పరిహారం చెల్లించే విషయంలో పారదర్శకత పాటించారా..?

అప్పుడలా… ఇప్పుడిలా..?

దిశ దశ, మహదేవపూర్:

బట్టికొట్టు భూముల మాయాజాలంలో ఒక్కో వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ఖాజా మోహినోద్దీన్ పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూములను కొనుగోలు చేయాలనుకున్న రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదట ఖాజా మోహినోద్దీన్ పట్టాదారుగా పేర్కొంటూ నోటిపికేషన్ విడుదల చేసిన అధికారులు పరిహారం మాత్రం వేరే పట్టదారులకు ఇచ్చారు. 2007లో మూడో విడుత ఇందిరమ్మ ఇండ్ల కోసం భూసేకరణ జరిపినప్పుడు సింగినేని ఎర్రయ్య, బొమ్మన స్వాతిలు ఖాజా మోహినోద్దీన్ వారసునిగా చెప్తున్న ఖాజా సిద్దిఖ్ అహ్మద్ వద్ద కొనుగోలు చేశారని పేర్కొంటూ ఇచ్చిన ఎంఓయూ ఆదారంగా పరిహారం ఎర్రయ్య, స్వాతిలకు ఇచ్చినట్టుగా రికార్డుల్లో పేర్కొన్నారు. ఇందులో సింగినేని ఎర్రయ్యకు 3.37 గుంటలకు రూ. 7.85 లక్షలు, బొమ్మన స్వాతికి 4 ఎకరాలకు గాను రూ. 8 లక్షలు చెల్లించినట్టుగా రికార్డులు చెప్తున్నాయి.

ఇటీవల…

అయితే ఖాజా మోహినోద్దీన్ వారసునిగా ఉన్న ఖాజా సిద్దిఖ్ అహ్మద్ విక్రయించిన ఈ భూమికి 2007లో పరిహారం చెల్లించే విషయంలో రెవెన్యూ అధికారులు పట్దారుకు కాకుండా ఒప్పంద పత్రం ఆధారంగా డబ్బులు చెల్లించారు. ఇదే భూమిని 2010లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా ఖాజామోహినోద్దిన్ వారసుల నుండి కొనుగోలు చేసిన వారు ఇతరులకు విక్రయించినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే రెండోసారి జరిగిన క్రయ విక్రయాలు 2010లో జరిగినట్టుగా రిజిస్ట్రేషన్ విభాగం రికార్డులు తేల్చి చెప్తున్నాయి. కానీ 2019లో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైప్ లైన్ కోసం సేకరించిన భూమికి పరిహారం మాత్రం 2010కి ముందు హక్కుదారులుగా ఉన్న ఎర్రయ్య, స్వాతిలకు చెల్లించడం గమనార్హం. పీపీపీ నంబర్ 0409 ప్రకారం 14 గుంటల భూమికి సింగినేని ఎర్రయ్య వద్ద కొనుగోలు చేసిన అధికారులు రూ. 4.37 లక్షలు, పీపీపీ నంబర్ 397942/831 బొమ్మన స్వాతి పేరిట ఉన్న 13 గుంటల భూమికి రూ. 4.06 లక్షలు ఇచ్చినట్టుగా భూ సేకరణ విభాగం రికార్డుల్లో ఉంది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం ఇచ్చే సమయంలో కొత్త పట్టాదారుల పేర్లు భూ సేకరణ విభాగంలో ఎందుకు చేర్చలేదు, కొనుగోలు చేసిన వారు రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిట భూమిని మార్పిడి చేయించుకోకపోవడానికి కారణం ఏంటీ..? 2007లో ఇందిరమ్మ ఇళ్ల కోసం నోటిఫికేషన్ ఖాజా మోహినోద్దీన్ పేరిట వెలువడితే ఏడాదిలోగానే పట్టాదారుల పేర్లు మార్చాలన్న ఒప్పంద పత్రాన్ని సంబంధిత కార్యాలయంలో సమర్పించారు. అయితే ఆ తరువాత 2010లో ఇతరులకు విక్రయించినా 9 ఏళ్ల తరువాత 2007లో ఉన్న పట్టాదారుల పేరిటనే చిన్న కాళేశ్వరం పరిహారం విడుదల కావడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ అన్నదే తేలాల్సి ఉంది.

అదెలా సాధ్యం..?

మరో వైపున ఖాజా మోహినోద్దీన్ వారసునిగా పేర్కొంటున్న ఖాజా సిద్దిఖ్ అహ్మద్ కుటుంబ సభ్యులంతా కలిసి తనకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారని చెప్పినట్టయితే  ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కూడా జత చేయాల్సి ఉంటుంది. ఖాజా సిద్దిఖ్ అహ్మద్ మహదేవపూర్ వాసి అని విలేజ్ రెవెన్యూ అధికారి దృవీకరణ చేసిన పత్రాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో జత చేశారు. అసలు దృవీకరణ పత్రాలను తహసీల్దార్ స్థాయి అధికారి కాకుండా ఓ గ్రామ స్థాయి అధికారి జారీ చేసినా అనుమతించడానికి కారణం ఏంటన్నదే మిస్టరీగా మారింది. మరోవైపున సర్టిఫికెట్ జారీ చేసిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కుటుంబ సభ్యులు కూడా ఇందులో కొంత భూమిని కొనుగోలు చేసినట్టుగా డాక్యూమెంట్లు చెప్తున్నాయి. ఖాజా మోహినోద్దీన్ మహదేవపూర్ వాసేనని వీఆర్వో ఇచ్చిన సర్టిఫికెట్ ను బట్టి విశ్వసించినప్పటికీ అసలు ఆ భూమిని ఖాజా సిద్దిఖ్ అహ్మద్ విక్రయించడానికి అతనికి ఉన్న హక్కులు ఏమిటీ అన్న విషయాన్ని రిజిస్ట్రేషన్ అధికారులు విస్మరించారెందుకు..? ఇతర కుటుంబ సభ్యులతో పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని క్రయ విక్రయాలు జరిపినట్టుగా చెప్తున్నా…  వారు ఖాజా మోహినోద్దీన్ వారసులేనన్న ధృవీకరణ పత్రాలు ఇచ్చారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. అసలైన వారుసులే అయినట్టుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పించిన డాక్యుమెంట్లలో ఉన్నట్టయితే ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన కార్యాలయం వివరాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. పలిమెల పాషా దొరగా పిలుచుకునే ఖాజా మోహినోద్దీన్ కుటుంబ సభ్యులంతా కూడా చాలా కాలంగా హైదరాబాద్ లోనే ఉండే వారని పాషా దొర మాత్రమే ఈ ప్రాంతంలో అనుబంధం కొనసాగించేవారని స్థానికులు చెప్తున్నారు. అయితే నక్సల్స్ ప్రాబల్యం తీవ్రంగా పెరిగిపోయిన తరువాత పీపుల్స్ వార్ టార్గెల్ చేసిన పాషా దొర కూడా హైదరాబాద్ కు తరలివెల్లిపోయి అక్కడే మరణించారన్నది నిజం. అయినప్పుడు ఖాజా మోహినోద్దీన్ మరణ ధృవీకరణ పత్రం ఆయన మరణించిన ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే పాషా దొర వారసుల వివరాలను కూడా సర్టిఫై చేస్తూ అక్కడి రెవెన్యూ అధికారులే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఖాజా సిద్దిఖ్ అహ్మద్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా హక్కులు పొందినప్పుడు ఏఏ డాక్యూమెంట్లు అప్పగించారోనన్న విషయంపై దృష్టి సారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం మహదేవపూర్ మండల అధ్యక్షుడు మేరుగు లక్ష్మణ్ అంటున్నారు. అంతేకాకుండా ఖాజా మోహినోద్దీన్ వారసులుగా పేర్కొన్న వారు మంథని ఎస్ఆర్ఓ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరయ్యారా ఆన్ లైన్ లోనే అప్రూవల్ చేశారా అన్న విషయంపై కూడా దృష్టి సారించాలని కోరారు. అంతేకాకుండా ఖాజా మోహినోద్దీన్ వారసులుగా పేర్కొన్న ఎనిమిది మందిలో ఆయనతో ఉన్న వారికి రిలేషన్ షిప్ ఏంటీ అన్న విషయంపై కూడా ఆరా తీయాలని లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. నిరుపేదలకు నివేశన స్థలాలు ఇచ్చిన తరువాత వారు నిబంధనల ప్రకారం కబ్జాలో లేరని రద్దు చేసిన అధికారులు ఖాజా మోహినోద్దీన్ వారసులు జరుపుతున్న క్రయవిక్రయాల విషయంలోనూ నిబంధనల మేరకు నడుచుకోవల్సిన అవసరం ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు. కనీసం రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను చూసైనా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది కానీ వీఆర్వో ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా డాక్యూమెంట్లను ఎలా అప్రూవల్ చేశారన్న విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ను పరిగణనలోకి తీసుకునేందుకు నిబంధనలు అనుకూలిస్తాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page