పార్టీ శ్రేణులకు నో ఎంట్రీ…
సొంత క్యాడర్ తోనే ప్రచారం…
దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:
ఏది ఏమైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అధిష్టానం పట్టుబట్టింది. ఎవరూ ఊహించని విధంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటించింది. ప్రజాకర్షక పథకాలను ప్రవేశ పెట్టే యోచనలో కసరత్తులు చేస్తోంది. దక్షిణాదిన పాగా వేయాల్సిందేనన్నరీతిలో జాతీయ నాయకత్వం యోచిస్తుంటే ప్రాంత నాయకులు మాత్రం ఎడమొఖం పెడ మొఖం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఇద్దరు స్టార్ క్యాంపెయినర్ల మధ్య సయోధ్య లేకపోవడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ గురించి ఇంటా బయట చర్చ సాగుతోంది.
బీజేపీలోకి రావాలని…
2018 ఎన్నికల తరువాత అధికార పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గులాభి జెండాలకు ఓనర్లమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందన్న సంకేతాలను బాహాటంగా ఇచ్చేశారు. దీంతో ఉద్యమనేతకు ముఖ్య అనుచరునికి మధ్య అంతరం ఏర్పడిందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఓ వేదికపై ప్రసంగిస్తూ ఈటల రాజేందర్ బయటకు రావాలని, తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు. ఆ తరువాత ఈటల నుండి ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ 2021లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈటలపై ఫిర్యాదు, మంత్రివర్గం నుండి తొలగింపు వంటి చర్యలు చకాచకా జరిగిపోయాయి. ఆ తరువాత ఎమ్మెల్యే పదవికి, గులాభి పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే.
ఉప ఎన్నికల్లో ఏకాభిప్రాయం…
గులాభి పార్టీని వీడిన ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యంగా మారిపోయింది. దీంతో హుజురాబాద్ బై పోల్స్ లో బీజేపీ శ్రేణులు ఏకతాటిపై నడిచి ఈటల విజయంలో కీలక భూమిక పోషించారు. పోలింగ్ తేదికి వారం రోజుల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు స్టార్ క్యాంపెయినర్లు చేసిన హాడావుడి అంతా ఇంతాకాదు. మరో వైపున ఆరెస్సెస్ అనుబంధ సంఘాలు కూడా గ్రౌండ్ వర్క్ చేస్తూ ముందుకు సాగాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేస్తు విజయం అందుకున్నారు.
ఎడమొఖం పెడమొఖం…
అప్పుడున్న ఐకమత్యం రాష్ట్ర బీజేపీ నాయకుల్లో క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించేందుకు పావులు కదపడంతో మొదలైన ఈ అంతరం కాస్తా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయింది. జనరల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో నిమగ్నం అయిన ఈ ఇద్దరు స్టార్ క్యాంపెయినర్లు ఒకే జిల్లాలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరు మాత్రం అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తుండడం గమనార్హం. ఉమ్మడి జిల్లా కోరుట్లలో పోటీ చేస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నామినేషన్ కు ఈటల రాజేందర్ హాజరయ్యారు కానీ బండి సంజయ్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఉద్యమనేతగా, జిల్లా మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు సొంత క్యాడర్ ఉన్నప్పటికీ వారు కూడా బండి సంజయ్ కి అనుకూలంగా ప్రచారం చేయడం లేదు. ఇటీవల కొంతమంది ఈటల ముఖ్య అనుచరులుగా ముద్రపడ్డవారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈటల సొంత నియోజకవర్గం అయిన హుజురాబాద్ కు చెందిన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డికి కూడా అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా ఈటల నుండి రెస్పాన్స్ రాకపోవడంతో మౌనంగా ఉంటిపోతున్న పరిస్థితి తయారైందని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జాతీయ నాయకులతో పెరిగిన సంబంధాల కారణంగా ఈటల రాజేందర్ పార్టీ సీనియర్ క్యాడర్ ను పట్టించుకోవడం లేదన్న అసహనం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా హుజురాబాద్ లో తన సొంత క్యాడర్ తోనే ఎన్నికల తంతు కొనసాగిస్తున్నారు తప్ప బీజేపీ పాత క్యాడర్ ను అంతగా అక్కున చేర్చుకోవడం లేదని అంటున్న వారూ లేకపోలేదు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రాష్ట్రమంతా తిరుగుతున్న లీడర్ల మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటో అన్న చర్చ క్యాడర్ లో మొదలైంది. ఈ విషయంపై జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టనట్టయితే పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయోధ్య లాంటి అంశాన్ని సునాయసంగా పరిష్కరించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కోసం ప్రయత్నం చేస్తోందా లేదా అన్నదే అంతుచిక్కకుండా పోయింది పార్టీ శ్రేణులకు.