ఆ పరిచయం అప్పటిదేనా..? తొర్రూర్ సీఐ ఎసీబీ ట్రాప్ కేస్…

దిశ దశ, వరంగల్:

రాష్ట్రంలోనే తొలిసారిగా టెక్నాలజి సాయంతో ఏసీబీకి పట్టుబడిన తొర్రూర్ సీఐ జగదీష్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు రెడ్ హైండెడ్ ట్రాప్, మీడియేటర్ల ద్వారా లంచం తీసుకోవడం వంటి కేసులను ఏసీబీ నమోదు చేసింది. తాజాగా తొర్రూర్ సీఐ కర్రి జగదీష్ విషయంలో ఏసీబీ అదికారులు వాట్సప్ కాల్ రికార్డింగ్ కోసం సపరేట్ డివైజ్ ఉపయోగించడం సరికొత్త చర్చకు దారి తీసింది. అయితే బాధితునికి, సీఐకి గతంలోనే సంబంధాలు ఉండేవని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఏ6 నిందితునిగా ఉన్న బాధితుడు కిరణ్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన వాడు. గతంలో బెల్లంపల్లి, ఐబీ తాండూర్ తో పాటు తూర్పు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పనిచేసినప్పుడు సీఐ జగదీష్ కు, కిరణ్ కు మధ్య సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం అయితే జరుగుతోంది. బాధితుడు నివాసం ఉండే రెబ్బెన పరిసర ప్రాంతాల్లో జగదీష్ వివిధ హోదాల్లో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించారని, అప్పటి సన్నిహిత సంబంధాల కారణంగానే కేసు ఇన్వెస్టిగేషన్ లో సీఐ తలదూర్చినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఐబీ తాండూర్ సర్కిల్ ఏరియాకు చెందిన పీడీఎస్ రైస్ దందా చేసేవారితో… తాజాడా ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన జగదీష్ కు మధ్య పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్పటి పరిచయాలు, సన్నిహిత సంబంధాల కారణంగానే తొర్రూరు సీఐ హోదాలో జోక్యం చేసుకుని అడ్డంగా ఏసీబీకి దొరికిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పీడీఎస్ బియ్యం పట్టుకున్న ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ ఘటనలో పరోక్షంగానో, ప్రత్యక్ష్యంగానో సీఐ జగదీష్ కు సంబంధాలు ఉండి ఉంటాయని మంచిర్యాల ప్రాంతంలో చర్చ సాగుతోంది. ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు ఉన్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకునే… దంతాలపల్లిలో పట్టుబడ్డ పీడీఎస్ రైస్ లారీ విషయంలో మామూళ్లు డిమాండ్ చేసి ఉంటాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఏ6గా ఉన్న కిరణ్ ను విచారించే విషయంలో మాత్రమే సీఐ ప్రత్యేక శ్రద్ద చూపారా..? లేక మిగతా నిందితులను విచారించేందుకు కూడా ఇదే తరహా చొరవ తీసుకున్నారా అన్న విషయంపై స్పష్టత రావల్సిన అవసరం ఉంది. కిరణ్ మాత్రం తానిప్పుడు పీడీఎస్ రైస్ దందా చేయడం లేదని, తనకు ఏ పట్టుబడ్డ లారీతో ఏ మాత్రం సంబంధం లేదని పోలీసుల ముందు వాదనకు దిగినట్టుగా సమాచారం. అయితే కిరణ్ కు సంబంధం లేనట్టయితే లారీ డ్రైవర్, క్లీనర్ అతని పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆరుగురి పేర్లు ఎలా గుర్తించారు అన్న విషయంపై క్లారిటీ రావల్సిన ఆవశ్యకత ఉంది.

అక్టోబర్ 2నాటి కేసు…

తొర్రూర్ సర్కిల్ పరిధిలోని దంతాలపల్లి పోలీస్ స్టేషన్ మీదుగా తరలి వెల్తున్న పీడీఎస్ రైస్ లారీని అక్టోబర్ 2న పట్టుకున్నారు. అక్రమంగా బియ్యం తరలివెల్తున్నాయని గుర్తించిన పోలీసు అధికారులు డ్రైవర్ ఖాజా, క్లీనర్ లను విచారించిన మొత్తం ఆరుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో 6వ నిందితునిగా ఉన్న కిరణ్ ను విచారణకు హాజరు కావాలని తొర్రూర్ సర్కిల్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే మూడు మాసాలుగా ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం వెనక ఆంతర్యం ఏంటన్నది సీఐ జగదీష్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన తరువాత స్పష్టం అవుతోంది. అక్టోబర్ 2న దంతాలపల్లి పోలీసు అధికారులు లారీని సీజ్ చేసిన తరువాత డ్రైవర్, క్లీనర్ లు కన్ఫెషన్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ లను కలెక్ట్ చేయడంలో తాత్సర్యం ఎందుకు చేశారన్న అనుమానం పోలీసు అధికారులకు రాకపోవడం కూడా విస్మయం కల్గిస్తోంది. టెక్నాలజీ ద్వారా గంటల వ్యవధిలో కేసులను పరిశోధిస్తున్న ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. అలాంటిది పీడీఎస్ బియ్యం రైస్ స్మగ్లింగ్ విషయంలో మాత్రం మూడు నెలలకు పైగా వేచి చూసే ధోరణి అవలంబించడం విస్మయం కల్గిస్తోంది. ఓ వైపున నేరాల పరిశోధనలు చకాచకా చేయడంతో పాటు నిందితులకు శిక్షలు పడేవిధంగా పోలీసు ఉన్నాతాధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తుంటే తొర్రూర్ సీఐ మాత్రం పీడీఎస్ బియ్యం లారీ పట్టుకున్న కేసును 3 నెలలుగా పెండింగ్ లో ఉంచడం విడ్డూరంగా ఉంది. ఈ విషయంలో నేర సమీక్షా సమావేశంలో అధికారులకు ఏ సమాధానం చెప్పి కేసు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఎలా ఉంచారన్నదే పజిల్ గా మారింది.

You cannot copy content of this page