దిశ దశ, హైదరాబాద్:
దేశంలోనే సంచలనంగా మారిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో పోలీసు అధికారులే నిందితులు కావడం ఒక ఎత్తైతే… ఏకంగా ఐపీఎస్ అధికారికి ఎల్ఓసీ జారీ కావడం మరో ఎత్తైంది. తాజాగా నాంపల్లి కోర్టు సదరు అధికారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం మరో సంచలనంగా మారింది. స్టేట్ క్యాడర్ ఆఫీసర్ ఐపీఎస్ కాగా ఆయనకు ఎన్ బి డబ్లూ జారీ కాంవడం విశేషం.
ప్రభాకర్ రావు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారుల కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుపై క్రిమినల్ కేసు నమోదు అయింది. గత ప్రభుత్వ హయాంలో జరిపిన ఫోన్ ట్యాపింగ్ ఘటనలో కీలకమైన అధికారి ప్రభాకర్ రావేనని నిర్దారించుకున్న పోలీసు అధికారులు ఆయన పేరును ఏ1గా చేర్చారు. అయితే ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు అభ్యర్థించినట్టుగా తెలిసింది. అయితే తాజాగా ప్రభాకర్ రావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఆయనకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ఇన్వెస్టిగేషన్ అధికారులకు మార్గం సుగమం అయింది. మరో వైపున ప్రభాకర్ రావు తరుపున కోర్టులో పిటిషన్ దాఖలు అయినప్పటికీ ఎన్ బి డబ్లూ జారీ చేయడం విశేషం. ఆయనతో పాటు పరారీలో ఉన్న ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం విశేషం.
నేడో రేపో…
అయితే కోర్టు ఇచ్చిన ఎన్ బి డబ్లూ ఆధారంగా రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్టయితే ఆయన ఏ దేశంలో ఉన్నా వెతికి పట్టుకునేందుకు ఆయా దేశాల పోలీసు యంత్రాంగం సహకరించనుంది. రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చే వరకూ కూడా ప్రభాకర్ రావు ఇండియాలోకి అడుగు పెట్టనట్టయితే మాత్రం అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కేసు చర్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం జారీ చేసే నాన్ బెయిలబుల్ వారెంట్ రిటైర్డ్ పోలీసు అధికారి పేరిట ఇష్యూ చేయడమే తెలంగాణ పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా రెడ్ కార్నర్ జారీ వరకు సాగితే ఏ స్థాయిలో డిస్కషన్ జరగనుందో అర్థం చేసుకోవచ్చు.