మరో విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్న ఇస్రో…

సక్సెస్ ను షేర్ చేసుకున్న ఇస్రో, ఐఏఎఫ్

ముత్యాల రాజారెడ్డి స్పెషల్ కరస్పాండెంట్

అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి భారతదేశం మరో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలో ఇంత వరకు ఏ దేశం చేపట్టని అద్భుతమైన ప్రయోగాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్వహించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. కర్ణాటక చిత్రదుర్గలోని ఎరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ ఏటీఆర్‌లో ఈ ప్రయోగం ఆదివారం ఉదయం 7గంటల 10నిమిషాలకు మొదలైంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు సంబందించిన చీనూక్‌ హెలికాప్టర్‌ ఈ సరికొత్త ప్రయోగంలో కీలక పాత్ర పోషించింది. రీయూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌- ఆటనామస్‌ ల్యాండింగ్‌ మిషన్‌ -ఆర్ఎల్వి-ఎల్ ఈ ఎక్స్ ని ఈ హెలికాప్టర్‌ ఆకాశం లోకి మోసుకెళ్లింది. ఆర్ఎల్వి-టిడి అంటే రెక్కలతో కూడిన ఒక ప్రయోగవాహకం. హెలికాప్టర్‌ దిగువ భాగంలో దీన్ని వేలాడదీసిన తరువాత చీనూక్‌ హెలికాప్టర్‌ భూమి నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో ఈ వాహాకాన్ని భూమి వైపు వదిలేసింది. ఈ ల్యాండింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ను చిత్రదుర్గలోని ఏటిఆర్ సెంటర్‌ నుండి ఇస్రో, ఐఏఎఫ్ అధికారులు మానిటరింగ్ చేశారు. కంప్యూటర్‌ కమాండ్‌ ద్వారా ఈ ఆపరేషన్‌ మొత్తాన్ని కొనసాగించారు. రెక్కలతో కూడిన వాహకాన్ని ఇలా హెలికాప్టర్‌ ద్వారా ఆకాశంలోకి 4.6 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, అక్కడి నుండి కిందకు వదలాలనుకున్న ప్రదేశంలో ల్యాండ్‌ అయ్యేలా చేసిన ఈ ప్రయోగం ప్రపంచంలోనే మొట్టమొదటిది. సరిగ్గా ఉదయం 7గంటల 40నిమిషాలకు ఈ రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ తనంతట తానుగా ఎయిర్‌ స్ట్రిప్‌పై ల్యాండ్‌ అయింది. వినూత్నంగా రూపొందించిన ఈ ఆర్ఎల్వి-టిడి ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంటిదే. లాంచ్‌ వెహికల్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ సామర్ధ్యాన్ని, సంక్లిష్టత రెండింటిని కలిగి ఉండటం దీని ప్రత్యేకత అని ఇస్రో అధికారులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ నావిగేషన్‌, గైడెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్, సూడోలైట్‌ సిస్టమ్‌, కేఎ బ్యాండ్‌ రాడర్‌, ఆల్టీమీటర్‌, న్యావ్‌ ఐసీ రిసీవర్‌ వంటి అత్యాధునిక పరిజ్ఞానంతో పనిచేసిన ఈ ఆర్ఎల్వి-స్వతంత్రంగా ఎయిర్‌ స్ట్రిప్‌పై ల్యాండ్‌ అయింది. దీని ద్వారా స్వతంత్రంగా అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్‌ చేసిన ఘనతను ఇస్రో సొంతం చేసుకుంది. ఏ మార్గం నుంచైతే ఇది ఆకాశంలోకి వెళ్లిందో తిరిగి అదే మార్గం నుంచి మనుషుల ప్రమేయం లేకుండా అంతే కచ్చితత్వంతో అంతరిక్షం నుండి ఈ రీయూజబుల్‌ లాంఛ్‌ వెహికల్‌ ల్యాంగ్‌ అయింది. ఈ ఆర్ఎల్వి -ఎల్ఈఎక్స్ కు సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం ద్వారా తక్కువ ఖర్చుతో లాంఛ్‌ వెహికల్‌ ప్రయోగాలు చేపట్టడం సుసాధ్యమవుతుందని ఇస్రో చెప్తోంది. గతంలోనే ఈ తరహా ప్రయోగాన్ని 2016లోనే ఇస్రో చేపట్టింది. దానికి మరింత సాంకేతికంగా మెరుగు పరిచి తాజాగా లాంచ్‌ చేసి విజయం సొంతం చేసుకుంది ఇస్రో.

https://twitter.com/IAF_MCC/status/1642442458280673281?t=LVsjkZjFIV4Ic46ysZJjrA&s=08

https://twitter.com/isro/status/1642392184333946882?t=GzLlkA0zdcJHIcI_HA93WA&s=08

You cannot copy content of this page