కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ ఖాయమైనట్టేనా..?

ఊతమిస్తున్న అధినేత సంకేతాలు

ఇక కలిసి పని చేయడమే తరువాయి…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇంతకాలం గులాభి జెండాతో కలిసి పనిచేసిన పతంగి హస్తానికి చిక్కిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే అధికారికంగా స్నేహం గురించి ప్రకటించకున్నప్పటికీ ఈ రెండు పార్టీలు మాత్రం కలిసి పనిచేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయాలన్న నిర్ణయానికి అధినేత అసుదుద్దీన్ ఓవైసీ వచ్చినట్టుగా ఎంఐఎం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అంటీముట్టనట్టుగానే ఉన్న ఎంఐఎంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని, హైదరాబాద్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టదంటూ మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ ప్రకటించారు. అయితే ఈ విషయంపై అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు ఎంఐఎం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఎంఐఎం నాయకుల్లో గందరగోళం నెలకొనడంతో ఆయా జిల్లాలకు చెందిన నాయకత్వం హైదరాబాద్ కు వెల్లి ప్రచారం చేయడం మొదలు పెట్టింది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలా లేక కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాలా అన్న విషయంపై క్లారిటీ లేకపోవడంతో పార్టీ చీఫ్ అసదుద్దీన్ గెలుపు కోసం పాతబస్తీకి చేరుకుని ప్రచారం చేశారు. పొత్తా లేక మద్దతా అన్న విషయంపై స్పష్టత ఇస్తే బావుంటుందన్న ప్రతిపాదనలు కూడా అధినేత అసద్ వద్దకు చేరడంతో ఆయన ఈ విషయం సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్ లో బలమైన అభ్యర్థిని బరిలో నిలపకుండా నామ మాత్రపు పోటీ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన చేసే అవకాశం లేనందున అనధికారికంగానే కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాలన్న సంకేతాలను పార్టీ చీఫ్ ఇచ్చినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎంఐఎం ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనార్టీల సంఖ్య మెజార్టీగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించే పనిలో నిమగ్నం కావాలని సూత్రప్రాయంగా అధిష్టానం చెప్పడంతో ఆయా జిల్లాల్లోని ఎంఐంఎం క్యాడర్ కూడా కార్యరంగంలోకి దూకనున్నట్టుగా సమాచారం.

ప్రతికారమా..?

ఎంఐఎం అధినేత మౌఖిక ఆదేశాలతో ఆ పార్టీ జిల్లా క్యాడర్ లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. చాలా చోట్ల కూడా పొత్తు ధర్మం కారణంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన నేపథ్యంలో ఇక ఆ పరిస్థితి నుండి బయటపడేందుకు సమాయత్తం కావల్సి ఉంది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ఎంఐఎం శ్రేణులకు మధ్య కోల్డ్ వార్ జరిగిందనే చెప్పాలి. అప్పుడు కరీంనగర్ ఎంఐఎం నేతలకు, బీఆర్ఎస్ ముఖ్యనేతకు మధ్య ఓపెన్ వార్ అన్నట్టుగానే సాగింది. గంగుల కమలాకర్, గులాం అహ్మద్ ల ఏర్పడిన అంతరం మైనార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ క్రమంలో గులాం అహ్మద్ కరీంనగర్ టికెట్ ఎంఐఎంకు కెటాయించాలన్న ప్రతిపాదన చేయడంతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రచారం చేశారు. మైనార్టీలు నివసించే ఏరియాల్లో ప్రచారం చేయడంతో రాష్ట్రం అంతటా పొత్తు సాగిన కరీంనగర్ లో మాత్రం బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య పొసగని పరిస్థితులు కనిపించాయి. ఎన్నికలు సమీపించిన తరువాత గంగుల కమలాకర్, గులాం అహ్మద్ మధ్య సయోధ్య చేయాల్సి వచ్చింది ఇరు పార్టీల ముఖ్య నాయకత్వానికి. హైదరాబాద్ లో మంతనాలు జరిపి మరీ కలిసి పనిచేసే విధంగా ఇరువురిని ఒప్పించారు. ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న జిల్లాల్లో మాత్రం బీఆర్ఎస్ నాయకత్వంపై ప్రతికారం తీసుకునే అవకాశం దొరికిందని అనుకుంటున్నారు ఎంఐఎం నాయకులు. తమను ఏ మాత్రం గుర్తించకుండా ఇష్టరీతిన వ్యవహరించాన్న అక్కసుతో ఉన్న కొన్ని జిల్లాలకు చెందిన ఎంఐంఎం లీడర్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి తమపై చూపిన వివక్ష ఫలితాన్ని రుచి చూపించాలని భావిస్తున్నారు.

You cannot copy content of this page