బీజేపీ వ్యూహం ఇదేనా…?

ఉప ఎన్నికల వాతావరణంతో ఉన్న తెలంగాణాలో జరుగుతున్నదేంటి..? బలహీనమైన పార్టీగా ఉన్న బీజేపీ ఎలాంటి పావులు కదుపుతోంది..? క్షేత్ర స్థాయిలోకి పార్టీని తీసుకెళ్లాలంటే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనుకుంటున్న సమయంలో ఉప ఎన్నికలు ఆ పార్టీకి అనుకూలంగా మల్చుకుంటోందా..? దీని వెనక ఉన్న స్కెచ్ ఇదేనా…?

అడ్వంటైజ్ తీసుకుంటోందా…?

రాష్ట్రంలో నామ మాత్రమైన ఉనికిని చాటుకుంటున్న భారతీయ జనతాపార్టీ తన బలాన్ని బలగాన్ని పెంచుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా స్పష్టం అవుతోంది. ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించే ప్రయత్నంలో బాగంగా బలమైన రాజకీయ పార్టీగా నిర్మించుకునే పనిలో నిమగ్నం అయింది. తెలంగాణాలో నామమాత్రంగా ఉన్న బీజేపీ వేవ్ స్పీడందుకుందనే చెప్పాలి. క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేకపోవడంతో పాటు నియోజకవర్గ స్థాయిలో బలమైన లీడర్ లేకపోవడం ఆ పార్టీకి ఉన్న పెద్ద మైనస్. బీజేపీకి గుర్తింపు ఉన్నప్పటికీ ప్రజల్లో బలంగా నాటుకపోలేకపోవడం తెలంగాణా రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ ఎదురీదాల్సిన పరిస్థితే ఉందన్నది వాస్తవం. నెటిజన్లు, యువతరం నుండి ఎక్కువ మద్దతు బీజేపీకి లభిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అంతే స్థాయిలో సానుకూలత అందుకోలేకపోతున్నది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూనే రాష్ట్రంలో పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని నియోజకవర్గాల్లో విడుతల వారిగా పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరింత పట్టుబిగించాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని గమనించిన బీజేపీ అధిష్టానం అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది.

ఉప ఎన్నికలతో…

అసెంబ్లీలో బలం పెంచుకోవాలన్న లక్ష్యం కన్నా ఎక్కువగా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి కమలం గుర్తును చేరువ చేసే స్కెచ్ దాగి ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో అందివస్తున్న ఉప ఎన్నికలను ఆసరాగా తీసుకుని వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకు సాగుతున్నట్టు అర్థం అవుతోంది. 2018 నుండి ఇప్పటి వరకు ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా 2 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ అన్ని చోట్ల కూడా పోటీ చేసింది. ఈ ఉప ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజల్లో బీజేపీ గురించి చర్చ జరిగే పరిస్థితిని తయారు చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నది. వామపక్ష భావజాలం ఉన్న నల్లగొండ లాంటి జిల్లాల్లో కూడా బీజేపీ బలంగా ఎదిగిందన్న సంకేతాలను చెప్పకనే చెప్తున్నది. అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు కావడంతో విస్తృతంగా పార్టీ నాయకత్వం కూడా చేపట్టిన ప్రచారం వల్ల అక్కడి ప్రజల్లో బలంగా నాటుకపోయే ప్రయత్నంలో సఫలం అయ్యామనే బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో చూపుతున్న పోరాట పటిమ కేవలం ఆ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలో కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గమనించిన బీజేపీ అధిష్టానం ఉప ఎన్నికలను అడ్వంటైజ్ గా తీసుకుంటోంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు అవకాశం వస్తే అధికార టీఆరెఎస్ పార్టీని గద్దె దింపాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ క్యాడర్ అన్ని గ్రామాల్లో బలంగా తయారైతే ఫలితాలను అనుకూలంగా రాబట్టుకోవచ్చని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

You cannot copy content of this page