దిశ దశ, హైదరాబాద్:
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై విజిలెన్స్ అధికారుల విచారణ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు తొలి నివేదిక సిద్దం అయినట్టుగా తెలుస్తోంది. తొలి నివేదికలో ఉన్న అంశాలన్ని కూడా నిర్మాణ కంపెనీ వైఫ్యల్యాలే వెలుగులోకి వస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించికుని అంచనాలు సిద్దం చేసిన ఈ ప్రాజెక్టు విషయంలో మానవ తప్పిదాలే ఉన్నాయన్న విషయాన్ని తేల్చినట్టుగా తెలుస్తోంది. నిర్మాణ సమయంలో చూపిన నిర్లక్ష్యం ఫలితమే ఇంత దూరం వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి విజిలెన్స్ వర్గాలు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్ప బలానికి తగ్గట్టుగా నిర్మాణ సమయంలో పకడ్భందీగా పర్యవేక్షణ చేస్తే కుంగుబాటు అన్న సమస్య ఎదురు కాకపోయేదని నిర్దారించినట్టుగా సమాచారం.
లోపాలు ఇవేనా..?
2019లోనే మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ ప్రారంభం అయిందని, ప్రారంభించే నాటికి పగుళ్లు ఏర్పడ్డాయని విజిలెన్స్ వర్గాలు గుర్తించాయి. అయితే కాగ్ కూడా 2019లోనే మేడిగడ్డ డ్యామేజ్ అయిందని తేల్చి చెప్పినట్టుగానే విలిజెన్స్ కూడా ఇదే అంశాన్ని గుర్తించడం గమనార్హం. పగుళ్లు బారిన తరువాత దిద్దబాటు చర్యలు తీసుకోవడానికి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు నీటి నిలువలను యథావిధిగా కంటిన్యూ చేయడంతో పగుళ్లు మరింత విస్తరించినట్టుగా భావిస్తున్నాయి. పగుళ్లను గుర్తించి వర్షాకాలానికి ముందే హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. నిర్మాణ సంస్థ మాత్రం వానాకాలం బ్యారేజ్ మెయింటనెన్స్ సాధ్యం కాదంటూ కాలయాపన చేయడంతో ఆ తరువాత వచ్చిన వరదలతో 11 నుండి 20 పిల్లర్ల వరకు పగుళ్లు విస్తరించాయని అంచనా వేస్తున్నారు. డిజైన్ చేసిన విధానానికి నిర్మాణానికి కూడా అసలు పొంతనే లేకుండా పోయిందని, ఇష్టారీతిన కన్సట్రక్షన్ చేశారన్న అభిప్రాయంతో విజిలెన్స్ ఉంది. పిల్లర్లు, బ్లాకుల నాణ్యతపై దృష్టి సారించిన విజిలెన్స్ అధికారులు సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఆ రిపోర్టులు వచ్చిన తరువాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయని సమాచారం.
రికార్డుల గల్లంతు…
మరో వైపున మేడిగడ్డకు సంబంధించిన పలు రికార్డులు గల్లంతయ్యాయని కూడా తెలుస్తోంది. బ్యారేజీ డిజైన్లు, నిర్మాణంలో చేపట్టిన చర్యలతో పాటు ఇతరాత్ర రికార్డులు కూడా గల్లంతయ్యాయని గుర్తించినట్టు సమాచారం. పెద్ద సంఖ్యలో బ్యారేజీకి సంబంధించిన రికార్డులు కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. చివరకు విజిలెన్స్ విచారణలకు సంబంధించిన రికార్డులు కూడా అదృశ్యం కావడం సంచలనంగా మారింది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అప్రమత్తత చేసే విజిలెన్స నివేదికలు కూడా మాయం అయ్యాయంటే ఈ బ్యారేజీ విషయంలో అధికార యంత్రాంగం ఎలాంటి శ్రద్ద వహించిందో అర్థం చేసుకోవచ్చు. 2018 నుండి మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన శాటిలైట్ డాటాను కూడా విజిలెన్స అధికారులు ఇరిగేషన్ అధికారులను కోరినట్టుగా తెలుస్తోంది. ఈ డాటాను కూడా పరిశీలించిన తరువాత మరిన్ని కోణాల్లో ఎనాలిసిస్ చేసే అవకాశాలు ఉన్నాయి.