కొంప ముంచిన పౌరసత్వ వివాదం…

చెన్నమనేనికి ఆశాభంగం…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

పదిహేనుళ్లుగా రగిలిపోతున్న వివాదమే ఆయనకు కలిసిరాకుండా పోయింది. నేడో రేపో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేకపోయింది. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు ఆశాభంగం వెనక అసలు కారణం ఆయన పౌరసత్వ వివాదమేనని స్ఫష్టం అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… రమేష్ బాబు బలమైన వ్యక్తే కానీ ఆయన పౌరసత్వ వివాదంపై తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. 2009లో ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చిన చెన్నమనేని రమేష్ బాబు మొదట టీడీపీ తరుపున పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 2010లో టీడీపీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అప్పటి నుండి అప్రతిహతంగా గెల్చుకుంటూ వస్తున్న చెన్నమనేనికి ఈ సారి మాత్రం చుక్కెదురే అయింది. జర్మనీ పౌరసత్వంతో ఉన్న ఆయన ఇండియాలో పోటీ చేసి చట్ట సభకు ఎన్నికయ్యారంటూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది.

కోర్టు తీర్పుకు ముందే…

అయితే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదంపై కోర్టు తీర్పు వెలువరించకముందే బీఆర్ఎస్ పార్టీ ముందస్తు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. పద్నాలుగేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతుండగా నేడో రేపో తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందుగానే గ్రహించి ఆయనను పక్కన పెట్టడం చర్చనీయాంశం అయింది. వేములవాడ నియోజకర్గంలో బలమైన అభ్యర్థిగా ఉన్న చెన్నమనేని రమేష్ బాబుకు టికెట్ వస్తుందని ఆయన అనుచరులు ఆశించినప్పటికీ అధిష్టానం మాత్రం సానుకూలత చూపకపోవడం విశేషం.

గోలీ ‘మార్’…

ఇకపోతే బీసీ కార్డుతో తనకు టికెట్ పక్కా వస్తుందని ఆశించిన మరో నాయకుడు గోలి మోహన్ విషయంలోనూ బీఆర్ఎస్ అధిష్టానం అనుకూలత చూపించలేదు. తన పేరు ముఖ్యమంత్రి టేబుల్ పై ఉన్న ఫైలులో ఉందని నమ్ముకోవడంతో పాటు వేములవాడలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తారన్న ఊహించారు. కానీ గోలి మోహన్ అంచనాలను తలకిందులు చేస్తూ చెన్నమనేని స్థానంలో చల్మెడ లక్ష్మీ నసింహరావును ప్రకటించడం విశేషం. బీఆర్ఎస్ పెద్దలంతా తన వైపు మొగ్గు చూపుతారంటూ అతి నమ్మకంతో ఉన్న మోహన్ కు చుక్కెదురే అయింది.

You cannot copy content of this page