నీటిని వదులుతున్నది అందుకే…
దిశ దశ, భూపాలపల్లి:
నిన్న మొన్నటి వరకు కలవరపెట్టిన బుంగలు మూసుకపోయాయన్న సంతోషం అధికారుల్లో ఎంతో కాలం లేకుండా పోయింది. రిపేర్లు చేశాం అంతా సాఫీగా సాగుతోందనుకుంటున్న క్రమంలో మరోచోట సీపేజ్ ప్రారంభం అయింది. దీంతో కాళేశ్వరంలోని మరో బ్యారేజీని బాగు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. జిల్లాలోని మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన సరస్వతి బ్యారేజీలో మరోసారి లీకేజీలు వెలుగులోకి వచ్చాయి. బ్యారేజీలోని 35 గేటు వద్ద నిర్మాణాలు దెబ్బతినడంతో లీకేజ్ స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని గమనించిన అధికారులు సవరించే ప్రయత్నం చేసినా బ్యాక్ వాటర్ ఉధృతంగా వస్తున్నందున దానిని బాగు చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అన్నారం బ్యారేజ్ లో ఉన్న 2 టీఎంసీల నీటిని కూడా దిగువకు వదిలేయాలని నిర్ణయించారు. నవంబర్ లో బ్యారేజీకి దిగువ ప్రాంతంలో బుంగలు పడడం కామన్ అని, సీపేజ్ అవుతుంటుందని ఇదంతా మెయింటనెన్స్ లో భాగమేనని అంతా సర్దుకపోతుందన్న రీతిలో ఇంజనీర్లు ప్రకటనలు చేశారు. అయితే ఆ తరువాత నీటిని దిగువకు వదిలిన అధికారులు బుంగల ఏర్పడకుండా ఉండేందుకు మరమ్మత్తలు చేశారు. దీంతో అన్నారంలో సమస్యలు ఎదురుకావన్న ధీమాతో ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లకు మరో లీకేజీ వెలుగులోకి రావడం తలనొప్పిగా మారింది. అయితే ఈ పరిస్థితి ఒక్కచోటే ఉందా లేక ఇతర ప్రాంతాల్లో కూడా నెలకొందా అన్న విషయంపై కూడా ఆరా తీయాల్సి ఉంది. లేనట్టయితే మేడిగడ్డ పరిస్థితే రిపిట్ అయి బ్యారేజీ నిర్మాణానికే సవాల్ విసిరే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్యాక్ వాటర్ అంతా దిగువకు వెల్లిపోయిన తరువాత బ్యారేజీ అంతటా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని విధాలుగా మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే నేషనల్ డ్యాం స్టేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇచ్చిన నివేదికల ప్రకారం కూడా బ్యారేజ్ ని పరిశీలించాల్సి ఉంది. లేనట్టయితే వేరే చోట కూడా చిన్న చిన్నగా ఉన్న లీకేజీలో మరింత విస్తరిస్తే పిల్లర్లు, గేట్లు కూడా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. లీకేజీకి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 35 గేట్ వద్ద నుండి వాటర్ లీకేజీ అవుతోందని అందులో పేర్కొన్నారు. అయితే అలాంటిదేమి లేదని అన్నారం బ్యారేజీలో ఎలాంటి లీకేజీలు లేవని, బ్యారేజీ పరిశీలనలో భాగంగానే నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు చెప్తున్నారు.
మేడిగడ్డలో అవి కూల్చాల్సిందేనా..?
మరో వైపున మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి స్థాయిలో దెబ్బతిన్న 7వ బ్లాకు విషయంలో కూడా ఇంజనీర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కుంగుబాటుకు గురైన పిల్లర్ల ప్రభావంతో ఇరు పక్కల రెండు బ్లాకులు కూడా డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే వర్షాకాలం వరకు వీటిని అలాగే ఉంచినట్టయితే ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద నీరు ఒత్తిడికి గురి కావడం… తిరిగి బ్యారేజీ వైపునకు ఉధృతంగా వెళ్లి ఢీ కొట్టడంతో బ్యారేజీపై మరింత భారం పడే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాగు తొలగించాల్సిన 7వ బ్లాకులోని పిల్లర్లను ముందుగానే తీసి వేసినట్టయితే వరద నీరు సాఫీగా దిగువకు వెల్లిపోతుందని దీంతో మిగతా బ్యారేజీకి ముప్పు వాటిల్లకుండా ఉంటుందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 7వ బ్లాకులను తొలగించేందుకు అనుమతి ఇచ్చినట్టయితే పిల్లర్లను, గేట్లను పూర్తిగా తీసివేయనున్నారు.