లీకు వీరులు… ఎవరా రాకుమారులు..?

బీజేపీ ముఖ్య నాయకుల్లో అంతర్గత చర్చ…

దిశ దశ, హైదరాబాద్:

అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలు బయటకు ఎలా పొక్కుతున్నాయి..? అభిప్రాయ బేధాలపై డిస్కషన్ జరిగినా పార్టీ లైన్ దాటుతున్నారెందుకు..? రహస్యంగా ఉంచాల్సిన విషయాలపై లీకులు ఇచ్చేసి… బాహటంగా గుంభనంగా వ్యవహరిస్తున్నారెందుకు..? ఇలాంటి ప్రశ్నలు బీజేపీ సీనియర్లను వేధిస్తున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాల్సింది పోయి రచ్చ రచ్చ చేసి ఇంట గెలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం పార్టీ అధిష్టానం పసిగట్టినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన కొంతమంది సీనియర్లు కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అధి నాయకత్వం పావులు కదుపుతుంటుంటే అంతర్గతంగా అసమ్మతి కుంపట్లు రాజుకున్నాయన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించడానికి కారణమేంటన్న విషయంపై పోస్టు మార్టం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ లీకులేల..?

జాతీయ నాయకత్వం దృష్టిలో లేని అంశాలు కూడా మీడియాకు లీకు చేస్తూ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారన్న వాదనలు మొదలయ్యాయి. దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో బ్రేకులు వేసే విధంగా రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మార్పులు చేర్పులు అంటూ లేనిపోని ప్రచారం చేస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇతర పార్టీల నుండి ఎంతమంది వచ్చినా వారికి సముచిత ప్రాధాన్యం కల్పించాలన్న విధానంతో జాతీయ నాయకత్వం ముందుకు సాగుతోంది. అయితే కీలకమైన బాధ్యతల విషయంలో పార్టీ సిద్దాంతాన్ని కాదని మాత్రం ఇతరులకు కట్టబెట్టడం మాత్రం సాధ్యం కాదన్న విషయంపై కుండ బద్దలు కొడుతున్నారు ముఖ్యనాయకులు. అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారంటూ ప్రచారం చేస్తున్న తీరుపై మాత్రం జాతీయ నాయకత్వం అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ అంశమే కాకుండా పార్టీలో చేర్పించుకుంటున్న వారి విషయంలో కూడా ముందస్తు లీకేజీలు అవుతుండడం కూడా పార్టీకి మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారే ఎక్కువ. అంతర్గతంగా చర్చించి వారు కమలం వైపు అడుగులు వేస్తే సరి లేకుంటే వదిలేయాలి కానీ ముందే ఆర్భాటం చేయాల్సిన అవసరం ఎందుకంటున్న వారే ఎక్కువ. ఇటీవల ముఖ్య నాయకులిద్దరిని పార్టీలో చేర్పించుకునే విషయంలో జాతీయ నాయకులు, రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులు రెండు మూడు సార్లు చర్చలు జరిపినా బయటకు లీకు కాలేదు. కానీ ఆ తరువాత చేసిన ప్రయత్నాల గురించి ఓపెన్ కావడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. ఈ అంశం మరుగున పడేందుకో లేక, ఇతరాత్ర కారణమో తెలియదు కాని రాష్ట్ర అధ్యక్షుడి మార్పు విషయం గురించి సీరియస్ గా జరుగుతున్న ప్రచారం సరైంది కాదన్న అభిప్రాయంతో జాతీయ నాయకత్వం ఉంది.

టార్గెట్ సంజయ్…?

గత నెల రోజులుగా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ ని తొలగిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చి బండి సంజయ్ ని తొలగించడం లేదని, ఆ ఆలోచన అధిష్టానం ముందు లేదని స్పష్టం చేశారు. దీంతో నాలుగు ఐదు రోజులు చల్లబడ్డట్టే చల్లబడిన ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్షణమో మరు క్షణమో ‘బండి’ని తప్పిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్య నాయకులు కినుక వహించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేర్పులు ఉన్నట్టయితే తామే ముందు ప్రకటిస్తాం కదా ఇలా అసమ్మతి ఉందన్న సంకేతాలు ఇవ్వడం వల్ల ప్రజల్లో బీజేపీని వీక్ చేసే విధంగా కుట్ర జరుగుతోందా అన్న అంశంపై జాతీయ నాయకత్వం సునిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో చేరిన ఇద్దరు ముగ్గురు నాయకులు మునుగోడు ఉప ఎన్నికలప్పుడు తిరిగి సొంతగూటికి వెల్లిపోయిన తరువాత జాతీయ నాయకత్వం ఇతర పార్టీల నుండి వచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్న సంకేతాలను రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు ఇచ్చింది. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతల సేవలు పార్టీకి పూర్తి స్థాయిలో అందిస్తూ విశ్వాసాన్ని చురగొంటే సముచిత స్థానం ఇచ్చేందుకు సిద్దమే కానీ పార్టీకి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తే అసలుకే ఎసరు వస్తుందని జాతీయ నాయకత్వం చెప్తున్నట్టు సమాచారం. తాజాగా బండి సంజయ్ ని మారుస్తారన్న గందరగోళం సృష్టించడంతో ప్రజల్లో చులకన కావడంతో పాటు పార్టీ నాయకత్వం అంతా ఇదే అంశంపై దృష్టి పెట్టాల్సి వస్తోందని, పార్టీని బలోపేతం చేసే అంశం మరుగునపడిపోయే ప్రమాదం తయారైందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నాయకులు. బండి సంజయ్ ని మార్చడం వల్ల వచ్చే లాభం వారికెలా ఉన్నా పార్టీ బలహీనపడిపోతోందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. నాలుగైదు రోజులుగా సాగుతున్న ఈ ప్రచారం వల్ల రాష్ట్రం పార్టీ చేపడుతున్న భారీ కార్యక్రమాలు విఫలం అవుతయాని, దీనివల్ల ఇటీవల సాధించుకున్న పట్టు సడలిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న చర్చను ప్రజల నుండి దూరం చేసేందుకు మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామ గ్రామన బీజేపీ బలం పుంజుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి అనవసర అంశాలపై లీకులు ఇచ్చి మరీ పార్టీ ప్రతిష్టను దిగజార్చడం సరికాదని, ఇక ముందు ఇలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలన్న భావనలో ముఖ్య నాయకత్వం ఉంది. తాజాగా బీజేపీ జాతీయ నాయకుడు పోల్సాని మురళీధర్ రావు కూడా బండి సంజయ్ ని మార్చాలన్న యోచన లేదని తేటతెల్లం చేశారు. ఇక నైనా పార్టీ నిర్మాణం చేయడంపై దృష్టి పెట్టిన వారికే గుర్తింపు ఇస్తాం కాని ఇలాంటి తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుడితే కఠినంగా వ్యవహరిస్తామని జాతీయ నాయకులు స్పష్టం చేస్తున్నారు. బండి సంజయ్ ని మార్చాల్సిన ఆవశ్యకత అయితే లేదని జాతీయ నాయకత్వం చెప్తున్నప్పటికీ పదే పదే ఇదే విషయాన్ని ప్రజల్లో చర్చకు లేవనెత్తుతున్నారెందుకు అన్న వివరాలపై ఆరా తీసే పనిలో కూడా నిమగ్నమయినట్టు విశ్వసనీయ సమాచారం.

You cannot copy content of this page