సరిహద్దుల్లో బియ్యం దందాపై దర్యాప్తు చేస్తున్నారా..? మూలాలపై ఆరా తీస్తున్నారా..?

దిశ దశ, దండకారణ్యం:

తెలంగాణ సరిహద్దుల్లో సాగుతున్న రేషన్ బియ్యం దందాపై సివిల్ సప్లై విభాగం లోతుగా దర్యాప్తు చేస్తోందా..? కేవలం బియ్యం పట్టుకుని కేసును పోలీసులకు బదిలీ చేసి చేతులు దులుపుకుందా..? హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా సరిహద్దు ప్రాంతానికి వచ్చిన సివిల్ సప్లై విజిలెన్స్ వింగ్ అధికారులు పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెడతారా అన్న విషయంపై స్పష్టత రావడం లేదు.

నిర్భయంగా దందా…

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రేషన్ బియ్యం గోదావరి దాటి మహారాష్ట్ర చేరుకుంటున్నాయన్న సంగతి బహిరంగ రహస్యమే. అయితే ఈ బియ్యం దందాను ఎంచుకున్న మార్గాలు కూడా విచిత్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో బియ్యం వ్యాపారంపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడాన్ని అనుకూలంగా మల్చుకున్న స్మగ్లర్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సరిహధ్దు దాటితే చాలు తమను ఎవరూ పట్టుకునే వారుండరని భావించి అక్కడ సపరేట్ డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ డెన్ కు చేరుకున్న బియ్యం మహారాష్ట్రంలోని గోందియా, నాగపూర్ తో పాటు ఇతర ప్రాంతాలకు దర్జాగా తరలివెల్తున్నాయి. కొన్ని సార్లు మాత్రం తెలంగాణ సివిల్ సప్లై అధికారులు దాడుల్లో పట్టుకున్న బియ్యాన్ని వేలం వేసినప్పుడు వాటిని టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తూ ఆ పర్మిట్లను చూపిస్తూ కూడా బియ్యాన్ని పొరుగు రాష్ట్రానికి చేరవేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే సివిల్ సప్లై అధికారులు టెండర్ ద్వారా విక్రయించే బియ్యం చాలా సందర్భాల్లో మనుషులు ఆహారంగా తీసుకునే అవకాశం ఉండదని తెలుస్తోంది. భారీ ఎత్తున బియ్యం నిల్వలు దొరికినప్పుడు సీజ్ చేసిన కొద్ది రోజుల్లో టెండర్ల ద్వారా బియ్యాన్ని విక్రయిస్తే మాత్రం వాటిని ఆహారంగా ఉపయోగించుకోవచ్చు. అయితే టెండర్ ద్వారా విక్రయించే బియ్యాన్ని మనుషుల ఆహారానికి ఉపయోగపడుతాయా పశువుల దాణాకో లేక ఇతరాత్ర అవసరాలకు ఉపయోగపడతాయా అన్న విషయాన్ని గుర్తించిన తరువాత వేలం వేస్తారు. అంతేకాకుండా ఈ బియ్యాన్ని కొనుగోలు చేసిన వారికి ఇచ్చే పర్మిట్ లో స్పష్టంగా కూడా వివరాలను పొందుపరుస్తారని, ఆ బియ్యాన్ని ఎక్కడికి తీసుకెల్తారు..? ఎన్ని గంటల్లో చేరాల్సి ఉంటుంది అన్న వివరాలతో కూడిన వేబిల్లు కూడా ఇస్తారు. చాలా సందర్భాల్లో కూడా సివిల్ సప్లై ద్వారా విక్రయించే బియ్యం మాత్రం మనుషుల ఆహారంగా వినియోగించే విధంగా లేనివే వేలం ద్వారా విక్రయిస్తారని తెలుస్తోంది. అయితే ఇలా టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్న బియ్యమంటూ సరిహద్దులు దాటించిన సందర్భాలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన పర్మిట్ మాటున కూడా రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున తరలించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు కూడా లేకపోవడంతో ఇలాంటి వేబిల్లులను రీ సైక్లింగ్ చేస్తూ కూడా దందా కొనసాగించినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

పర్మిట్ల ఆదారంగా…

సివిల్ సప్లై ద్వారా జరిగిన టెండర్లకు సంబంధించిన బియ్యాన్ని కొనుగోలు చేసిన ట్రేడర్లు ఏఏ అవసరాల కోసం తీసుకున్నరో కూడా సంబంధిత అధికారుల వద్ద రికార్డుల్లో నమోదు చేసుకుంటుంటారు. వీటిని ఎక్కడికి తరలిస్తారోనన్న విషయాన్ని కూడా అందులో పేర్కొన అవకాశాలు ఉండడంతో పాటు డూప్లికేట్ పర్మిట్లు కూడా సివిల్ సప్లై విభాగంలో ఖచ్చితంగా ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేసినా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సివిల్ సప్లై అధికారులు టెండర్ల ద్వారా విక్రయించిన బియ్యం తరలించేందుకు ఎక్కడి వరకు పర్మిట్ తీసుకున్నారు..? ఆ బియ్యం ఎందుకు ఉపయోగించవచ్చు అనే వివరాలను ఆధారం చేసుకుని టెండర్ ద్వారా సరఫరా అయిన బియ్యం తరలివెల్లిన ప్రాంతాల్లో ఆరా తీస్తే కూడా వెల్లడవుతుంది. టెండర్ కు ముందే సివిల్ సప్లై టెక్నికల్ వింగ్ అధికారులు సర్టిఫై చేసిన వివరాలను, పర్మిట్లను ఆధారం చేసుకుని క్షేత్ర స్థాయిలో విజిట్ చేసినట్టయితే సమగ్ర వివరాలు బట్టబయలు కావడం ఖాయం. ట్రేడర్లు కొనుగోలు చేసిన బియ్యం కోళ్ల దాణాగానో లేక ఆల్కహాల్ తయారీ ఫ్యాక్టరీలకో తరలిస్తున్నామని వివరించిన తరవుతా అధికారులు రికార్డుల్లో పేర్కొంటారు. అయితే టెండర్ ద్వారా విక్రయించిన బియ్యం ఎక్కడికి అయితే రవాణా చేశారో అసలు ఆ ప్రాంతంలో కోళ్ల ఫారాలు ఎన్ని ఉన్నాయి వాటిలో ఎన్ని కోళ్లు తయారవుతున్నాయి..? అల్కాహాల్ ఫ్యాక్టరీ కోసం అయితే ఆ ఫ్యాక్టరీ పేరిట కొనుగోలు చేసిన బియ్యం క్వాంటిటీ ఎంత..? అందులో ఎంత మేర అల్కహాల్ తయారైంది..? కొనుగోలు చేసిన బియ్యానికి తగ్గట్టుగా ఉత్పత్తి జరిగిందా లేదా అన్న వివరాలను కూడా అధికారికంగా సేకరిస్తే టెండర్ల ద్వారా విక్రయించే బియ్యం దందా గుట్టు ఇట్టే తెలిసిపోనుంది.

మూలాలపై ఆరా తీస్తారా..?

ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో బియ్యం పట్టుకున్న సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో స్థానికులు బియ్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని ఇటీవల పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందులో బియ్యం తరలిస్తున్న గన్నీ సంచులకు బాజాప్తాగా తెలంగాణ సివిల్ సప్లై కోసం సరఫరా చేసినట్టుగా ముద్రించి ఉంది. సుమారు 200 క్వింటళ్ల బియ్యం తరలిస్తున్న క్రమంలో పట్టుబడిన ఈ విషయంపై స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు కూడా చేశారు. అయితే సివిల్ సప్లై నుండి సరఫరా అవుతున్న బియ్యం సంచులని స్ఫస్టంగా తేలినప్పటికీ అవి ఎక్కడి నుండి వచ్చాయి..? ఆ బియ్యం వెనక ఉన్న మతలబు ఏంటీ..? ప్రభుత్వ శాఖకు సంబంధించిన పేర్లు ముద్రించి ఉన్నందున అవి శాఖాపరంగా సరఫరా అయిన సంచులా లేక బయటి వ్యక్తులు కొనుగోలు చేసినవా అన్న కోణంలో కూడా ఆరా తీయనట్టుగా తెలుస్తోంది. శాఖాపరంగా సరఫరా అయినవేనని తేలితే బియ్యం కూడా రేషన్ షాపులకు తరలి వెళ్లాల్సినవేనని స్పష్టం కానుంది. ఒకవేళ గన్నీ బ్యాగులను కొనుగోలు చేసినట్టయితే బయటకు విక్రయించకుండా తిరిగి సివిల్ సప్లై అధికారులకే అప్పగించాలన్న ఆదేశాలు ఉన్నప్పుడు వాటిని బయటి వ్యక్తులకు ఎలా విక్రయిస్తారన్న విషయంపై విచారణ జరపాల్సి ఉంది. మరోవైపున అవి పీడీఎస్ రైసా కాదా అన్న కోణంలో కూడా విచారించి అవి ఎక్కడి నుండి సేకరించారు..? ఎక్కడికి తరలిస్తున్నారు అన్న వివరాలు తెలుసుకోవల్సి ఉంది. ల్యాబ్ టెస్ట్ కు పంపడంతో పాటు గన్నీ బ్యాగులపై కోడ్ ఉన్నట్టయితే ఈ కోడ్ కు సంబంధించిన సంచులు ఎక్కడికి రవాణా అయ్యాయి తదితర వివరాలు సేకరిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు కూడా 700 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై కూడా అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తే అసలు నిజం బయటపడనుంది.

You cannot copy content of this page