దిశ దశ, హైదరాబాద్:
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ వ్యవహారం చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తోంది. చిన్న విషయాన్ని పెద్ద రాద్దాంతం వరకు తెచ్చిపెట్టుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. గోటితో పోయే విషయాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇదే అన్నట్టుగా తయారైంది వీరిద్దరి వ్యవహారాన్ని గమనిస్తుంటే. హైదరాబాద్ పంజాగుట్టలోని ప్రజా భవన్ వద్ద బారిగేట్లపైకి బీఎండబ్లూ కారును దూసుకెళ్లే విధంగా ఈ నెల 24వ తేదిన నడిపించిన సోహెల్ తప్పించుకునేందుకు డ్రైవర్ ను రంగంలోకి దింపాడు. అర్థరాత్రి అమ్మాయిలతో కలిసి వెల్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం విఫలం అయ్యాయనే చెప్పాలి.
ఒకరు ఇంటికి… మరోకరు దుబాయికి…
ఇకపోతే ఈ రోడ్డు ప్రమాదం విషయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మీనామేషాలు లెక్కించడంతో పంజాగుట్ట సీఐ దుర్గారావుపై వేటు పడిన సంగతి తెలిసిందే. పోలీసు బాసుల వరకు ఈ అంశం చేరితే తాను ఈ వ్యవహారంలో చిక్కుకుంటానని తెలిసి కూడా కేసును తప్పుదోవ పట్టించే వ్యవహారంలో సపోర్ట్ గా వ్యవహరించడం విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజా భవన్ సమీపంలోనే జరిగిన రోడ్డు ప్రమాదం విషయం కావడం, అందునా గతంలోనే పలు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కావడంతో పోలీసు అధికారులు ఈ ప్రమాదం విషయంలో లోతుగా అరా తీసి సీఐని సస్పెండ్ చేశారు. అనారోగ్యానికి గురయి అసుపత్రి పాలైన సీఐ దుర్గారావు అటు నుండి అటే ఇంటికి చేరుకోవల్సిన పరిస్థితి తయారైంది. ఇకపోతే ఈ ఘటనలో ఏ1 నిందితుడిగా ఎన్న షకీల్ తనయుడు సోహెల్ కూడా ప్రమాదం జరిగినప్పటి నుండి తప్పించుకుని తిరుగుతూ దుబాయ్ కి వెల్లిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతన్ని పట్టుకునేందుకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చేవరకు తెచ్చుకున్న తీరులో సోహెల్ వ్యవహరించిన తీరే విస్మయానికి గురి చేస్తోంది. చిన్న రోడ్డు ప్రమాదం గురించి సోహెల్ హుటాహుటిన తప్పించుకుని పారిపోవడానికి కారణాలు ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది.
అందులో ఉన్నవారెవరో..?
అయితే ఓ రోడ్డు యాక్సిడెంట్ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకున్నాడు. లోక్ అదాలత్ కు వెల్లి తప్పు ఒప్పుకున్నట్టయితే జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి మాత్రమే ఉండేది. కానీ సోహెల్ ఈ విషయాన్ని అంత తీవ్రంగా పరిగణించుకుని ఎందుకు పారిపోయాడన్నదే అంతు చిక్కకుండా పోతోంది. చిన్న కేసు విషయంలో ఎవరికీ చిక్కకుండా తప్పించుకుని ఫ్లైట్ ఎక్కాడానికి కారణాలు ఏంటీ అన్నదే పజిల్ గా మారింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఆ కారులో ఉన్న మిగతా వారు ఎవరూ..? అసలు వారంతా ఆ కారులు ఎందుకు ఉన్నారు..? అన్న విషయాలు తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనుమానిత వ్యక్తులను తనతో పాటు తీసుకెల్తున్నారా లేక కారులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగాయా అన్న కోణంలో కూడా ఆరా తీయాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా గతంలో తండి అధికారాన్ని అండగా చూసుకుని చట్టాన్ని ధిక్కరించి నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తాయని పరార్ అయ్యాడా లేక ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. సాధారణ రోడ్డు ప్రమాదం విషయంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయి వరకు పారిపోయేంత సీన్ అవసరం లేదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. న్యాయవాదుల సలహాలు తీసుకున్నా కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తారు కానీ అతను విదేశాలకు పారిపోయేంత సలహాలు ఇచ్చేంత సీరియస్ కేసు అయితే కాదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. సోహెల్ విదేశాలకు పారిపోయేంత తీవ్రమైన నేరం కాకపోయినప్పటికీ అతను ఎందుకు వెల్లాడు… అసలు కారణం ఏంటి అన్నదే పజిల్ గా మారింది.