ఆ గుట్టు రట్టు కావద్దనుకున్నారా… హార్డు డిస్కులను అందుకే ముక్కలు చేశారా..?

దిశ దశ, హైదరాబాద్:

ముచ్చటగా మూడో రోజు సస్పెండెడ్ డీఎస్పీ ప్రణిత్ రావు కస్టడీ విచారణ సాగుతోంది. దర్యాప్తు బృందం ప్రణిత్ రావ్ నుండి నిజాలను రాబ్టేందుకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసు అధికారుల ముందు ప్రణిత్ రావు ఒక్కో విషయాన్ని వెల్లడిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ కేసులో అత్యంత కీలకమైన హార్డ్ డిస్కులను వికారాబాద్ ఫారెస్ట్ లో పడేసే ముందు కట్టర్లతో కట్ చేసినట్టుగా పోలీసు అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అసలు హార్డ్ డిస్కులను ఎందుకు తొలగించాలనుకున్నాడు..? వాటిని తునా తునకలు చేసి మరీ అడవుల్లో పడేయడానికి కారణం ఏంటీ అన్న అంశపై ప్రధానంగా మారింది. అయితే ఇప్పటి వరకు పోలీసు అధికారులు సేకరించిన సమాచారాన్ని బట్టి గమనిస్తే ఆయన ఆలోచన వేరే విధంగా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ ఆలోచన ప్రణిత్ రావు ఒక్కడిదే కాదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతర అధికార, అనథికారులు కూడా సలహా ఇవ్వడంతోనే హుటాహుటిన రికార్డులు ధ్వంసం చేసి ఉంటాడని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే సర్వీస్ ప్రొవైడర్లు అందించే లింకే దర్యాప్తు అధికారులకు పెద్ద దిక్కు అవుతోంది. ఈ లింకు ద్వారా 15 నెంబర్లను మాత్రమే ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి సారి కూడా టెలికాం సంస్థల ప్రతినిధులను ట్యాపింగ్ కోసం లింక్ ఇవ్వాలని కోరడం, సీఎస్ తో లేఖలు రాయించడం ఇదంతా రిస్క్ అనిపించడంతో ప్రత్యేకగా మాల్వేర్ సాఫ్ట్ వేర్ ను విదేశాల నుండి కొనుగోలు చేసి ఇన్ స్టాల్ చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి మాల్వేర్ సాఫ్ట్ వేర్ లను కొన్ని సిస్టమ్స్ లో ఇన్ స్టాల్ కూడా చేసినట్టుగా తెలిసింది. దీంతో సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండానే ఎవ్వరి ఫోన్ అయినా కూడా ట్యాపింగ్ చేసే అవకాశం చిక్కినట్టయింది స్పెషల్ టీమ్స్ కు. అయితే ఇందులో ఫోన్ ట్యాపింగ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం లేదా ట్రాయ్ అనుమతి లేకుండా సాఫ్ట్ వేర్ లను కొనుగోలు చేయడం కూడా మరో నేరం అవుతుందని గుర్తించి ఉంటారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అందునా ప్రభుత్వమే ఈ నిభందనలు ఉల్లంఘించి హాక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందన్న విషయం బయటకు పొక్కితే లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోవలసి వస్తుందని గమనించి ఉంటారని… ఈ కారణంగానే హుటాహుటిన ఎస్ఐబీ కార్యాలయం లాగర్ రూమ్ లో ఏర్పాటు చేసిన సిస్టమ్స్ కు సంబంధించిన హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి వికారాబాద్ ఫారెస్ట్ లో పడేసి ఉంటారని భావిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదని అనుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న రీతిలో హార్డ్ డిస్కుల్లో ఎలాంటి డాటా లేకపోవడాన్ని గుర్తించడంతో ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది.

అడవుల్లో అన్వేషణ…

ప్రణిత్ రావు అరెస్ట్ చెప్పిన కన్ఫెషన్ ఆధారంగా మంగళవారం దర్యాప్తు బృందం ఒకటి కార్య రంగంలోకి దూకింది. వికారాబాద్ అటవీ ప్రాంతంలో ప్రణిత్ రావును తీసుకెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ధ్వంసం అయిన హార్డ్ డిస్కులను సేకరించి రికవరీ విధానంతో కాని అప్ డేటెడ్ టెక్నాలజీతో కానీ అందులో ఉన్న డాటాను రికవరీ చేయాలన్న యోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాతే ఫారెస్ట్ ఏరియాలో రికవరీ చేసిన మెటిరియల్ ను కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల కూడా కేసులో బలమైన సాక్ష్యాదారం అవుతుందని గుర్తించి అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆఫరేషన్ కొనసాగిస్తున్నారు.

వీడియో రికార్డ్…

మరో వైపున ఈ కేసు దర్యాప్తులో పోలీసు అధికారులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. కస్టడీలో ఉన్న ప్రణిత్ రావుతో పాటు ఆయన చెప్పిన పోలీసు అధికారులు ఇచ్చే వాంగ్మూలాలను వీడియో రికార్డు కూడా చేస్తున్నట్టుగా సమాచారం. ఈ వీడియో ఫుటేజీలను కోర్టుకు సమర్పించినట్టయితే కేసులో సాక్ష్యాలు మరింత బలంగా ఉంటాయని దీంతో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న కారణంగానే రికార్డింగ్ చేస్తున్నట్టు సమాచారం.

బయట పడుతున్న జాబితా…

అయితే ఈ వ్యవహారంతో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పోలీసు అధికారులతో పాటు అధికారంలో ఉన్న వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. కొంతమంది సెంట్రలైజ్ ఆఫీసుగా ఉన్న ఎస్ఐబీ లాగర్ రూమ్ నుండి మరి కొంత మంది వార్ రూమ్స్ నుండి తమ విశేషమైన సేవలు అందిచినట్టుగా విచారణలో తేలినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టుగా అనుమానించిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీఐని ఇప్పటికే విచారిస్తున్న దర్యాప్తు అధికారుల బృందం, వరంగల్ కమిషనరేట్ లోని వార్ రూమ్ ఎగ్జిక్యుషన్ చేసిన వ్యవహారంలో భాగస్వాములు అయిన పోలీసుల అధికారులకు కూడా ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు అధికారుల నుండి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే లాగర్ రూమ ద్వారా వినియోగించిన రెండు సర్వర్లు కూడా ఓ మీడియా సంస్థలో ఒకటి, మరోకటి సిరిసిల్లలో ఉంచినట్టుగా ప్రచారం జరుగుతోంది.

వసూల్ రాజాలెంతమందో..?

తప్పుడు పనికి అలవాటు పడినవారు సాధారణ జీవనం సాగించేందుకు చాలమందికి మనస్కరించదు అన్నట్టుగానే తయారైంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. సర్కారు పెద్దలు, ఉన్నతాధకారుల ఆశీస్సులతోనే ట్యాపింగ్ చేస్తున్నందున తామేం చేసినా చెల్లుతుందని భావించిన కొంతమంది ఎస్ఐబీ టీమ్ ఆఫీసర్స్ సంబంధం లేని వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ట్యాపింగ్ రికార్డులను విని ఇష్టారీతిన వ్యవహిరించిన ప్రబుద్దులు కూడా ఉన్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది.

You cannot copy content of this page