ఆర్థిక భారం తప్పదా..?
యూరియా షార్టేజీకి ఇదే కారణమా..?
దిశ, దశ, హైదరాబాద్:
యూరియా సరఫరా విషయంలో ఇబ్బందులు ఎక్కడ తలెత్తుతున్నాయి..? కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు నష్టదాయకంగా ఉందా..? మార్క్ ఫెడ్ అనుసరిస్తున్నతీరుతో ఇక్కట్లు తప్పడం లేదా..? వరి నాట్లు మొదలైన నేపథ్యంలో దొడ్డు యూరియా వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో రైతులకు అందుబాటులో యూరియా ఉంచాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంది. కానీ రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
అసలేం జరుగుతోంది..?
ప్రధానంగా రైతాంగానికి అవసరమైన యూరియాను చాలినంతగా సరఫరా చేసేందుకు దేశంలోని వివిధ యూరియా కంపెనీలు రంగంలోకి దిగాయి. ఆయా సంస్థల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా క్రిభ్ కో సంస్థ చాలా ప్రాంతాలకు యూరియా సరఫరా చేస్తోంది. ఇందులో 60 శాతం మార్క్ ఫెడ్ కు, 40 శాతం, సహకార సంస్థలు, ప్రైవేటు డీలర్లకు పంపిస్తుంటుంది. మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా చేసే యూరియా ఒక్క కో ఆఫరేటివ్ సొసైటీలకు మాత్రమే వెల్తుంది. 60 శాతం యూరియా అంతా కూడా సొసైటీల ద్వారా రైతాంగానికి అందుబాటులో ఉంచినట్టయితే షార్టేజ్ అనేదే ఉండదని తెలుస్తోంది. అవసరాలకు తగినట్టుగా యూరియా సరఫరా అవుతున్నప్పటికీ కొన్ని నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఎదురయినట్టుగా తెలుస్తోంది.
ఫస్ట్ కం… ఫస్ట్ ఔట్…
వ్యాగన్లలో ఆయా ప్రాంతాలకు చేరుతున్న యూరియాను నేరుగా ఆయా సొసైటీలకు చేరవేసి రైతాంగానికి అందుబాటులో ఉంచే విధానం కాకుండా సరికొత్త విధానంతో క్రిభ్ కో వ్యవహరిస్తోంది. అయితే గోదాముల్లోకి మొదట చేరిన యూరియాను సొసైటీలకు పంపించాలని, ఆ తరువాత వచ్చిన యూరియాను వ్యాగన్ల నుండి నేరుగా గోదాముల్లోకి మాత్రమే తరలించాలన్న విధానాన్ని అవలంభిస్తున్నారు. దీనివల్ల వ్యాగన్ లలో ఆయా ప్రాంతాలకు చేరుకున్న యూరియా స్టాక్ అంతా కూడా గోదాములకు తరలించిన తరువాత అక్కడి నుండి సొసైటీలకు పంపిస్తున్నారు. దీనివల్ల వ్యాగన్ల నుండి గోదాముల్లోకి చేరవేయడం, గోదాముల నుండి సొసైటీలకు చేరవేయడం వల్ల లోడింగ్, అన్ లోడింగ్ చార్జీలతో పాటు రవాణా ఛార్జీలు కూడా అదనంగా పడుతున్నాయి. అంతేకాకుండా రవాణా కోసం కూడా సమయం పడుతుండడంతో రైతులకు యూరియా చేరడం ఆలస్యం అవుతుండగా, మరో వైపున యూరియా కూడా గడ్డలుగా మారిపోతోంది. దీంతో యూరియా తన ప్రభావాన్ని చూపించే అవకాశాం లేదని రైతులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వ్యాగన్ల నుండి నేరుగా సొసైటీలకు యూరియాను చేరవేసే విధానాన్ని అమలు చేస్తే మార్కె ఫెడ్ సంస్థకు అటు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఇటు రైతులకు వేళకు యూరియా అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మార్కె ఫెడ్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అన్నింటా కూడా నష్టాన్ని చవిచూస్తున్నందున అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంస్థల ద్వారా దిగుమతి అవుతున్న యూరియాలో మెజార్టీ స్టాక్ కో సహకారం సంఘాలకు అందిస్తున్నప్పటికీ కొన్ని నిర్ణయాల వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.
అవసరం తీరాక…
అయితే రైతాంగానికి సకాలంలో యూరియా అందించే విషయంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసినట్టయితే ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అమలు చేస్తున్న పద్దతుల వల్ల అవసరం తీరిన తరువాత యూరియా మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స్ఫష్టం అవుతున్నది. దీనివల్ల యూరియా కోసం వెచ్చించే డబ్బు కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయా సంస్థలు యూరియాను అందుబాటులో ఉంచేందుకు సరైన నిర్ణయాలు తీసుకుంటే బావుంటుందన్న సూచనలు ఇస్తున్నారు పలువురు.