దిశ దశ, భూపాలపల్లి:
ఏదైనా నిర్మాణం చేయాలంటే ముందుగా ప్రతిపాదిత స్థలానికి వెల్లి ఇంజనీర్లు పరిశీలన చేస్తారు. నిర్మాణం చేపట్టాల్సిన పని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. అక్కడ భూమి ఎలా ఉంది..? కాంక్రీట్ లేక బండ రాళ్లతో పునాదులు వేయాల్సి ఉంటుందా..? గ్రావెల్ ఎంత మోతాదు వినియోగించాలి..? నిర్మాణ విస్తీర్ణం ఎంత, అక్కడి బౌగోళిక పరిస్థితులు ఏంటీ ఇలా ప్రతి విషయాన్ని కూడా ఇంజనీర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. నీటి ప్రవాహం ఉన్న చోట అయితే గతంలో వచ్చిన వరద ఉధృతి ఎంత..? ప్రస్తుతం వస్తున్న వరద తీవ్రత ఎలా ఉంది..? వర్షాకాలంలో అయితే ఎలా ఉంటుంది..? ఎగువ ప్రాంతాల్ల నుండి వరద ఏ స్థాయిలో వస్తుంది..? రానున్న కాలంలో ఎలా ఉండబోతోంది అన్నవాటిపై ఓ అంచనాలకు వస్తారు. అలాగే నిర్మించాల్సిన ప్రాంతం సురక్షితమైనదేనా..? అక్కడ పిల్లర్ల లోతు ఎంత మేర తీసుకోవాలని, నిపుణుల అభిప్రాయాలు, భూకంప ప్రభావిత ప్రాంతమా..? పిల్లర్ల కోసం తవ్వే గుంతల కింది భాగం పటిష్టంగా ఉంటుందా లేదా అన్న సంపూర్ణ వివరాలపై అధ్యయనం చేసి అంచనాలు వేస్తుంటారు. అయితే నిర్మాణం ఆలస్యం అయినప్పుడు ధరలు పెరగడం వల్లనో లేక అనుకోని విధంగా సమస్య ఎదురైనప్పుడు మాత్రమే ఎస్టిమేట్లను రివైజ్ చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంచనాలు పెంచే విధానానికి బదులుగా ఇటీవల కాలంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ అన్న విధానం సర్వసాధారణంగా మారిపోయింది. ముందుగా ఎస్టిమేట్ వేయడం ఆ తరువాత రివైజ్ చేయడం, టెండర్ కు ముందో రేటు, ఆ తరువాత మరో రేటు, నిర్మాణం జరుగుతున్నప్పుడు ఓ అంచనా, తుది దశకు వచ్చినప్పుడు మరో అంచనా ఇలా మార్పులు, చేర్పులు అత్యంత కామన్ అన్నట్టుగా మారిపోయింది ఇంజనీరింగ్ విభాగాల్లో. సీఈ స్థాయి అధికారి ఎంత శాతం వరకు ఎస్టిమేట్లను రివైజ్ చేసే అవకాశం ఉంటుందోనన్న విషయంపై కూడా స్పష్టత రావల్సిన అవసరం ఉంది.
కాళేశ్వరం అంచనాలు…
తాజాగా జస్టిస్ కమిషన్ కాళేశ్వరం విచారణలో భాగంగా ఈఎన్సీగా పనిచేసిన నల్లా వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. అంచనాలను ప్రభుత్వం మార్చిందని ఆయన కమిటీ ముందు చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రూ. 13,999 కోట్ల అంచనాలతో మొదట ప్రతిపాదనలు సిద్దం కాగా రాష్ట్ర ప్రభుత్వం 2018, 2019ల్లో అంచనాలను మార్చిందని నల్లా వెంకటేశ్వర్లు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు వివరించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును స్వరాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వం రీ డిజైన్ చేయించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రాణహిత నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా కాకుండా… దిగువన ఉన్న మేడిగడ్డ నుండి నీటి లభ్యత ఎక్కువగా ఉందని భావించి మూడు బ్యారేజీలను, మూడు పంప్ హౌజుల నిర్మాణంపై సర్వే చేయించింది. ఎల్లంపల్లి ఎగువ ప్రాంతాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులను కొత్తగా నిర్మించడం వంటి నిర్ణయాలతో కొత్త ప్రతిపాదనలను అమలు చేసింది. అయితే కాళేశ్వరం బ్యారేజీలను ఎక్కడెక్కడ నిర్మిచాలి తదితర అంశాలపై రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, వాప్కోస్ సంస్థతో సమగ్ర అధ్యయనం చేయించారు. ఈ రెండు సంస్థలకు చెందిన నిపుణులు పలు మార్లు క్షేత్ర స్థాయి పర్యటన చేయడంతో పాటు ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. వాప్కోస్ ఇచ్చిన ప్రతిపాదనలకు ఓకె చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మూడు బ్యారేజీలు, మూడు పంప్ హౌజులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో పలు మార్పులు చేర్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇరిగేషన్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ప్రారంభం అయిన ఈ బ్యారేజీ నిర్మాణలను చేపట్టే ముందు ఇసుక శాంపిల్స్ సేకరించి పరిశీలించడం, ఏ పిల్లర్ కు ఎంత డెప్త్ తీసుకోవాలి, కాంక్రీట్ మెటిరియల్ ఎంతమేర వినియోగించాలి తదితర అంశాలన్నింటిని కూడా పరిశీలించి అందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినప్పటికీ వరధ ఉదృతిలో నిర్మిస్తున్నందున ఆ సమయంలో ఎదురయ్యే ప్రాక్టికల్ సమస్యలను పరిష్కరించుకునేందుకు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఇదంతా కూడా నీటిలోపల జరిగే నిర్మాణాల విషయంలో మాత్రమే చోటు చేసుకుంటుంది. కానీ ఈ మూడు బ్యారేజీల విషయంలో ఏక కాలంలో అంచానాలు పెంచేయడం గమనార్హం. ఎస్టిమేట్లు మార్చడానికి బలమైన కారణాలు ఏంటీ అన్న వివరాలను కూడా సేకరించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ నిజంగానే నిర్మాణ సమయంలో అవాంతరాలు ఎదురు కావడం వల్లే ఎస్టిమేట్లు రివైజ్ చేసినట్టయితే, మొదట అధ్యయనం చేసిన అధికారులు, సర్వే ఏజెన్సీలు ఆ విషయాన్ని అంచనా వేయడంలో విఫలం అయినట్టేనని స్పష్టం అవుతోంది. గతంలో నిర్మించిన బ్యారేజీల విషయంలో ఎదురైన అనుభవాలపై కూడా అధ్యయనం చేయడం వల్ల ప్రాక్టికల్ గా ఎదురైన సమస్యలు కూడా నేటి తరం ఇంజనీర్లకు తెలుస్తాయి. దీంతో ఆనాడు ఎదురైన సమస్యలు, కొత్తగా చేయనున్న నిర్మాణ ప్రాంతంలో ఎదురుకానున్న సమస్యలపై కూడా ఆయా విభాగాల సమన్వయంతో ఆరా తీసినట్టయితే 80 శాతం వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కావన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచడం సహజం కానీ ఏకంగా బారీగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అన్న విషయంపై కూడా దృష్టి సారించాల్సిన అసవరం ఉంది.
ఎగువ వారధి…
ముఖ్యంగా మేడిగడ్డ విషయాన్ని ఆలోచిస్తే ఇంజనీరింగ్ అధికారులు ఎగువ ప్రాంతంలో ఇటీవలె నిర్మించిన అంతరాష్ట్ర వంతెనలో ఎదురైన అనుభవాలను పరిశీలించారా లేదా అన్న విషయంపై స్పష్టత రావడం లేదు. 1997 ప్రాంతంలో కాళేశ్వరం వద్ద గోదావరి నదిపై మహారాష్ట్రకు అనుసంధానం చేసేందుకు బ్రిడ్జి నిర్మాణం కోసం సర్వేలు జరిపారు. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (PWD) ఇంజనీర్ల బృందం నెలల తరబడి సర్వేలు జరిపింది. ఆ తరువాత నిర్మాణం మొదలు పెట్టినప్పటికీ వచ్చిన నదిలో వచ్చిన మార్పుల వల్ల పిల్లర్ల లోతు ఎక్కువగా తీయాల్సి వచ్చింది. దీంతో నీటిలో ఎంత లోపల వరకు పిల్లర్లను వేస్తే వంతెన శాశ్వతంగా ఉండగలుగుతుంది అన్న విషయం తెలుసుకునేందుకు మరింత మంది నిపుణులు, ఇంజనీర్లు సర్వేలు జరిపారు. అక్కడ నీరు ఎంత లోతు నుండి ప్రవహిస్తోంది, వరధల సమయంలో వస్తున్న ఉధృతి ఎంత మేర ఉంటుంది అన్న వివరాలను సేకరించి కొత్త అంచనాలను తయారు చేశారు. ఈ వంతెన నిర్మాణం కోసం పిల్లర్లను సుమారు 50 పీట్ల నుండి 60 ఫీట్ల లోపల వరకు వేసినట్టుగా తెలుస్తోంది. అదే మేడిగడ్డ విషయానికి వస్తే 40 ఫీట్ల లోతు వరకు పిల్లర్లను వేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల పిల్లర్లు వేసేందుకు అవాంతరాలు ఎదురయినప్పుడు సాండ్ శాంపిల్స్ సేకరించి నిపుణులకు పంపించినప్పడు లోతు ఎక్కువగా తీయాలని సూచించడంతో అందుకు అనుగుణంగానే పనులు చేపట్టామని చెప్తున్నారు ఇంజనీర్లు. అలాగే ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో గోదావరి నదిపై నిర్మించిన వంతెన విషయంలోనూ పిల్లర్లు వేస్తున్నప్పుడు ఎదురైన అవాంతరాలను గుర్తించి అంచనాలను మార్చారు. ఎగువ, దిగువ ప్రాంతంలో నిర్మించిన అంతరాష్ట్ర వారధుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టయితే మరింత మెరుగైన నిర్మాణం జరిగేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రివైజ్డ్ ఎస్టిమేట్లు కూడా ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు చేస్తే తప్ప ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉండదు… కానీ కాళేశ్వరం బ్యారేజీల విషయంలో మాత్రం ప్రభుత్వమే అంచనాలను మార్చిందని ఈన్సీగా పని చేసిన నల్లా వెంకటేశ్వర్లు కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.
వేగం కూడా కొంప ముంచిందా…
మరో వైపున బ్యారేజీ నిర్మాణం సమయంలో కాంక్రీట్ క్యూరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. బ్యారేజ్ కి వేసిన బెడ్ కానీ, పిల్లర్ల కోసం కానీ వినియోగించిన కాంక్రీట్ క్యూరింగ్ అయినా కొద్ది వాటిపైన నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. 28 రోజుల పాటు వాటర్ క్యూరింగ్ చేసినట్టయితే సిమెంట్, కాంక్రీట్ నిర్మాణాల్లో 98 శాతం పటిష్టత ఉంటుందని తెలుస్తోంది. అయితే నది ప్రవాహంలో నిర్మిస్తున్నందున ఇక్కడ క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి అన్న నిబంధనలు కూడా ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రవాహాల్లో నిర్మాణాల విషయంలో నిబంధనల మేరకు నడుచుకోకపోవడం కూడా ఓ కారణమై ఉంటుదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున బ్యారేజీకి దిగువ భాగంలో సీఫేజీ వాటర్ స్పీడ్ ను అంచనా వేసి అప్ స్ట్రీమ్ ఏరియాలో, డౌన్ స్ట్రీమ్ ఏరియాలో కూడా కాంక్రీట్ వర్క్ ఎలా చేయాలి అన్న విషయంలోనూ నిపుణుల సూచనలు తీసుకోవల్సి ఉంటుందని తెలుస్తోంది.