బీఆర్ఎస్ పార్టీని ఆ భయం వెంటాడుతోందా..?

కోవర్టులు ఉన్నారని నాయకత్వం భావిస్తోందా..?

ఈటల మార్కు పాలిటిక్స్ దూరం కావడం లేదా…

దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:

తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి వరస విజయాలతో ముందుకు సాగుతున్న ఆనేత ప్రభావం ఇంకా ఆ పార్టీని వెంటాడుతోందా..? ఆ పార్టీలో ఇంకా ఆయన కోవర్డులు ఉన్నారన్న అనుమానంతోనే నాయకత్వం నిశిత పరిశీలన చేస్తోందా..? రెండేళ్లు దాటినా విశ్వసనీయులను గుర్తించలేకపోతోందా..? అంటే అవుననే అనిపిస్తున్నాయి అక్కడి పరిస్థితులు గమనిస్తుంటే.

కోవర్టులు ఉన్నారా..?

స్వరాష్ట్ర ఉద్యమ ప్రస్థానం నుండి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. అనూహ్య పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడాల్సి రావడంతో బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ఈటల రాజేందర్. ఉప ఎన్నికల సమయంలోనే గులాభి జెండాను వీడిన కొంతమంది నాయకులు బీజేపీలో చేరారు. అయితే మరికొంతమంది కూడా ఈటల వెంట నడిచే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన పార్టీ నేతలు నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈటలను ఒంటరి చేయాలన్న లక్ష్యం కూడా గులాభి నేతల ముందు ఉండడంతో వెనకా ముందు ఆలోచించకుండా పార్టీని వీడేవారిని నిలువరించడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఉప ఎన్నికల్లో కోవర్టులు ఉన్నారన్న అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ ఈటల రాజేందర్ గెలిచిన తరువాత ఈ అంశం అంతా కూడా మరుగున పడిపోయింది. హుజురాబాద్ ఇంఛార్జిగా పాడి కౌశిక్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తరువాత పార్టీలో ద్రోహం చేసేవారు ఉన్నారంటూ ఆయన కామెంట్ చేశారన్న ప్రచారం సాగుతూ వచ్చింది. హుజురాబాద్ కు చెందిన కొంతమంది నేతలు కూడా పదేపదే ఇదే అంశాన్ని కౌశిక్ రెడ్డి ప్రస్తావిస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ ముఖ్య నాయకత్వం ముందు కూడా ఆవేదన వెల్లగక్కిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడడంతో ఇక్కడ మళ్లీ కోవర్డుల రగడ వెలుగులోకి వచ్చింది. ఇక్కడి నేతలపై పాడి కౌశిక్ రెడ్డి దురుసుగా వ్యవహరిస్తూ ఈటల మనుషులు మీరంతా అన్నట్టుగా వ్యాఖ్యానించిన సందర్భాలు చాలా సార్లు జరిగిందని ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దీంతో పార్టీ వీడడమే బెటర్ అనుకుని పావులు కదుపుతున్న క్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఎంట్రీ ఇచ్చి అందరినీ బుజ్జగించే పనిలో పడ్డారు. కొంతమంది ఆయన మాట కాదనలేక పార్టీలో కొనసాగినప్పటికీ మరికొంతమంది గులాభి జెండాను వీడుతున్నారు. తుమ్మేటి సమ్మిరెడ్డి పార్టీని వీడిన జమ్మికుంట నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. అలాగే జమ్మికుంట జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం శ్యాం కూడా బీజేపీలోకి చేరగా మరికొంతమంది నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీలో కోవర్టుల అంశం వెలుగులోకి వచ్చింది. వీణవంక మాజీ జడ్పీటీసీ సభ్యుడు దాసరపు ప్రభాకర్ శనివారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు కోవర్టులు ఉన్నారన్న అంశాన్ని బలపరుస్తోంది. కౌశిక్ రెడ్డి మీరంతా బీజేపీకి చెందిన వారు అంటూ వ్యాఖ్యలు చేశారని, తాను ఉప ఎన్నికల సమయంలో పనిచేసినప్పుడు ఇంఛార్జీలుగా వ్యవహరించిన నాయకులను అడిగితే తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా హుజురాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని కూడా విమర్శించారు. అయితే రెండేళ్లు కావస్తున్న హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీని కోవర్టు నీడ వెంటాడుతుందని మరో సారి స్పష్టం అయింది.ఈ అంశంపై అధిష్టానం ఎలా ముందుకు సాగుతుందోనన్నదే అసలు ప్రశ్రగా మారింది.

You cannot copy content of this page