వాహనాల తీరిలా… ప్రాణాలకు ఉందా భరోసా..?

దిశ దశ, కరీంనగర్:

పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మాట దేవుడెరుగు… పేరెంట్స్ వద్ద డబ్బులు వసూలు ఎలా చేయాలోనన్న విషయంపై మాత్రం స్పెషల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. అయితే కొన్ని పాఠశాలల విద్యార్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాల విషయంలో నిబంధనలు అమలు చేస్తున్నారా లేక అన్న విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి విద్యార్థి నుండి కూడా రవాణా చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు వాహనాల ఫిట్ నెస్ తో పాటు సుశిక్షుతులైన డ్రైవర్లను నియమించాల్సి ఉంటుంది. లేనట్టయితే తరుచూ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే వాహనాల ఫిట్ నెస్ పై విద్యా సంవత్సరం ఆరంభంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించి సర్టిఫికెట్ ఇస్తారు. అయితే ఫిట్ నెస్ పరీక్షలు చేయకుండా స్కూల్ వాహనాలను తీయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆర్టీఏ విభాగం అదికారులు కూడా విద్యా సంవత్సరం ప్రారంభం అయిన తరువాత స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన వాహనాలకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బడా విద్యా సంస్థలకు చెందిన వాహనాలు పెద్ద ఎత్తున ఉండడంతో కొన్నింటిని పరీక్షలు నిర్వహించకుండానే వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీఏ నిబంధనలు అమలు కావడం లేదన్న విమర్శలు కూడా లేకపోలేదు.

ఆరంభంలోనే…

విద్యా సంవత్సరం ఆరంభంలోనే అపశృతులు చోటు చేసుకుంటున్న తీరు కూడా ఆందోళన కల్గిస్తోంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు టైర్ ఊడిపోవడంతో ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఆ వాహనంలో విద్యార్థులు ఎవరూ లేనప్పటికీ దాని ఫిట్ నెస్ ఏ స్థాయిలో ఉందోనన్నది స్పష్టం అయింది. సింగిల్ విండ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఓ బైక్ కు టైర్ వెల్లి తగిలినట్టుగా స్థానికులు చెప్తున్నారు. పాఠశాల ప్రారంభం అయిన మొదటి రోజునే ప్రైవేటు పాఠశాల వాహనం రోడ్డు ప్రమాదానికి గురి కావడం గమనార్హం. మరో వైపున కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి వద్ద ప్రముఖ  విద్యా సంస్థలకు చెందిన బస్సు చెట్టును డీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అందులో కాలేజీ స్టాఫ్ ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం అయిందంటే చాలు ఎక్కడో ఓ చోట ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించిన వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాహనాల ఫిట్ నెస్ తో పాటు డ్రైవర్లు కూడా సుశిక్షుతులై ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్టీఏ అధికారులు ప్రైవేటు విద్యా సంస్థలు వినియోగిస్తున్న వాహనాల డ్రైవర్లకు కూడా తరుచూ పరీక్షలు నిర్వహిస్తే బావుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం మాత్రమే వినియోగించాల్సిన వాహనాలు ఇతరాత్ర అవసరాలకు కూడా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.

You cannot copy content of this page