క్లియర్ కట్ రిపోర్ట్ కావాలన్న కలెక్టర్
సుమోటోగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆరా
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న గర్భిణీ కడుపులో మాప్ (న్యాప్ కిన్) బయటపడిన ఘటనపై త్రిమేన్ కమిటీ విచారణ చేపట్టింది. బుధవారం వేములవాడతో పాటు జగిత్యాలలో ఆసుపత్రుల్లో ఆరా తీసిన కమిటీ మాతా శిశు సంరక్షణ కేంద్ర ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగాన్ని పిలిపించుకుని విచారణ జరిపార. అలాగే బాన్సువాడలో ఉన్న బాధితురాలి నుండి వివరాలు కూడా సేకరించిన కమిటీ ఈ మేరకు రిపోర్టును జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషాకు అప్పగించారు.
నివేదికలోని సారాంశం ఇది…
వేములవాడ ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీ చేయగా బాధితురాలి కడుపు నుండి మాప్ తీశామని చెప్పడంతో మొదట కమిటీ సభ్యులు ఈ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఎంసీహెచ్ ఆసుపత్రికి చేరుకున్న వీరు జగిత్యాల ఏరియా ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు, ఆ రోజు డ్యూటీలో ఉన్న వారిని విచారించారు. ఈ మేరకు త్రి మేన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం… ఆమె కడుపు నుండి తీసిన మాప్ 10/10 సైజ్ లో ఉందని కమిటీ గుర్తించింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా చేసే మాప్ సైజు 6/6 మాత్రమే ఉంటుందని కమిటీ అభిప్రాయపడగా, గత ఆరు నెలలుగా కడుపునొప్పి భరించలేకపోయిన బాధితురాలు కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రిల్లో పరీక్షలు చేయించుకున్నారని, చివరకు నిజామాబాద్ లో సిటీ స్కాన్ తీయడంతో లోపల మాప్ ఉందని గుర్తించినట్టుగా బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారని కమిటీ వివరించింది. ఆమెకు ఏడేళ్ల క్రితం ఒకసారి, 2020లో రెండో సారి, 2021లో మూడోసారి సర్జరీ చేయించుకుందని బాధితురాలు చెప్పిన వివరాలను బట్టి కమిటీ అధికారులు తేల్చారు. అయితే అంతకు ముందు చేయించుకున్న ఆపరేషన్ల గురించి మాత్రం వివరంగా చెప్పడంలేదని, మరో వైపున నిజామాబాద్ లో చేసిన సిటీ స్కాన్ తరువాత జగిత్యాల ఏరియా ఆసుపత్రి యంత్రాంగంపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని, ఈ నెల 8న వేములవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న బాధితురాలు 14న డిశ్చార్జి అయిన తరువాత కూడా ఫిర్యాదు చేయకపోవడం వెనక ఆంతర్యం అంతు చిక్కడం లేదన్న కోణంలో కమిటీ నివేదిక రూపిందించినట్టు సమాచారం. అయితే సాధారణంగా మాప్ రెండు నెలల్లో తన అస్థిత్వాన్ని కోల్పోతుందని ఈ బాధితురాలి విషయంలో మాత్రం ఏడాదిన్నర కాలంగా మాప్ అలాగే ఉండడం విచిత్రంగా ఉందని కూడా కమిటీ అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషాకు కమిటీ అధికారులు అప్పగించారు.
ఓన్లీ గ్రౌండ్ రియాల్టీ… నో ఫోన్ క్లారిటీ
అయితే జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ఈ నివేదిక చూసిన తరువాత కమిటీ సభ్యులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. బాధితురాలితో ఫోన్లో మాట్లాడామని కమిటీ చెప్పడంతో బాన్సువాడలోఉన్న ఆమెతో సవివరంగా మాట్లాడి వాస్తవాలు తెలుసుకుని ఆమె సిటీ స్కాన్ చేయించుకున్న చోట, ఎక్కడెక్కడ పరీక్షలు చేయించుకుని వైద్యం చేయించుకున్నారో ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వారం రోజుల్లో ఇందుకు సంబందించిన సమగ్ర నివేదికను తనకు ఇవ్వాలని కమిటీని ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ సుమోటో…?
జగిత్యాల ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సుమోటోగా విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం. బాదితుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ వాస్తవాలను వెలికి తీయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించిడంతో ఉన్నతాధికారులు ఈ అంశంపై లోతుగా ఆరా తీసే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం.