ఆ నదుల అనుసంధానం సాధ్యమేనా..?

దిశ దశ, భూపాలపల్లి:

కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి, కావేరి నదులను లింక్ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్దం చేసుకుంది. ఇందుకు అవసరమైన కార్యాచరణ కూడా రూపొందించుకున్న కేంద్ర ప్రభుత్వం సర్వే బాధ్యతలను (NWDA)అప్పగించింది. ఈ మేరకు ఈ నెల 8న జాతీయ నీటి అభివృద్ది సంస్థ ప్రతినిధుల బృందం క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ఇచ్చంపల్లి వద్ద గోదావరి, కావేరి నదుల అను సంధానానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టాలని కేంద్రం భావిస్తోంది.

తెలంగాణ సూచన ఇలా…

అయితే రెండు నదుల అనుసంధాన ప్రక్రియకు తాము ఇప్పటికే నిర్మించిన సమ్మక్కసారలక్క బ్యారేజీని వినియోగించుకోవాలని ఇక్కడి సర్కారు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే తుపాకుల గూడెం వద్ద పూర్తయిన సమ్మక్క సారలక్క బ్యారేజీని 83 మీటర్ల ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్మించగా చత్తీస్ గడ్ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, పర్యావరణ సమస్య కూడా ఉత్పన్నమవుతుందని కూడా చత్తీస్ గడ్ సర్కారు వాదిస్తోంది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసింది. ఈ క్రమంలో ఈ బ్యారేజీ ద్వారా గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ సర్కారు సూచిస్తున్నప్పటికీ NWDA నిపుణులు ఈ బ్యారేజీ ఎత్తును మరో 2 మీటర్లకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. 83 మీటర్ల ఎత్తున నిర్మిస్తేనే అభ్యంతరాలు వ్యక్తం చేసిన చత్తస్ గడ్ సర్కారు 2 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. ఇచ్చంపల్లికి దిగువ ప్రాంతాల్లో నిర్మించిన సమ్మక్క సారలక్క ప్రాజెక్టులో 50 టీఎంసీలు, దేవాదుల ప్రాజెక్టు 38 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టు 70 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టి గోదావరి, కావేరి నదుల అనుసంధానం చేపట్టినట్టయితే ఈ మూడు ప్రాజెక్టులు కూడా వృధా అయ్యే ప్రమాదం ఉందని కూడా అంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను సాధించుకోవాలంటే తుపాకులగూడెం సమ్మక్కసారలక్క ప్రాజెక్టును వినియోగించుకోవాలని బలంగా చెప్తోంది. దీనివల్ల అటు కేంద్ర ప్రభుత్వం గోదావరి, కావేరి నదులను అనసంధాన ప్రక్రియకు ఇబ్బందులు లేకుండా ఇటు ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగిస్తున్న 158 టీఎంసీల నీటిని యథావిదిగా వాడుకోవచ్చన్న అభిప్రాయాన్ని తెలంగాణ సర్కారు చెప్తోంది.

NWDA అభిప్రాయం ఇది…

గోదావరి నదిలో నీటి లభ్యతపై జాతీయ నీటి అభివృద్ది సంస్థ ప్రత్యేకంగా అధ్యయనం కూడా చేసింది. బాల్కొండలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి ఇచ్చంపల్లి వరకు 324 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని తేల్చింది. ఇందులో చత్తీస్ గడ్ రాష్ట వాటా 147 టీఎంసీలు ఉండగా ఆ రాష్ట్రం ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితులు లేవని గుర్తించింది. మరో 20 ఏళ్ల వరకు కూడా ఈ నీటిని చత్తీస్ గడ్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకునే అవకాశం లేదని వృధాగా సముద్రంలో కలిసిపోవడం తప్ప మరో ప్రత్యామ్యాయం లేదని NWDA ప్రతినిధులు చెప్తున్నారు. ఈ 147 టీఎంసీల నీటిని గోదావరి, మనిభద్ర అనుసంధానం చేసి అక్కడి నుండి కావేరికి తరలించాలని ప్రతిపాదిస్తున్నారు.

అక్కడ అయితే అలా… ఇక్కడయితే ఇలా…

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఇచ్చంపల్లి నుండి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ విషయంలో ఆయా రాష్ట్రాల నుండి సానుకూలత వ్యక్తమవుతుందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఇచ్చంపల్లి వద్ద 105 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణం చేపట్టి గోదావరి, కావేరి నదుల అనుసంధానం చేయాలని యోచిస్తున్నందున మూడు రాష్ట్రాల్లో భూ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు సంబంధించిన భూములు, అడవులు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. చత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పరివాహక ప్రాంతాల్లో నివసించే జనాభా తక్కువే. అయితే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అడవులు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ తెలంగాణాలో మాత్రం ఇందుకు పూర్తి వైవిధ్యమైన పరిస్ధితులు నెలకొన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంమంతా కూడా వ్యవసాయ యోగ్యమైన భూములు కావడం విశేషం. ఇచ్చంపల్లి ఎగువన ఉన్న భూముల్లో వాణిజ్య పంటలతో పాటు వరి తదితర పంటలు కూడా పండించుకుని జీవనం సాగిస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం పూర్తయితే దాదాపు మేడిగడ్డ బ్యారేజీ వరకు కూడా బ్యాక్ వాటర్ నిలువ ఉండే అవకాశాలు లేకపోలేదు. దీంతో పరివాహక ప్రాంతంలోని అన్ని గ్రామాల భూములు కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఈ పరివాహక ప్రాంత ప్రజలు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇచ్చంపల్లి దిగువ ప్రాంతాల్లో సాగు నీటి లభ్యత అంతంత మాత్రమే కానుండడంతో పాటు బ్యారేజీ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరినప్పుడు గేట్టు ఎత్తినప్పుడల్లా దిగువ గ్రామాల పంటలను ముంపునకు గురవుతాయి. దీంతో అటు ఎగువ, ఇటు దిగువ గ్రామాల ప్రజలు దయనీయమైన జీవనం సాగించాల్సిన ప్రమాదం లేకపోలేదు. దీంతో ఇక్కడి ప్రజల అభిప్రాయం మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చంపల్లి వద్ద కేంద్రం నిర్మించనున్న బ్యారేజీకి అభ్యంతరాలు తెలపక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. అయితే తుపాకులగూడెం సమ్మక్కసారలక్కల బ్యారేజీ ఎత్తును పెంచి అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన వైపు కేంద్రం మొగ్గు చూపితే చత్తీస్ గడ్ ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన ఆవశ్యకత ఉంది. 83 మీటర్ల ఎత్తుపైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అక్కడి ప్రభుత్వం అదనంగా మరో 2 మీటర్లు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేస్తుందా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది.


https://dishadasha.com/the-area-that-has-come-to-the-fore-again-the-central-government-is-working-on-connecting-the-two-rivers/

You cannot copy content of this page