ఆన్ హోల్డ్… ? ఈడీ కేసు ఉన్నట్టా..? లేనట్టా..?

దిశ దశ, కరీంనగర్:

గ్రానైట్ సీనరేజ్ ఎగవేత విషయంలో ఎంట్రీ ఇచ్చిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దర్యాప్తుకు బ్రేకులు పడ్డాయా..? పనామా లీక్స్ తో కూడా ఈ వ్యవహారంలో సంబంధాలు వెలుగు చూశాయని గుర్తించామని చెప్పిన ఈడీ విచారణ విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తోంది..?

విజిలెన్స్ రిపోర్టుతో ఆరా…

2013లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇచ్చిన అప్రైజల్ రిపోర్టు ఆధారంగా రంగంలోకి ఈడీ దిగింది. కరీంనగర్ లో రెండు రోజుల పాటు గ్రానైట్ లీజు హోల్డర్లకు సంబంధించిన కార్యాలయాలు, ఇండ్లు తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి ఈడీ బృందాలు. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీలు, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్ఆర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ లకు చెందిన కరీంనగర్, హైదరాబాద్ లలో 2022 నవంబర్ 9, 10 తేదిల్లో సోదాలు నిర్వహించాయి ఈడీ బృందాలు. చైనా, హాంకాంగ్ తో పాటు ఇతర దేశాలకు కూడా గ్రానైట్ బ్లాకులను ఎగుమతి చేస్తున్నాయని వాటిల్లో సోదాలు చేసినప్పుడు రాయల్టీ చెల్లించిన పరిమాణం కంటే ఎక్కువగా ఎగుమతి చేసినట్టుగా తేలిందని ఈడీ వెల్లడించింది. ఆయా దేశాలకు ఎగుమతి అయిన బ్లాకులకు సంబంధించిన లావాదేవీలు అధికారిక అకౌంట్ల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా జరిగినట్టుగా కూడా గుర్తించింది. సోదాల్లో లెక్కల్లో చూపని 1.08 కోట్లు హవాల ద్వారా పొందినట్టుగా గుర్తించామని, క్వారీల నుండి 10 ఏళ్లకు సంబంధించిన గ్రానైట్ ఎగుమతి వివరాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఈడీ పేర్కొంది. గ్రానైట్ ఎగుమతులు చేస్తున్న ఏజెన్సీలు ఉద్యో్గులతో పాటు వివిధ బినామీ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపినట్టుగా కూడా తమ సోదాల్లో వెలుగులోకి వచ్చిందని ఈడీ వివరించింది. డబ్బును చేతి రుణాల రూపంలో చైనీస్ కంపెనీల నుండి భారతీయ సంస్థల్లోకి మళ్లించబడ్డాయని, ఆ సంస్థలు పనామా లీక్స్ లో వెలుగులోకి వచ్చిన లీ వెన్ హువోకు చెందినవని కూడా ఈడీ పేర్కొంది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అక్రమ గ్రానైట్ మైనింగ్, ఫెమా ఉల్లంఘనటలపై దర్యాప్తు చేస్తున్నామని కూడా ఈడీ వివరించింది. సీనరేజ్ ట్యాక్స్ ఎగవేసినట్టుగా కూడా గుర్తించడం జరిగిందని 2022 నవంబర్ లోనే ఈడీ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణాలో మరో బారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని తేటతెల్లం అయిపోయినప్పటికీ విచారణలో దూకుడు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా ఏజెన్సీలతో జరిగిన హవాలా స్కాం గురించి కూడా గుర్తించిన ఈడీ దర్యాప్తును పెండింగ్ లో ఉంచడం విస్మయం కల్గిస్తోంది. ఎన్విరాన్ మెంటల్ సమస్యతో పాటు ఇతరాత్ర ఇబ్బందులు ఎధురుకావడంతో పాటు ప్రభుత్వానికి రాయల్టీ ఎగవేసిన విషయంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగినట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page