ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందా..?

దిశ దశ, హైదరాబాద్:

శతాధిక వయసున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవస్ధలు పడుతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. అనుభవంతో పాటు స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించామని ఘంటా పథంగా చెప్తున్న కాంగ్రేస్ నేతలు పార్టీని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఏఐసీసీ అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టిన గాంధేతర కుటుంబానికి చెందిన అతి తక్కువ మందిలో ఖర్గే కూడా ఒకరు. అయితే ఏఐసీసీ చీఫ్ గా తొలిసారి తెలంగాణాలోకి అడుగుపెట్టి భారీ బహిరంగ సభకు హాజరయ్యారాయన. ఖర్గే తన ప్రసంగంతో ఇక్కడి ఓటర్ల మనసు దోచుకోలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వైఫల్యమేనా..?

కాంగ్రెస్ పార్టీ చరిత్రను గొప్పగా అభివర్ణించే నాయకులు కొందరు ముఖ్య నేతల హిస్టరీని ఎందుకు విస్మరిస్తున్నారు..? వాస్తవ చరిత్రను పక్కనపెట్టి ఓటర్లను ఆకర్షించే మంత్రం తంత్రం ఉంటుందా, లేదా అన్న విషయాలను కాంగీయులు గమనించాల్సిన అవసరం ఉంది. గత కాలపు వైభవపు ఆనంద డోలికల్లో మునిగితేలియాడుతున్న ఆ పార్టీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోకుండా ముందుకు సాగుతున్న తీరు అందరినీ విస్మయ పరుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మంచిర్యాల పర్యటన సందర్భంగా చేసిన ప్రసంగంలో ఇక్కడి చరిత్రకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు..? అలా ఇవ్వాలన్న సూచనలు స్థానిక నాయకులు ఎందుకు చేయలేదు..? ఆర్భాటపు ప్రచారాల కోసం ఇలాంటి సభలు పెడుతున్నారా లేక అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్నారా అన్నది కాంగ్రెస్ నేతలకే తెలియాలి. కోల్ బెల్ట్ ఏరియాలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే తన నోటి నుండి ఈ ప్రాంత కార్మికుల్లో పేరున్న జి వెంకటస్వామి పేరును ఊటంకిస్తే దళితులే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లోనూ కొంతలో కొంతైనా సానుభూతి వచ్చేది. కార్మికుల కోసం సంస్కరణలు తీసుకరావడంలో ఆయనది కీలక పాత్ర. కార్మిక సంఘాల నేతగా కూడా మంచి గుర్తింపు ఉన్న జి వెంకటస్వామిని ఎందుకు విస్మరించినట్టో అర్థం కావడం లేదు. సీడబ్లుసి మెంబర్ గా కూడా పనిచేసిన ఆయన గాంధీ కుటుంబ విధేయుల్లో ఒకరు. అటువంటి వ్యక్తి పేరెత్తకపోవడం కాంగ్రెస్ పార్టీకి నష్టమో లాభమో ఆలోచించుకోవాల్సిన అవసరం ఆ పార్టీ నాయకులకే ఉంది. ఆయన తనయుడు వివేక్ బీజేపీలో ఉన్నాడన్న వాదనలు కూడా తీసుకొచ్చే కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకోవల్సిన అవసరమే లేదన్నట్టేనా అన్న విషయం తేల్చాలి. ఎందుకంటే వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరీ ఏపీలో అధికారంలోకి వచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ ముఖ్య నాయకుల నుండి ప్రతి ఒక్కరిని వైఎస్ కుటుంబం విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.

పివి ఠీవి మరిచి…

భారత ఆర్థిక పితామహుడు పివి నరసింహరావును విస్మరించడం కూడా సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పివి పేరును స్మరిస్తే కూడా పార్టీకి వచ్చే నష్టం ఏంటో అర్థం కావడం లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన వల్ల మైనార్టీల్లో పీవీపై వ్యతిరేకత ఉందన్న వాదనలు తెరపైకి తీసుకొచ్చే కాంగ్రెస్ నాయకులు చింతన్ శిబిరంలో పార్టీ సీనియర్ల ఫోల సరసన పివికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినట్టో ఆలోచించాలి. ఆ శిబిరంతో అయినా పార్టీలో మార్పు వచ్చి ముఖ్య నాయకులకు ప్రయారిటీ ఇస్తే స్థానికంగా కొంతలో కొంత అయినా పార్టీకి సానుకూలత ఉండేది కాదా అన్నది పార్టీ నేతలకే తెలియాలి. బాబ్రీ ఘటనకు పివినే కారకుడన్న భావనలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అంతకుముందు రామజన్మభూమిలో పూజలు చేసేందుకు అనుమతించింది ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడో తెలుసుకునేందుకు గతాన్ని నెమరువేసుకోవల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉప ప్రధాని అయిన వల్లభాయ్ పటేల్ ను బీజేపీ ఓన్ చేసుకున్న విషయాన్ని గమనించకుండా కాంగ్రెస్ నాయకులు మూస పద్దతిలో వెల్తుండడం మాత్రం విడ్డూరమనే చెప్పాలి. బాబ్రీ ఘటన విషయం పక్కన పెడితే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న భారత్ ను గాడీలో పెట్టిన చరిత్ర పివిది కాదా..? అలాగే ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను గుర్తించి క్యాబినెట్ లో అవకాశం ఇచ్చి భావి ప్రధానిని దేశానికి అందించిన చరిత్ర ఆయనకు చెందినది కాదా అన్న విషయం కాంగ్రెస్ నేతలు గమనించాల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page