దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించినట్టుగానే రాష్ట్ర రాజముద్రను సమూలంగా మార్చి వేసే పనులు నిమగ్నమైంది. ఇందుకోసం పలు డిజైన్లను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్నింటిని జాబితాలో చేర్చింది. ఇందులో ఒక రాజముద్ర కు సంబంధించిన ఫోటో ను ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఈ రాజముద్రకు సంబంధించిన ఫోటోలో అమరవీరుల స్థూపం, అశోకుడు, సత్యమేవ జయతే అని రాయించారు. మూడు భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని కూడా రాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజముద్రను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ రాజముద్రకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… దాదాపు ఇదే ఫైనల్ అవుతుందని అంచనా వేస్తున్నారు. నూతనంగా తయారు చేసిన ఈ రాజముద్ర గురించి ప్రజా క్షేత్రంలో ఎలాంటి స్పందన ఉంటుందో అన్న విషయంపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాజముద్రలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల బలిదానాలతో వచ్చినందున… వారిని స్మరించుకున్నట్టుగా ఉంటుందని స్థూపాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అయితే ఈ రాజముద్రపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.