సామాజిక వర్గ సమీకరణాలు… అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్…

దిశ దశ, హైదరాబాద్:

లోకసభ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారిగా సమీకరణాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం పాటించాలన్న యోచనతో అధిష్టానం సామాజిక వర్గాల వారిగా పరిశీలన చేస్తున్నట్టుగా సమాచారం. పోటీ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్న వారిలో ప్రయారిటీ ఇవ్వాలన్న కారణంగానే అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్టయితే వ్యతిరేకతను కొని తెచ్చుకున్నట్టవుతుందని అంచనా వేస్తున్న పార్టీ అధిష్టానం ఆయా స్థానాల్లో అభ్యర్థుల పేర్లను పరిశీలించి తుది జాబితా విడుదల చేయనున్నట్టుగా సమాచారం. ఈ కారణంగానే తమ పేర్లు ఖరారయ్యాయని ధీమా వ్యక్తం చేసిన అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. లోకసభ స్థానాల వారిగా ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే ఎలా ఉంటుంది… ఆయా సామాజిక వర్గాల్లో బలమైన నాయకుడు ఉన్నారా అన్న విషయాలపై చర్చలు చేస్తున్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో సమతూకం పాటించనట్టయితే ప్రత్యర్థి పార్టీలు అడ్వంటైజ్ గా తీసుకునే చేసే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందున అన్ని రకాలుగా ఆలోచించిన తరువాతే అభ్యర్థులను ఫైనల్ చేయాలన్న యోచనకు అధిష్టానం వచ్చినట్టుగా సమాచారం. ఈ కారణంగానే తొలి జాబితాలో తెలంగాణాకు అవకాశం దక్కినప్పటికి రెండో జాబితాలో అభ్యర్థులను ప్రకటించలేకపోయినట్టుగా సమాచారం. వీటన్నింటిని క్రోడీకరించకుని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులతో కూడా చర్చించిన తరువాత ఏఐసీసీ నాయకులు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ స్థానం నుండి బీసీలకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినట్టుగా సమాచారం. అయితే అక్కడ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయిందని ప్రచారం జరిగినప్పటికీ ఇతర చోట్ల ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాల్సి వస్తున్నందున అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీసీ నేత అయితే ప్రజల నుండి సానుకూలత వస్తుందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటికీ సీఎం రేవంత్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు మాత్రం జీవన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. అలాగే కరీంనగర్ విషయంలో కూడా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయిపోయిందని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఆయన కూడా బ్యానర్లు తయారు చేయించడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులతో సమావేశాలు కూడా జరిపారు. రెడ్డి సంఘం కూడా తమ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా చేసింది. అంతేకాకుండా ప్రవీణ్ రెడ్డి టికెట్ ఖాయం అయిపోయిందన్న భావనతో రెడ్డి సంఘం ప్రతినిధులు సమీకరణాలు కూడా నెరుపుతున్నారు. పెద్దపల్లి టికెట్ విషయంలోనూ సెగ్మెంట్ ఇంఛార్జీల అభ్యంతరాలతో పాటు ఉప కులాల అంశం కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుండి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడు గడ్డం వంశీకే టికెట్ ఖాయం అయిపోయిందని అసెంబ్లీ ఎన్నికలప్పటి నుండి ప్రచారం జరిగింది. లోకసభ ఎన్నికలు సమీపించగానే పెద్దపల్లి కాంగ్రెస్ నాయకుల సరికొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకవచ్చారు. అంతేకాకుండా ఇక్కడి నుండి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరో వైపున పెద్దపల్లి నుండి రెండు సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సుగుణాకుమారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు టీడీపీలో ఉన్నప్పటి నుండి ఉన్న పరిచయాలున్న వారిలో కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు కావడం వారంతా కూడా సుగుణా కుమారికి టికెట్ ఇవ్వాలని చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు వివేక్ పై ఉన్న వ్యతిరేకత ప్రభావం కూడా వంశీ అభ్యర్థిత్వంపై తీవ్రంగా పడుతున్నట్టుగా సమాచారం. ఆయన ప్రతి సెగ్మెంట్ లో సొంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకుని ఇంఛార్జీలతో సంబంధంల లేకుండా వ్యవహరించడం వంటి అంశాలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వ్యతిరేకతకు ప్రధాన కారణంగా మారిందని చెప్పవచ్చు. వెంకటస్వామితో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని కూడా పక్కనపెట్టి ఆయన ప్రత్యామ్నాయ ఆర్గనైజేషన్ నడిపిస్తారన్న అపవాదును మూటగట్టుకున్నారు. దీంతో పెద్దపల్లి పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మెజార్టీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు వంశీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎదురవుతున్న నేపథ్యంలోనే ఆయా చోట్ల పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారి ప్రాధాన్యత అంశాలపై కూడా అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా సమాచారం. అటు సామాజిక వర్గాల సమీకరణాలు… ఇటు ఆయా స్థానాల పరిదిలోని నాయకుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్న కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఆలస్యం అవుతున్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page