ఆరోగ్యాన్ని పంచే ఆ చెట్టుకు వైరస్ అంటుకుందా..?

ఉగాది పర్వదినాన సరికొత్త సమస్య

దిశ దశ, హుజురాబాద్:

సహజ సిద్దంగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఆ చెట్టు ఇప్పుడు సామన్యుడికి ముచ్చెమటులు పట్టిస్తోంది. పేదవాడికి టూత్ బ్రష్ అయిన ఆ చెట్టిప్పుడు అన్ని వర్గాల వారిని కలవరపెడుతోంది. అసలే తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఈ చెట్టు పువ్వును కంపల్సరి తింటారు. అయితే పర్వదినాన ఈ చెట్టకు సోకిన వైరస్ పచ్చడి చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉగాది పండగ వరకు ఆకురాలి కొత్త చిగురు వేసి పూత పూయాల్సిన వేప చెట్లు ఎండిపోయాయి. దీంతో వేప పూత కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి తయారైంది. గతంలో ఎక్కడపడితే అక్కడ కనిపించే వేప చెట్లకు పూసిన పూతను సేకరించుకునేవారు. వైరస్ ప్రభావంతో చాలా వరకు వేప చెట్లు ఎండిపోవడంతో వేప పువ్వు కోసం అన్వేషణ చేపట్టాల్సిన పరిస్థితి తయారైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగేండ్ల క్రితం వేప చెట్లపై కనిపించిన వైరస్ ప్రభావం క్రమంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. రాష్ట్రంలోని ప్రతి 10 వేప చెట్లలో 8 వైరస్ ప్రభావంతో మడి మాసిపోయాయి. కొన్ని చెట్లు సగం ఎండిపోయి.. సగం ఆకుపచ్చగా కనిపిస్తున్నాగా మరికొన్ని వైరస్ కారణంగా పూర్తిగా ఎండిపోయి మోడు వారాయి. వైరస్ సోకకుండా ఉన్న చెట్టు కోసం ప్రత్యేకంగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణాలలో సిసి రోడ్లు వేయడంతో చెట్లు అంతరించిపోగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏ వేప చెట్టుకు వైరస్ సోకిందో తెలియక తికమకపడుతున్నారు.

పచ్చడిలో వేసుకోవాలా ? వద్దా ?

తెలుగు సంవత్సరాది రోజు ఉగాది పచ్చడి చేసుకోవడం తెలుగు ప్రజల ఆచారం. ఇందులో కారం, పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు ఇలా ఆరు రుచులతో ఉగాది పచ్చడి చేయడం ఆనవాయితీ. షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడి సేవించడం వల్ల పులుపు, తీపి, చేదును అనుభవించాలన్న భావన కల్గుతూ ఉంటుంది. అనాదిగా వస్తున్న ఉగాది పచ్చడి తయారు చేసుకునేందుకు చాలా మంది వైరస్ భయంతో ఆందోళన చెందుతున్నారు.

You cannot copy content of this page