దిశ దశ, కరీంనగర్:
లోకసభ ఎన్నికల టికెట్ ఆశించిన ఆ మాజీ ఎమ్మెల్యే చివరి క్షణం వరకూ ప్రయత్నించి భంగపడ్డారు. మొదట వెనకడుగు వేసిన ఆయన ఆ తరువాత టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కరీంనగర్ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోయింది. కరీంనగర్ ఎంపీగా పోటీ చేయాలని వెలిచాల రాజేందర్ రావు భావించిన తరువాత ఇక్కడి నుండి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో ముందుగా ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. రాజేందర్ రావు తనకు సంబంధించిన కొంతమందిని అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వద్దకు పంపి ఎంపీ టికెట్ రేసులో ఉన్నారా లేరా అన్న విషయం గురించి వాకబు చేయించినట్టుగా సమాచారం. ఆయన మాత్రం తనకు ఎంపీగా పోటీ చేసే యోచన లేదని, ప్రత్యామ్నాయ పదవిని ఆశిస్తున్నానని రాజేందర్ రావు పంపిన దూతలతో కుండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తోంది. ఒక వేళ ప్రవీణ్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నట్టయితే తాను కూడా టికెట్ ఆశించడం సరికాదన్న ఉద్దేశ్యంతోనే ముందుగా ప్రవీణ్ రెడ్డి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ టికెట్ ఆశించినప్పటికీ ఆయనను అదిష్టానం కాదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రవీణ్ రెడ్డి ఆలోచనలు ఏంటన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారన్నారు. అయితే ప్రవీణ్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేనని స్ఫష్టం చేసిన తరువాత రాజేందర్ రావు టికెట్ కోసం రంగంలోకి దిగినట్టుగాతెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపిక…
ఓ వైపున లోకసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులను కోరారు. దీంతో అధిష్టానం కరీంనగర్ క్యాండెట్ పేరును ప్రకటించే విషయంలో సమాలోచనలు జరపడం ఆరంభించింది. ప్రవీణ్ రెడ్డి మొదటి నుండి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రచారంలో పార్టీ రంగంలోకి దిగేదన్న వాదనలు కూడా ఆ పార్టీలో వినిపించాయి. వివిధ వర్గాలకు చెందిన వారు ఆయనకు మద్దతు ఇస్తామన్న సమాచారం చేరవేసినా సీరియస్ గా దృష్టి పెట్టకపోవడం కూడా ఆయనకు మైనస్ గా మారింది. మధ్యలో ప్రవీణ్ రెడ్డి టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనలు తీసుకరావడంతో అధిష్టానం ఎవరివైపునకు మొగ్గాలో తెలియక ఆలోచనలో పడింది. చివరకు ఏడు సెగ్మెంట్లలోని ఆరు స్థానాలకు సంబంధించిన ఇంఛార్జీలు వెలిచాల రాజేందర్ రావుకే టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి తేల్చి చెప్పారు. ప్రవీణ్ రెడ్డి కూడా తనకు టికెట్ ఇవ్వాలని అభ్యర్థిస్తుండడంతో ఏఐసీసీ పెద్దలు కూడా రాష్ట్ర నాయకత్వంతో చర్చించారు. అయితే రాజేందర్ రావును కార్యక్షేత్రంలోకి వెల్లి పని చూసుకోవాలన్న సంకేతాలను అధిష్టానం ఇచ్చిన తరువాతే నియోజకవర్గం అంతా పర్యటించడం మొదలు పెట్టారు. స్థానిక నాయకత్వం కూడా ఆయనతో కలిసి నడిచిన నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి తరుపున నామినేషన్ దాఖలు కావడంతో వెలిచాల రాజేందర్ రావును పక్కనపెట్టేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. కానీ చివరకు బుధవారం రాత్రి వెలిచాల రాజేందర్ రావునే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కరీంనగర్ క్యాండెట్ విషయంలో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది.
మీనామేషాల వల్ల…
అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోయింది. అభ్యర్థికి ప్రకటించినట్టయితే ఇప్పటికే నియోజకవర్గం అంతా ప్రచారం ఊపందుకునే అవకాశం ఉండేది. కానీ పట్టుమని పదిహేను రోజుల్లో 52 మండలాలను కవర్ చేయాల్సిన పరిస్థితి తయారైంది. క్యాండెట్ విషయంలో హై కమాండ్ చేసిన ఆలస్యం వల్ల పార్టీ శ్రేణులు నిర్విరామంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.