టు పర్యటన సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 35 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని, 7 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పకొచ్చారు. బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ఎక్కడా చెప్పలేదు. దీంతో తెలంగాణలో బీజేపీతో జనసేన పోటీ ఉండదనే క్లారిటీ వచ్చేసింది. ఇక టీడీపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ కు నష్టం జరిగిందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీకి కూడా నష్టం జరుగుతుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కూడా పొత్తు ఉండదని బండి సంజయ్ పలు సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. అయితే వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల బీజేపీ మనిషి అని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా బండి సంజయ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో షర్మిలతో కూడా పొత్తు ఉండదని, సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దిగుతామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు ఉండదని అన్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో షర్మిల పార్టీతో కూడా బీజేపీ పొత్తు ఉండదనే క్లారిటీ వచ్చింది. ఏ రాష్ట్రంలోనైనా సొంతంగా బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా సింగిల్ గానే పోటీ చేసేందుకు పార్టీని బలోపేతం చేసుకుంటుంది.