అధినేత పర్యటనలోనూ దక్కని ప్రాధాన్యం…
సర్దార్జీ అనుచరుల ఆందోళన
దిశ దశ, కరీంనగర్:
ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో ఇంకా వర్గపోరు మాత్రం తగ్గనట్టుగానే కనిపిస్తోంది. నాయకుల మధ్య సయోధ్య లేదన్న విషయం మరోసారి స్ఫస్టం అయింది. కదనభేరి మోగించేందుకు అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటిస్తున్న సందర్భంగా కూడా గులాభి పార్టీ నాయకుల్లో విబేధాలు సమసిపోలేదని తేలిపోయింది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో సెంటిమెంట్ గా కలిసొచ్చే కరీంనగర్ జిల్లా నుండే ప్రజల్లోకి వెళ్లాలని గులాభి నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో గద్దె దిగిన తరువాత నల్గొండ సభ తరువాత రెండో బహిరంగ సభను కరీంనగర్ లో ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు. ఇక్కడి నుండి ఎంపీగా పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపును అధినేత కేసీఆర్ సహా ముఖ్య నాయకులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వినోద్ కుమార్ కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ తన బలాన్ని మరింత పెంచుకోవాలని పావులు కదిపారు. ఈ క్రమంలోనే కరీంనగర్ కదనభేరి సభను ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రసంగంతో కరీంనగర్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు ప్రజల్లో కూడా సానుకూల వాతావరణం పెంచుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఈ సమయంలో ప్రతి నాయకుడు కలిసిమెలిసిగా పనిచేయాల్సి ఉన్నప్పటికీ స్థానిక నాయకులు మాత్రం వర్గ పోరును వీడినట్టుగా కనిపించడం లేదు. దీంతో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీలో మరోసారి విబేధాలు రచ్చకెక్కినట్టయింది.
సర్దార్జీకి నో…
కరీంనగర్ మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సర్దార్ రవిందర్ సింగ్ కు ఇటీవల వరకు సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబెల్ గా పోటీ చేసినా అధినేత కేసీఆర్ ఆయన్ని అక్కున చేర్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రవిందర్ సింగ్ కు వచ్చిన ఓట్లతో పాటు ఇతరాత్ర కారణాల వల్లే అధినేత కేసీఆర్ రవిందర్ సింగ్ ను ఆదరించారని ప్రచారంలో ఉంది. జాతీయ పార్టీగా ప్రకటించిన తరువాత కూడా రవిందర్ సింగ్ కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. నాందేడ్ సభతో పాటు పంజాబ్, హర్యాణాలకు చెందిన ముఖ్య నాయకులతో సమాలోచనలు జరిపినప్పుడు కూడా రవిందర్ సింగ్ ప్రమేయం ఉండేలా వ్యవహరించింది పార్టీ అధిష్టానం. ఎన్నికలప్పుడు పెద్దపల్లి ఇంఛార్జిగా బాధ్యతలు ఇవ్వడం… తాజాగా వేములవాడ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం… నల్గొండ సభ ఏర్పాట్ల బాధ్యతలను కూడా అప్పగించే విషయంలో సర్దార్జీకి ప్రాధాన్యత ఇచ్చారు అధినే కేసీఆర్. అయితే ఆయన సొంత గడ్డపై జరుగుతున్న కదనభేరి సభలో మాత్రం రవిందర్ సింగ్ కు ప్రాధాన్యత లేకుండా పోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్య నాయకులందరి ఫోటోలు అచ్చు వేయించినప్పటికీ రవిందర్ సింగ్ ఫోటోకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయనను కావాలనే దూరం పెడుతున్నారని రవిందర్ సింగ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఉద్యమ సమయం నుండి పార్టీలో కీలక భూమిక పోషించిన రవిందర్ సింగ్ కు ప్రయారిటీ ఇవ్వకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
సెంటిమెంట్ జిల్లాలోనే…
ఉద్యమ నేత కేసీఆర్ కరీంనగర్ ను కలిసొచ్చే జిల్లాగా చెప్తుంటారు. ఉద్యమ ప్రస్థానం నుండి చేపట్టే ప్రతి పనిని కూడా ఇక్కడి నుండే ప్రారంభించేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తారు. కరీంనగర్ నుండి చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అవుతుందని అధినేత కేసీఆర్ బలంగా విశ్వసిస్తారు. ఈ కారణంగానే లోకసభ ఎన్నికల శంఖారావం కూడా ఇక్కడి నుండే ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే సెంటిమెంట్ గా పీలయ్యే కరీంనగర్ జిల్లాలోనే వర్గ విబేధాలు రచ్చకెక్కడం మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ నుండి పిలుపునిస్తే రాష్ట్రం అంతా జాగృతం అవుతుందని భావిస్తున్న క్రమంలో తొలి ప్రచార సభలోనే గ్రూపు రాజకీయాలు వెలుగులోకి రావడం సెంటిమెంట్ గా మంచిది కాదని అంటున్న వారూ లేకపోలేదు. వర్గవిబేధాలు ఎన్ని ఉన్నా లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క నాయకునికి సముచిత ప్రాధాన్యత కల్పించాల్సి ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రవిందర్ సింగ్ కు ప్రాధాన్యత లేకుండా చేశారన్న విషయాన్ని ఇప్పటికే ఆయన వర్గీయులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.