విచారణపై స్టే ఇచ్చే అవకాశాలు ఉన్నాయా..?

గతంలో కోర్టులు ఏ తీర్పులిచ్చాయంటే…?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరో అడుగు ముందుకేయబోతోందా..? గతంలో విచారణ జరిపినప్పుడు కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కూడా ఊటంకిస్తూ సర్వోన్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేయబోతోందా.? మనీ ల్యాండరింగ్ విషయంలో ఈడీకి ఉన్న అధికారాలను కూడా వివరించనుందా అన్న చర్చ సాగుతోంది. అయితే ఈడీ ఉన్నత స్థాయి అధికారుల బృందం ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ కౌంటర్ దాఖలు చేసేందుకు అన్ని విధాల సిద్దమైనట్టుగా తెలుస్తోంది. అయితే కవిత విషయంలో కోర్టు పరిధిలో లాభించే అంశాలేంటంటే..?

నళిని చిదంబరం విషయంలో…

చిట్ ఫండ్ విషయంలో సెక్షన్ 50 (2) ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (PMLA) ప్రకారం విచారణకు రావాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం భార్య నళినికి నోటీసులు ఇచ్చింది ఈడీ. 2017, 18 సంవత్సరంలో ఈడీ ఇచ్చిన నోటీసులపై నళిని చిదంబరం తాను మహిళను కాబట్టి విచారణను తనను పిలవకూడదని, ఇంటిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో విచారణ జరపకూడదని నళిని చెన్నై హై కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో బెంచ్ ఆమె పిటిషన్ ను తిరస్కరించడంతో పాటు మనీ ల్యాండరింగ్ యాక్డులో ఎవరినైనా ఎక్కడికైనా పిలిచి విచారించే అదికారం ఈడీకి ఉందని అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై నళిని అప్పీల్ కు వెళ్లగా అక్కడా కూడా ఆమెకు చుక్కెదురయింది. అంతేకాకుండా గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా చైన్నై హై కోర్టు ఊటంకించడం గమనార్హం. కవిత విషయంలో ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలాగే తమిళనాడుకు చెందిన కనిమోళి కూడా విచారణకు హాజరైన విషయం కూడా ప్రస్తావనార్హం.

సుప్రీంను ఆశ్రయించిన వారెందరో…

ఈడీ సమన్లపై వందల సంఖ్యలో సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఈడీ సీఆర్పీసీకి ఈడీ చట్టాలకు సంబంధం లేదని ఇవి ప్రత్యేక చట్టాలన్న అభిప్రాయాలనే ఈడీ వ్యక్తం చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు ఈడీ చట్టాలకు అనుగుణంగా నడుచుకోక తప్పని పరిస్థితే ఎదుర్కొన్న సందర్భాలే ఎక్కువ. క్రిమినల్ కేసుల్లో ఏడేళ్లకు తక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లలో కేసులు నమోదయితే 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారి సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా పోలీసులు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈడీ నోటీసులు సివిల్ ప్రోసీజర్ కోడ్ (సీపీసీ) కింద ఇచ్చినట్టుగా తెలుస్తున్నందున సీఆర్పీసీలోని చట్టాలు వర్తించవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా కోర్టులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. అయితే మనీ ల్యాండరింగ్ సంబందించిన చట్టాలు ప్రత్యేకంగా ఉండడంతో పాటు ఈ విషయంలో ఈడీకీ ప్రత్యేక అధికారాలు కల్పించడం వల్లే విచారణ విషయంలో కోర్టులు స్టే ఇవ్వలేదని సమాచారం.

కవితకు విషయంలో…

అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో అయితే కోర్టు విచారణ విషయంలో స్టే ఇవ్వకుండా నాట్ టూ అరెస్ట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో న్యాయ నిపుణులు సుదీర్ఘంగా చర్చించి 24 నాడు సుప్రీం కోర్టులో జరగనున్న విచారణలో పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆమె ఫోన్ డిపాజిట్ చేయాలని ఆమెకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొనకుండా విచారణ సమయంలో తెప్పించుకుని సీజ్ చేసిన విషయం గురించి సుప్రీంలో లేవనెత్తనున్నట్టు సమాచారం. అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే కవిత విచారణకు ముందు రోజున పిళ్లై తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రామచంద్ర పిళ్లై వేసిన ఈ పిటిషన్ విచారణ దశలో ఉన్నందున దానిపై కోర్టు తుది తీర్పు వెలువర్చే వరకూ అరెస్ట్ చేయకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని వాదించే అవకాశాలు లేకపోలేదు.

You cannot copy content of this page