చట్టాలను అమలు చేయడమూ కష్టమేనా…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ సీలింగ్ భూముల వ్యవహారంలో తవ్వినా కొద్ది తప్పిదాలు బయటపడుతున్నాయి. కంచె చేను మేసిందన్న విధంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. ఎంతో సదుద్ధేశ్యంతో అమల్లోకి తీసుకొచ్చిన సీలింగ్ యాక్టు అమలు విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శించారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. 1973లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తరువాత వాటిని కాపాడడడంలో విఫలం అయ్యారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
అందివచ్చిన అవకాశం…
అయితే సీలింగ్ భూముల కోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినప్పటికీ కాలానుగుణంగా ఈ వింగ్ ను నామమాత్రమైన విభాగంగా తయారు చేశారన్న విమర్శలు కూడా లేకపోలేదు. ప్రత్యేకంగా సీలింగ్ ట్రిబ్యూనల్ ను కూడా ఏర్పాటు చేసినప్పటికీ అనుబంధ విభాగంలా తయారు చేసి విశేష అధికారాలున్నప్పటికీ నిర్వీరం చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన వేలాది ఎకరాల భూమి అంతా కూడా పట్టాదారుల చేతుల్లోకి చేరిపోయిందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సీలింగ్ యాక్టు ప్రకారం భూములను స్వాధీనం చేసుకున్న తరువాత వాటిని సంరక్షించేందుకు సంబంధిత విభాగం కఠినంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ పాలకుల చూసిచూడని తనం అక్రమార్కులకు వరంగా మారింది. ఇదే అదనుగా భావించిన భూ స్వాములు తమచేతులు దాటిపోకుండా ఉండేందుకు వ్యూహాలకు పదును పెట్టినట్టుగా అర్థం అవుతోంది. ఒక్క జివి సదాశివరావు భూములను పరిశీలిస్తేనే ఈ విషయం తేటతెల్లం అవుతోందంటే మిగతా సీలింగ్ భూముల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అడ్వర్స్ పొజిషన్…
380 ఎకరాలకు పైగా భూములు ఉన్న జివి సదాశివరావు కుటుంబ సభ్యుల నుండి సీలింగ్ చట్టం ప్రకారం భూములను స్వాధీనం చేసుకోల్సి ఉంది. అయితే ఇందులో 94 ఎకరాల అడ్వర్స్ పొజిషన్ చూపించి సీలింగ్ పరిధిలోకి రాదన్న వాదనలు తెరపైకి తెచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సీలింగ్ చట్టం ప్రకారం అడ్వర్స్ పొజిషన్ అనే విధానానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే లేదని తెలుస్తోంది. కానీ సదాశివరావు భూములకు సంబంధించిన అంశంలో మాత్రం అడ్వర్స్ పొజిషన్ పేరిట ట్రిబ్యూనల్ లో విచారణ అంశాన్ని తెరపైకి తీసుకరావడం గమనార్హం. అయితే ఇక్కడ సీలింగ్ ట్రిబ్యూనల్ లో కేసు నడుస్తున్న క్రమంలో భూములు రిజిస్ట్రేషన్ కావడం మరో విశేషం. నగునూరులో అయితే సీలింగ్ భూములను ప్లాట్లుగా చేసి విక్రయించారు. వారసుల మధ్య ఉన్న విబేధాల కారణంగా పెండింగ్ లో పడింది. లేనట్టయితే ఏకంగా ఇక్కడ భవనాలు కూడా వెలిసేవి. నగునూరులోని ఈ సీలింగ్ భూమి రోడ్ ఫేసింగ్ లో ఉండగా రియాల్టర్లు దీనిని ఆధారం చేసుకుని వెనక ప్రాంతంలోని భూమిని కూడా ప్లాట్లుగా చేసి అమ్మేశారు. అయితే సీలింగ్ పరిధిలో ఉన్న ఈ భూమిని రెవెన్యూ అధికారులు కస్టడిలోకి తీసుకుని ఫినిషింగ్ చేసినట్టయితే కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. అయితే మనవడు సాంబశిరావుకు చెందిన భూములను తాతా సాంబశివరావుకు చెందినవేనని వేరే వారసులు అమ్మడంతో వార్ స్టార్ట్ అయింది. అడ్వర్స్ పొజిషన్ అంటూ వాదనలు వినిపిస్తున్న 94 ఎకరాల్లో చల్మెడ హస్పిటల్ నిర్మాణం చేసిన భూమి కూడా ఉంది. ఓ వైపున ట్రిబ్యూనల్ లో కేసు విచారణ జరుగుతుండగానే క్రయవిక్రయాలు ఎలా జరిగాయన్నది రెవెన్యూ అధికారులే తేల్చాల్సిన అవసరం ఉంది. ట్రిబ్యూనల్ విచారణ సమయంలో నగునూరు, బొమ్మకల్ తో పాటు ఇతర భూముల లావాదేవీలు జరిగాయని గుర్తించినా… వాటిని బ్లాక్ లిస్టులో పెట్టి ట్రాంజక్షన్స్ రద్దు చేసేందుకు రెవెన్యూ అధికారులు చొరవ ఎందుకు తీసుకోలేదన్నదే మిస్టరీగా మారింది. మరో వైపున బొమ్మకల్ లోని భూముల గురించి పంచనామ చేసినప్పుడు పంటలు సాగవుతున్నాయని, కొంతమేర చల్మెడ ఆసుపత్రి భవనాలు ఉన్నాయని గుర్తించిన రెవెన్యూ అధికారులు అంతటితోనే సరిపెట్టినట్టుగా అర్థం అవుతోంది. సీలింగ్ యాక్టు పరిధిలో ఉన్న భూములపై ట్రిబ్యూనల్ లో విచారణ జరుగుతోందని అలాంటప్పుడు ఇక్కడ నిర్మాణాలు ఎలా జరుపుతారని, భూములు ఎవరు విక్రయించారన్న వివరాలను సేకరించినట్టయితే బావుండేది. సీలింగ్ చట్టాన్ని అతిక్రమించి నిర్మాణాలు చేశారని, భవనాలను కూల్చాలని నోటీసులు ఇచ్చినట్టయితే రెవెన్యూ అధికారుల చొరవ తీసుకున్నారని అర్థం అయ్యేది. కానీ ఈ విషయంలో మాత్రం వారు పంచనామాతోనే సరిపెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెవెన్యూ అధికారులు ప్రత్యక్ష్యంగా పరిశీలించిన తరువాత తయారు చేసిన పంచనామా కాపీలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, మెడికల్ కాలేజీ అనుమతి ఇచ్చిన వివిధ విభాగాలకు కూడా పంపించకపోవడానికి కారణమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మెడికల్ కాలేజీ, హస్పిటల్స్ కు అనుమతులు ఇచ్చిన సంబంధిత విభాగాలకు రెవెన్యూ అధికారులు లేఖ పంపినట్టయితే ఖచ్చితంగా సానుకూల స్పందన వచ్చేది. సీలింగ్ భూమిలో కట్టిన చల్మెడ హస్పిటల్ విషయంలో రెవెన్యూ అధికారులు ఎందుకు మిన్నకుండి పోయారన్నదే పజిల్ గా మారింది.
అధికారుల కనుసన్నల్లో…
మరోవైపున సీలింగ్ భూముల విషయంలో రెవెన్యూ అధికారులు కూడా ఇష్టారీతిన వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది. సీలింగ్ భూముల విషయంలో కొంతమంది రెవెన్యూ అధికారులు పట్టించుకోని వైఖరితో పాటు ఇష్టం వచ్చినట్టుగా ఆర్వోఆర్ అమలు చేసిన తీరు కూడా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇదే జివి సదాశివరావుకు చెందిన భూములకు సంబంధించిన పాసు బుక్కులను పరిశీలించినట్టయితే రెవెన్యూ అధికారుల ప్రమేయం కూడా స్పష్టం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీలింగ్ భూముల లావాదేవీలను అమలు చేసేందుకు అధికారులు చూపిన అత్యుత్సాహం కూడా విస్మయం కల్గిస్తోంది. సదాశివరావు కుటుంబ సభ్యులకు చెందిన భూముల లావాదేవీలను ఆమోదిస్తూ ఆర్వోఆర్ పాసు బుక్కులు కూడా ఇచ్చేశారు అప్పటి అధికారులు. 1998లో ప్రింట్ అయిన ఆర్వోఆర్ పాసుబుక్కులపై 1995-96 సమయంలో పనిచేసిన తహసీల్దార్ సంతకాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా సేకరించిన పట్టాదారులు కోర్టులను ఆశ్రయించారు. లోకాయుక్తలో కూడా పిటిషన్ వేయడంతో అక్కడ కూడా కేసు విచారణ దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ భూములకు సంబంధించిన అఫడవిట్లను కోర్టులో దాఖలు చేసినప్పుడు అప్పటి అధికారి వ్యవహరించిన తీరును కూడా బాధితులు కోర్టుకు విన్నవించారు. ఓ అఫడవిట్ లో సాంబశివరావులు ఇద్దరు ఉన్నారని మరో అఫడవిట్ లో ఒక్కరే ఉన్నారని దాఖలు చేశారని బాధితులు వెల్లడించారు. అయితే ఈ లావాదేవీలు కూడా సీలింగ్ ట్రిబ్యూనల్ లో కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే కావడం గమనార్హం.
విచారణ దశలోనే..!
ఓ వైపున సదాశివరావు కుటుంబ సభ్యులకు చెందిన ఈ భూముల విషయంలో ట్రిబ్యూనల్ లో విచారణ జరుగుతున్న సమయంలోనే రెవెన్యూ అధికారులు క్రయ విక్రయాలకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే విచిత్రంగా మారింది. విచారణలో ఉన్న భూములను అమ్మడం కానీ కొనడం కానీ తప్పన్న విషయాన్ని మరుగున పెట్టి రెవెన్యూ అధికారులు లావాదేవీలకు సంబంధించిన డాక్యూమెంట్లకు ఆమోద ముద్ర ఎలా వేశారో అంతు చిక్కడం లేదు. అంతేకాకుండా పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇచ్చేంత సాహసం చేశారంటే, చట్టాలను తుంగలో తొక్కినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రిబ్యూనల్ లో కేసు పెండింగ్ ఉన్నదన్న విషయాన్ని వివరిస్తూ లావాదేవీలు రద్దు చేయాలన్న యోచన రెవెన్యూ యంత్రాంగానికి ఇంతవరకూ ఎందుకు రావడం లేదన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ట్రిబ్యూనల్ లో విచారణలో ఉన్న ఈ భూములకు సంబంధించిన లావాదేవీలను రద్దు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా శాఖా పరంగా విచారణ చేసి సీలింగ్ భూముల విషయంలో తప్పులు చేసిన వారిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా చల్మెడ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టిన భూములు సీలింగ్ పరిధిలోనివే కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, కాళోజీ నారాయణ రావు మెడికల్ యూనివర్శిటీకి లేఖలు రాసి ఆ భవనాలను, సీలింగ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని బండారి శేఖర్ కోరుతున్నారు. నిబంధనల మేరకు నడుచుకోని అధికార యంత్రాంగంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.