బుల్లెట్టు బండెక్కెనా… మొగిలిపాలెం పోయేనా…?

బొమ్మకల్ శ్రీనివాస్ వేటకు మూలం అదేనా

దిశ దశ, కరీంనగర్:

వరసగా జరిగిన ఓ రెండు సంఘటనలు ఆ సర్పంచ్ ను ఇక్కట్లలోకి నెట్టాయా..? ఇంతకాలం జరుగుతున్న ప్రచారానికి ఆ రెండు ఘటనలు బలం చేకూర్చాయా..? ఇంతకు ఏం జరిగి ఉంటుంది..? ధీమాతో తిరిగిన వ్యక్తి జాడలేకుండా పోవడం వెనక ఆంతర్యం ఏంటీ..? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిందక్కడ.

అసలేంటీ…?

కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ లక్ష్యంగా చేసుకుని పోలీసులు వేట ఎందుకు ప్రారంభించారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బొమ్మకల్ శివార్లలోని భూముల వ్యవహారంలో పురుమళ్ల శ్రీనివాస్ రికార్డులు తారుమారు చేశారన్న ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. పులు కేసులు నమోదు చేసి ఆయన్ను జైలుకు పంపించారు. ఇదే సమయంలో రెవెన్యూ అధికారులు కూడా ఈ వ్యవహారంలో లోతుగా విచారణ చేశారు. బొమ్మకల్ శివార్లలో ఉన్న ప్రభుత్వ భూములు, జలశయాలు, పట్టా ల్యాండ్ తదితర వివరాలన్నింటి గురించి పాత రికార్డులను తిరగదోడి మరీ బయటకు తీశారు. రెవెన్యూ ఆఫీసుల్లో భూములకు సంబంధించిన రికార్డులు తారు మారైన తీరు గురించి కూడా ఆరా తీసి నివేదికలు తయారు చేశారు. ఇందుకు సంబందించిన రిపోర్టును ఉన్నతాధికారులతో పాటు కోర్టులో కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో బొమ్మకల్ శ్రీనివాస్ బాధిత సంఘం కూడా ఏర్పడి చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు చేపట్టారు. లోక్ సత్త శ్రీనివాస్ సార్ ఈ వ్యవహారంలో బాధితుల పక్షన నిలిచి వారికి కావల్సిన లీగల్ ఎయిడ్ ఇప్పించడంతో పాటు ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. చాలా రోజులు జైల్లోనే ఉన్న శ్రీనివాస్ ను సర్పంచ్ బాధ్యతల నుండి తప్పించారు. ఆ తరువాత ఆయన కోర్టను ఆశ్రయించడం తిరిగి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం అంతా సద్దుమణిగి పోయిందని, ఇందుకు సంబందించిన కేసులు కోర్టులో విచారణ జరుగుతోంది.

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో ట్రావెల్ చేస్తున్న పురుమళ్ల శ్రీనివాస్

రెండు నెలలుగా…

గత రెండు, మూడు నెలలుగా శ్రీనివాస్ చర్యలపై పోలీసులు కన్నెర్ర జేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అతనిపై కేసుల పరంపరం కొనసాగుతోంది. ఇటీవల శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న వెంటనే పోలీసులు విచారించి వదిలేశారు. అప్పుడే శ్రీనివాస్ పై పీడీ యాక్టు పెడుతున్నారన్న ప్రచారం కూడా జరిగినప్పటికీ అలాంటిదేమీ లేదని పోలీసులు తెలిపారు. ఓ కేసులో అతన్ని విచారించి వదిలేశామని వివరణ కూడా ఇచ్చారు. తాజాగా కరీంనగర్ సీపీగా సుబ్బరాయుడు బాధ్యతలు తీసుకున్న తరువాత బొమ్మకల్ శ్రీనివాస్ వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలు రంగంలోకి దిగితే తప్పించుకుని పారిపోవడంతో అసలేం జరుగుతోందన్న చర్చ మళ్లీ మొదలైంది. పోలీసులు మాత్రం శ్రీనివాస్ పై ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో విచారించేందుకు వెల్లామని అతను తప్పించుకున్నాడని చెప్తున్నారు.

అసలు కారణమేంటీ…?

బొమ్మకల్ శ్రీనివాస్ ను పట్టుకోవాలని అంత సీరియస్ గా పోలీసులు పని చేయడం వెనక వేరే కారణాలు ఉన్నాయన్న ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓ అర్థరాత్రి ప్రైవేటు కారులో వెల్లి మొగిలిపాలెంలో కలవడం, శివాజి విగ్రహ ఆవిష్కరణకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నడుపుతున్న బుల్లెట్ పై వెల్లడం వల్లే శ్రీనివాస్ రాజకీయ సమీకరణాలు నెరుపుతున్నారన్న అనుమానంతో ఆయన నేరాల చిట్టా వెలుగులోకి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అప్పటికే శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుండి బరిలో నిలుస్తారని, రేవంత్ రెడ్డితో పలుమార్లు చర్చలు జరిగాయన్న ప్రచారం కూడా ఉండడం, ఆయన అర్థరాత్రి ప్రత్యేకంగా మొగిలిపాలెం వెల్లి కలవడం వల్లే ఆయన కోసం హంటింగ్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు చాలా మంది. అయితే ఇటీవల కాలంలో బొమ్మకల్ శ్రీనివాస్ బాధిత సంఘం మళ్లీ యాక్టివ్ అయినట్టుగా తెలుస్తోంది. వీరు పోలీసు అధికారులను కలుస్తూ తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడం ప్రధాన కారణంగా విశ్వసనీయంగా సమాచారం. పోలీసు బాసును పలువురు బాధితులు ఫిర్యాదులు చేస్తుండడంతో అసలు బొమ్మకల్ శ్రీనివాస్ కథ ఏంటీ..? ఆయన ఏం చేశారు అన్న వివరాలు తెలుసుకున్న సీపీ సుబ్బరాయుడు సీరియస్ గా దృష్టి సారించినట్టు సమాచారం. ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే కేసులు నమోదు చేసి తన ముందు ప్రవేశపెట్టాలని సీపీ ఆదేశించినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ బాధితుల పక్షాన పోరాటం చేయాలన్న సంకల్పంతోనే సీపీ ఉన్నట్టు సమాచారం.

You cannot copy content of this page