పారదర్శకత పాటించకుండా… ప్రక్షాళన చేయకుండా…

జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో జరుగుతున్నదేంటీ..?

దిశ దశ, కరీంనగర్:

జర్నలిస్టుల నివేశనా స్థలాల కెటాయింపు విషయంలో అసలేం జరిగింది..? జర్నలిస్టులకు బాసటగా నిలవాల్సిన కొంత మంది పెద్దలు పారదర్శకంగా వ్యవహరించినట్టయితే ఇంత దూరం వచ్చేదా..? అసైన్ మెంట్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ పై భారం వేసి తప్పించుకున్న వారు ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రీకృతంగా చేస్తున్న వ్యాఖ్యలకు కారణమేంటీ..? జాబితా ప్రక్షాళన చేయడం మరిచి కాలయాపన చేస్తున్న తీరు దేనికి సంకేతం..? ఇప్పుడిదే చర్చ కరీంనగర్ జర్నలిస్టు వర్గాల్లో సాగుతోంది.

ప్రక్షాళన అసాధ్యమా..?

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరీంనగర్ జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్ల జాబితాలో అనర్హుల పేర్లు ఎలా చేర్చారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా సాక్షి దినపత్రికలో పని చేయని వారి పేర్లను చేర్చిన తీరే అందరినీ విస్మయపరుస్తోంది. ఎండనకా… వాననకా ఫీల్డ్ లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న క్షేత్ర స్థాయి జర్నలిస్టులకు అన్యాయం చేసే విధంగా జాబితా తయారు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. జర్నలిస్టు పెద్దల ప్రాపకం పొందితేనే ప్లాట్లు వస్తాయని వారి చుట్టూ ప్రదక్షిణలు చేసినా జాబితాలో అవకాశం కల్పించలేదన్న ఆవేదన నష్టపోయిన వారిలో వ్యక్తం అవుతోంది. తమ ప్రొఫెషన్ తో ఏ మాత్రం సంబంధం లేని వారికి లబ్ది చేకూర్చడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తోంది కరీంనగర్ జర్నలిస్ట్ సమాజం. మొదట 118 మందితో తయారైన జర్నలిస్టు నివేశన స్థలాల జాబితా కాకుండా 119 నుండి 149 వరకు అదనంగా పేర్లు చేర్చారు. ప్రొసిడింగ్స్ తో సంబంధం లేకుండా 30 మందికి పట్టాలు ఇవ్వడం వల్లే రాద్దాంతం చోటు చేసుకుంది. 118లోపు ఉన్న పేర్లలో కూడా అనర్హులు ఉన్నారన్న ఆరోపణలు చేస్తున్నారు బాధిత జర్నలిస్టులు. వీరందరి పేర్లను తొలగించి అసలైన జర్నలిస్టులకు మాత్రమే పట్టాలు ఇచ్చినట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అప్పుడు జారీ చేసిన ప్రొసిడింగ్స్, పట్టాలు రద్దు చేస్తున్నట్టుగా కరీంనగర్ జిల్లా అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ అదే జాబితాను ఆమోదించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తొలిసారి జాబితా విడుదల చేసినప్పుడు అప్పటి మంత్రి గంగుల కమలాకర్ తుది నిర్ణయం తీసుకున్నారని, అసైన్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఆయనే అయినందున ఈ జాబితాతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని పెద్ద సార్లు చెప్పారు. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ కారణంగా పట్టాలు రావడం లేదన్న ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. కానీ జాబితాలో తప్పులను సవరించి అర్హులైన వారికి మాత్రమే పట్టాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఎందుకు చేయడం లేదన్నదే కరీంనగర్ జర్నలిస్టుల మదిని వెంటాడుతోంది.

స్వతంత్ర్ర… స్వాతంత్ర్యం…

ఇకపోతే స్వతంత్ర జర్నలిస్టులంటూ కూడా కొంతమందికి పట్టాలు ఇచ్చినట్టుగా జాబితాలో స్పష్టం అవుతోంది. 119 నుండి 149 వరకు కొత్తగా చేర్చిన పేర్లలో స్వతంత్ర జర్నలిస్టుల పేరిట సరికొత్త స్వాతంత్ర్యానికి తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వతంత్ర జర్నలిస్టులు ఎవరూ..? వారు జర్నలిస్టులుగా పని చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు బాధిత జర్నలిస్టులు. ప్రముఖ దినపత్రిక సాక్షిలో పనిచేస్తున్నట్టుగా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు లబ్దిదారులుగా మారితే… ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా మరికొందరి పేర్లను చేర్చడం వెన్న దాగి ఉన్న అంశం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

బొనాంజా…

2006లో కరీంనగర్ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ద్వారా భూములు కెటాయించిన వారిలొ కొంతమందితో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు దక్కించుకున్న వారిని కూడా 2023 జాబితాలో ఎలా చేర్చారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఒకసారి లాభోక్తుడిగా ఎంపికయిన వ్యక్తిని తిరిగి అదే సంక్షేమ పథకంలో లబ్దిదారునిగా చేర్చడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్దమేనని తెలిసీ తమ వారి కోసం దుస్సాహాసం చేయడం సరైందేనా అన్న చర్చ సాగుతోంది.

You cannot copy content of this page