బీబీసీ నెట్‌వర్క్‌కు చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసులో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలపై ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు. భారత్‌లో బీబీసీ పన్ను ఎగవేసిందన్న కారణాలతోనే ఈ సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు సంబంధించి హిందీ, తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల డిజిటల్ విభాగాలు ఢిల్లీ ఆఫీస్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ముంబైలోనూ కొన్ని ప్రాంతీయ భాషల విభాగాల ఆఫీసులు ఉన్నాయి. దాదాపుగా 60, 70 మంది ఐటీ అధికారులు ఒక్కసారిగా ఢిల్లీ ఆఫీసులోకి వచ్చి ఉద్యోగులందరి దగ్గర ముందుగా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తర్వాత సోదాలు ప్రారంభించారు.
బీబీసీ ఆఫీసు ప్రాంగణంలోకి ఐటీ అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. ఇటీవలి కాలంలో బీబీసీ ఆదాయ, వ్యయాల గురించి ఐటీ శాఖ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి భారత బీబీసీ విభాగాలకు వస్తున్న విరాళాలు, నిధులతో పాటు వాటికి సంబంధించిన సోర్స్‌ను ఆరా తీస్తున్నారు. ఇటీవల బీబీసీ విషయంలో కేంద్రం ఆగ్రహంతో ఉంది. గుజరాత్‌లో గోద్రా అల్లర్లకు సంబంధించిన ఓ డాక్యుమెంటరీని బీబీసీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
కొన్ని వారాల క్రితమే మోదీపై.. ‘ఇండియా.. ద మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ ఒక డాక్యుమెంటరీని విడదల చేసింది. రెండు భాగాలుగా దీన్ని రూపొందించింది. 2002లో మోదీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ జరిగిన అల్లర్ల గురించి చెప్పడమే ఈ డాక్యుమెంటరీని ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు.. బీబీసీపై దాడులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దాడుల్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్స్ ఫోన్స్, లాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ జప్తు చేసినట్లు వెల్లడించారు.
బీబీసీపై ఐటీ దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ‘మొదట బీబీసీ డాక్యుమెంటరీ వచ్చింది, దాన్ని నిషేధించారు. ఇప్పుడు బీబీసీపై ఐటీ దాడులు చేసింది. అప్రకటిత ఎమర్జెన్సీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.